Total Pageviews

Monday, December 12, 2011

శక్తి స్వరూపిణి





లోకంలో రకరకాల దోపిడీలు ఉన్నాయి. అన్నిటికన్నా హీనం... ఆడమనిషిని దోచుకోవడం. ఆమె కష్టం, ఆమె కులం, ఆమె బ్యాంక్ అకౌంట్, ఆమె డైరీ, ఆమె హిస్టరీ... ఆఖరికి... సమాధిలో ఆమె ‘రెస్ట్ ఇన్ పీస్’... అన్నీ దోపిడీ అయ్యేవే!!స్త్రీ జీవితాన్ని కథగా మార్చి స్క్రీన్‌పైకి ఎక్కించడం మరో రకం దోపిడీ. క్రియేటివ్ దోపిడీ! ఫూలన్‌దేవి బతికున్నప్పుడు శేఖర్ కపూర్ తీసిన ‘బాండిట్ క్వీన్’... సిల్క్ స్మిత చనిపోయాక ఇప్పుడు ఏక్తా కపూర్ విడుదల చేస్తున్న ‘ద డర్టీ పిక్చర్’...రెండూ... ఇలాంటి సృజనాత్మక దోపిడీలే!బాండిట్‌క్వీన్ సినిమాను ‘ది గ్రేట్ ఇండియన్ రేప్-ట్రిక్’ అని ఈసడించారు అరుంధతీరాయ్!‘రేప్‌లు, ఏడుపు సీన్లే నా జీవితం కాదు’ అని ఫూలన్‌దేవి దర్శక నిర్మాతలతో తగాదా పడ్డారు.నిజమే. పైపైన చూస్తే మనం చూడదలచుకున్నవి మాత్రమే కనిపిస్తాయి. గాయాలను గుండెతో తడుముతూ చూస్తే మనం చూడవలసినవి ఏమిటో తెలుస్తాయి.ఈవాళ్టి ఈ బయోగ్రఫీ... ఫూలన్‌దేవిలో మీకు దుర్గాదేవిని చూపిస్తుంది. అట్టడుగు వర్ణాల మహిళల రక్షణకు తుపాకీ పట్టుకున్న సగటు స్త్రీని దర్శనం చేయిస్తుంది.

ఫూలన్‌దేవి

ఏదీ తన కోసం కాదు!
ప్రభుత్వానికి లొంగిపోవడానికి ఫూలన్‌దేవి పెట్టిన షరతులు
తన సహచరులకు ఎనిమిదేళ్లకు మించి జైలుశిక్ష విధించకూడదు.
తన సోదరుడికి ప్రభుత్వోద్యోగం ఇప్పించాలి. తన తండ్రికి జీవనాధారంగా కొంత
భూమిని కేటాయించాలి.తన కుటుంబ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించాలి.

మహిళల కోసమే ఫూలన్ పోరాటం

తొంభైలలో ఫూలన్‌దేవి ‘ఏకలవ్య సేన’ అధ్యక్షురాలిగా అణగారిన వర్గాల మహిళల సంక్షేమం కోసం పాటుపడ్డారు. అగ్రవర్ణాలవారి దౌర్జన్యాల నుంచి తమను తాము కాపాడుకునే ఆత్మరక్షణ విధానాలను ఆమె ఆధ్వర్యంలోని ‘సేన’లు గ్రామగ్రామాన తిరిగి మహిళలకు బోధించారు పార్లమెంటు సభ్యురాలయ్యాక తన నియోజవర్గంలోని బడుగు వర్గాల మహిళల స్థితిగతులను మెరుగు పరిచే పథకాలకు రూపకల్పన చేశారు.

అవి అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.అన్యాయాన్ని భరించే పని లేదని, దోషలును చట్టానికి పట్టేంచుందుకు ధైర్యంగా ముందుకు రావాలని ప్రతి సభలోనూ, ప్రసంగంలోనూ మహిళలకు పిలుపునిచ్చారు. బాలికలకు, మహిళలకు విద్య, ఆరోగ్య సదుపాయాలను కల్పించడం కోసం కృషి చేశారు. స్త్రీ పురుష సమానత్వానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చారు.

ఢిల్లీ చల్లగా ఉంది.
జూలై జల్లులలో అప్పటికి కొన్ని గంటలుగా తడుస్తూ ఆరుతూ, తడుస్తూ ఆరుతూ ఉన్న ఆ మహానగరం... మధ్యాహ్నపు భోజనాల వేళకు జరగబోతున్న ఒక సుప్రసిద్ధ హత్యకు ఎలాంటి సంకేతాలూ లేక ప్రశాంతంగా ఉంది. సమావేశాల విరామ సమయంలో లంచ్ కోసం చిత్తరంజన్ పార్క్ ఏరియాలోని తన నివాసగృహానికి చేరుకుంటున్నారు మీర్జాపూర్ ఎం.పి. ఫూలన్‌దేవి. పచ్చటి గుబురు చెట్ల మధ్య ఉన్న ఆ భవంతి... తన యజమానురాలి కోసం మృదువైన గోధుమ రొట్టెలను, రుచికరమైన పప్పును సిద్ధం చేసి ఉంచింది. అయితే విధి ఆమెను డైనింగ్ టేబుల్ వరకు వెళ్లనివ్వలేదు. ఆమె కూర్చుని ఉన్న కారు... నివాస గృహపు ప్రారంభ ద్వారంలోకి మలుపు తిరుగుతుండగా మొదటి బులెట్ వచ్చి ఆమె తలలో దిగబడింది! వెంటనే ఇంకో బులెట్. ఇంకో బులెట్. ఇంకో బులెట్. ఇంకో బులెట్. మొత్తం ఐదు బులెట్‌లు. తలలోకి మూడు, పక్కటెముకల్లోకి రెండు.

ఫూలన్‌దేవి ఒరిగిపోయారు. ఆమె సెక్యూరిటీ ఆఫీసర్ తేరుకుని తిరుగు కాల్పుల జరిపేలోపు ఆగంతకులు పారిపోయారు.
గుబురు చెట్లు ప్రమాదకరమైనవి. ఎవరినైనా సరే దాచేయడమే వాటి స్వభావం. సొంత మనిషిని దాస్తాయి. సొంతమనిషి పొట్టన పెట్టుకోడానికి వచ్చిన మనుషులనూ దాస్తాయి. ఫూలన్ దేవిని కాల్చిచంపాక ఆగంతకులు... ఆ గుబురు చెట్ల మధ్య నుంచే తాపీగా తప్పించుకున్నారు. ఫూలన్‌ని చంపడానికి ఎంపికచేసుకున్న ఆకుపచ్చ రంగు మారుతీకారును అక్కడికి దగ్గర్లోనే ఎప్పుడూ రద్దీగా ఉండే కన్నాట్ ప్లేస్‌లో వదిలేసి నలుపు, పసుపు రంగుల్లో ఉండే ఆటోరిక్షాలో ఎక్కి పారిపోయారు.

జల్లులు మళ్లీ మొదలయ్యాయి. పెద్దవయ్యాయి.
‘ఫూలన్‌దేవి, ఎం.పి (ఎల్/ఎస్) (లోక్‌సభ)’
ఫూలన్‌దేవి ఇంటి బయట.. బంగారు వర్ణంలో ఉన్న నేమ్ ప్లేట్.. ఆగని కన్నీళ్లతో ఏకబిగిన దుఃఖిస్తోంది. నేమ్‌ప్లేట్‌కి దిగువన నేల మీద గడ్డకడుతున్న ఫూలన్ రక్తాన్ని వాననీళ్లు పలచబారుస్తున్నాయి. కొద్దిసేపటికే ఆ ప్రదేశంలో ఎర్రరంగు అదృశ్యమైపోయింది... ఫూలన్‌దేవి జీవితంలాగే!

‘ది క్వీన్ ఈజ్ డెడ్’.
ఇదీ - ఫూలన్‌దేవి చనిపోయినప్పుడు బ్రిటిష్ నేషనల్ డెయిలీ ‘ది గార్డియన్’ పెట్టిన హెడ్డింగ్! న్యూఢిల్లీలోని ఆ పత్రిక కరస్పాండెంట్ ల్యూక్ హార్డింగ్ ఫూలన్ దేవి హత్యపై సమగ్రమైన వార్తా కథనం ఇస్తూ ... ఈ హత్యకు కారణం - శక్తిమంతమైన రాజకీయ నాయకురాలిగా ఆమె అవతరించడమా? లేక అమాయకురాలైన ఒక బాలిక బందిపోటురాణిగా పునర్జన్మించడమా? అన్నది స్పష్టం కావలసి ఉంది అని రాశారు. ‘పునర్జన్మించడం’ అన్న మాటను ‘చచ్చిబతకడం’ అనే అర్థంలో ఉపయోగించారు ల్యూక్ హార్డింగ్. ఆయన సరిగ్గానే అర్థం చేసుకున్నారు. జీవితమంతా చచ్చిబతికిన స్త్రీ.. ఫూలన్‌దేవి!
ఆడవాళ్లు ఈ దేశంలో రోజూ చచ్చిబతకడం మామూలు విషయమే కావచ్చు. కానీ ఫూలన్‌దేవి లాంటి మహిళల చావు బతుకుల మధ్య... అనుక్షణ పోరాట పటిమే ఉంటుంది. పగ ఉంటుంది. ప్రతీకార జ్వాల ఉంటుంది. తనలా ఏ స్త్రీనీ ఆధిక్యాలకు, అహంకారాలకు బలికానీయకూడదన్న దీక్ష ఉంటుంది.

ఫూలన్‌దేవి గురించి ఇంకా బాగా తెలుసుకోవాలంటే చంబల్‌లోయల్ని అడగాలి. అక్కడి గాలుల్ని పీల్చాలి. అక్కడి అగాధాలలోకి తొంగి చూడాలి. అక్కడి శిఖరాలలోకి తలెత్తాలి. అక్కడి కొండల్లో, కోనల్లో కలియతిరగాలి. అవి మనకు.. తెల్లారే లేచి ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్లే వన్యప్రాణుల గురించి చెప్తాయి. చీకటి పడగానే తుపాకీలను ధన్‌ధన్ మని పేల్చుకుంటూ గ్రామాల్లోకి చొరబడే బందిపోట్ల గురించి చెప్తాయి.
చంబల్‌లో చట్టం లేదు. న్యాయం లేదు. అడవిలో క్రూర మృగాలకు, అడవి బయట మగాళ్లకు తేడా లేదు. అలాంటి చోట పుట్టిన ఆడకూతురు... ఫూలన్‌దేవి.

భారంగా ప్రవహిస్తున్నట్లుండే యమునా నదికి ఒడ్డున - గొర్హా కా పుర్వా గ్రామంలోని త్రికోణాకారపు మట్టి గుడిసెల సమూహాల మధ్య - ఒక గుడిసె ఆమెను ప్రసవించింది.
‘‘బంగారం పుట్టింది చూడండి’’ అంది తల్లి.
‘అయినా సరే ముట్టను’ అన్నట్లు చూశాడు తండ్రి.
పసిగుడ్డు తల్లి చేతుల్లో నిలవడం లేదు. తండ్రి వైపు చేతులు చాస్తోంది. తండ్రి పట్టించుకోవడంలేదు. అతడేవో లెక్కలు వేస్తున్నాడు. అవి కుదరక మళ్లీ వేస్తున్నాడు. అలా పదకొండేళ్లు వేశాడు. ఆఖరికి లెక్క తేలింది. కూతుర్ని ఆమె కన్నా మూడు రెట్లు ఎక్కువ వయసున్న వరుడికి అమ్మేసి, బదులుగా వచ్చిన సైకిల్‌ని, ఆవును అపురూపంగా తడిమి చూసుకున్నాడు. ఫూలన్ తల్లి నెత్తీనోరు బాదుకుంది.
‘‘ఏం చేసుకుంటాం, ఇంట్లో పెట్టుకుని కోసుకుంటామా?’’ అన్నాడు దేవిదిన్ నిషాద్. అతడిప్పుడు తండ్రి కాదు. పచ్చి వ్యాపారి.
‘‘అలాగని పిల్ల గొంతు కోస్తామా?’’ అని కన్నీళ్లు పెట్టుకుంది ముల్లాదేవి. ‘‘బిడ్డకు బొడ్డుతాడైనా తెగలేదు’’ అంటూ ఫూలన్‌దేవిని గుండెకు బలంగా అదుముకుంది.
ఎప్పుడొచ్చాడో ఏమో... తల్లినుంచి బిడ్డను బలంగా లాక్కున్నాడు పుట్టీలాల్.
ఫూలన్‌ని కొనుక్కుంది అతడే! అక్కడికి కొన్ని వందల మైళ్లు దూరం అతడుండే గ్రామం.
‘‘నేను వెళ్లనమ్మా’’ అని చిన్నారి ఫూలన్ తన తల్లిని గట్టిగా పట్టుకుని ఏడ్చింది. ముల్లాదేవీ ఏడ్చింది. ఇద్దరి కన్నీళ్లను కలుపుకున్న యమునా నది ఆవేళ మరింత భారంగా వంపు తిరిగింది. చంబల్‌లోయ ఆడకూతుళ్ల కన్నీళ్లను కడవల కొద్దీ, కడుపుకోతల కొద్దీ మోసుకెళ్తూ, వారి గుండె బరువును తగ్గించేందుకే పుట్టిందో ఏమో యమునమ్మ!

వయసొస్తున్న అమ్మాయి మాటిమాటికీ నవ్వుతుంటుంది. మాటిమాటికీ కలలు కంటుంది. మాటిమాటికీ నాన్న మెడ చెట్టూ చేతులు వేస్తుంది. మాటిమాటికీ అమ్మ చేత వాత్సల్యపు తిట్లు తింటుంది. కానీ ఫూలన్... మాటిమాటికీ అత్యాచారానికి ‘అందుబాటు’ అయింది!
మొదటిసారి పదకొండేళ్లప్పుడు... ముప్పైలలో ఉన్న ఆమె భర్త పట్టీలాల్‌కు ఆమె అందుబాటు అయింది.

పదహారేళ్లప్పుడు పెదనాన్న కొడుకు మయాదిన్ ఆమెను అన్యాయంగా జైల్లో పెట్టించినప్పుడు అక్కడి పోలీసులకు మూడురోజుల పాటు అందుబాటులో ఉంది.
చంబల్‌లోయ బందిపోట్లు... ఇళ్లల్లో పడి బిందె, తపేళాలతో పాటు ఆమెను కూడా అపహరించుకుని వెళ్లినప్పుడు బందిపోటు నాయకుడు బాబు గుజ్జర్‌కు, అతడి కేడర్‌కు అందుబాటులోకి వచ్చింది.

ముఠాల అధిపత్య పోరులో అధికారం చేతులు మారిన ప్రతిసారీ ఒక ఆస్తిహక్కుగా నాయకత్వానికి అందుబాటులోకి వెళ్లింది.
చిన్న కులాలపై ప్రతీకారంగా పెద్ద కుల ఠాకూర్‌లు ఆమెను కిడ్నాప్ చేసి బెహ్మాయ్ గ్రామంలో నిర్బంధించినప్పుడు అగ్రవర్ణ దురహంకారానికి పదేపదే అందుబాటు అయింది.
ఇదంతా ఇరవై ఏళ్లలోపే! చిన్న జీవితంలో ఎంత పెద్ద కష్టం!
అలాగని ‘అందుబాటు’ ఒక్కటే ఫూలన్‌దేవి జీవితం కాదు. అన్యాయాలపై తిరగబడేందుకు తప్ప ఏరోజూ ఆమె వెచ్చని తేనీటితో ఉషోదయాన్ని ఆస్వాదించడానికి నిద్ర లేవలేదు!
దొరల దౌర్జన్యాలపై ఆమె తుపాకీ గురిపెట్టింది. ఉన్నవాళ్లను కొట్టి లేనివాళ్లకు పెట్టింది. బెహ్మాయ్‌లో తనకు జరిగిన అవమానానికి గుండె పగిలి, మనిషి రగిలి ఇరవై రెండు మంది క్షత్రియులను వరుసగా నిలబెట్టించి కాల్చి చంపింది. తన ఇరవయ్యవ ఏట ప్రభుత్వానికి లొంగిపోయింది. పదకొండేళ్లు జైలు శిక్ష అనుభవించింది. రాజకీయాల్లోకి వచ్చింది. ఎం.పి. అయి, నియోజకవర్గ ప్రజలకు శుభ్రమైన జీవితాన్ని ప్రసాదించింది.

1999లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో - ‘‘ప్రజలకు మీరేం చేయబోతున్నారు?’’ అనే ప్రశ్నకు - ‘‘నిరుపేద కుటుంబాలలోని ఆడవాళ్లకు సమాన అవకాశాలు ఉండాలి. వాళ్లు చదువుకోవాలి. వాళ్లు ఉద్యోగాలు చెయ్యాలి. వాళ్లు ఆరోగ్యంగా ఉండాలి. వాళ్లకు రక్షణ ఉండాలి. ఇవన్నీ చేస్తాను’’ అన్నారు ఎం.పి. ఫూలన్‌దేవి.

నిజమే. ఈ దేశంలో స్త్రీలకు ఏం కావాలో ఫూలన్‌దేవికి తెలిసినంతగా మరే రాజకీయ నాయకురాలికీ తెలిసే అవకాశం లేదు. స్త్రీగా అంతటి గడ్డు జీవితాన్ని గడిపారు ఫూలన్. యుమునా ఉపనది చంబల్‌లో ఎన్ని మలుపులున్నాయో ఫూలన్ జీవితంలోనూ అన్ని మలుపులు ఉన్నాయి. ఏనాడూ ఆమె స్థిమితంగా లేదు.

అయితే ఏనాడూ అధైర్యపడలేదు! దీనంగా, అసహాయంగా చేటలో బియ్యం ఏరుతూ కూర్చోలేదు. అందుకే శేఖర్ కపూర్ తనపై తీసిన ‘బాండిట్ క్వీన్’ సినిమా చూడగానే ఆమెకు కోపం తన్నుకొచ్చింది. అది తన జీవితానికి మరీ అంత దగ్గరగా ఏం లేదని ఆమె ఆరోపణ. శేఖర్ చాలా చోట్ల తనను బేలగా చూపించడం ఆమెకు నచ్చనే నచ్చలేదు. వెంటనే సినిమాను బ్యాన్ చెయ్యకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. సినిమా రిలీజ్ అవడం, ఫూలన్‌దేవి జైలు నుంచి విడుదల కావడం దాదాపు ఒకే సమయంలో జరిగాయి. దాంతో వివాదం పెద్దదైంది. కోర్టు వరకు వెళ్లింది. చివరికి అరవై వేల డాలర్ల నష్టపరిహారం చెల్లించి చిత్ర నిర్మాతలు కేసు నుంచి బైటపడ్డారు.
శేఖర్ కపూర్‌కి ఒక విషయం అర్థమైవుంటుంది.
ఫూలన్ అబల కాదని!

రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో కలకలం మొదలైంది.
మధ్యాహ్నం 1.30 కి కాల్పులు జరిగితే, ఫూలన్‌దేవిని ఆసుపత్రికి తెచ్చేసరికి 1.40 అయింది. ‘బ్రాట్ డెడ్’ అని ప్రకటించారు వైద్య అధికారులు. స్ట్రెచర్‌ను బయటికి తెస్తున్నారు. తెల్లటి గుడ్డలో చుట్టి ఉంది ఫూలన్‌దేవి మృతదేహం. ఫూలన్‌దేవిని దుర్గాదేవిగా ఆరాధించే నిరుపేదలు, అభిమానులు స్ట్రెచర్‌ని కదలనివ్వడం లేదు. అమెను ఒక్కసారైనా చూడాలని, కనీసం ఒక్క వేలితోనైనా తాకాలని ఆరాటపడుతున్నారు. రాజకీయనాయకులు, మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకునేలోపే ఆసుపత్రి పరిసరాలను క్లియర్ చెయ్యాలని పోలీసులు తొందరపడుతున్నారు. పోస్టుమార్టమ్ లోహియాలో జరుగుతుందో, ఎయిమ్స్‌లో జరుగుతుందో ఎవరికీ సమాచారం లేదు.

పార్లమెంటులోని ఉభయ సభలూ ఒకటి లోహియాలా, ఇంకొకటి ఎయిమ్స్‌లా తత్తరపడుతున్నాయి! పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్ టీవీలో ఫ్లాష్ న్యూస్ చూసి చెప్పేవరకు లోపల ఉన్నవారికి ఏం జరిగిందీ తెలీదు. అరగంట తర్వాత హోమ్ మంత్రి ఎల్.కె.అద్వానీ అధికారికంగా ఫూలన్‌దేవి మరణవార్తను ప్రకటించేవరకు కారిడార్లలో పరుగుల చప్పుడు ఆగలేదు.

ఉన్నవాళ్లు బతికినట్లే... లేని వాళ్లూ బతకాలి



ఎం.పి.గా మీ లక్ష్యం ఏమిటి?
డబ్బున్న వాళ్లు బతికినట్లే డబ్బు లేని వాళ్లూ బాగా బతకాలి. పెద్ద కులాలు బతికినట్లే చిన్న కులాలూ ధీమాగా బతకాలి. మీ దేశంలో మహిళ స్థితి మెరుగవుతోందని మీడియా రాస్తోంది! స్త్రీ పురుష సమానత్వం రాకుండా స్త్రీల జీవితం మెరుగవడం అసాధ్యం.
గ్రామీణ ప్రాంతాలలో స్త్రీలపై జరుగుతున్న హింసను నివారించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లున్నారు?
గ్రామాల్లో స్త్రీల జీవితాలు రక్షణకు దూరంగా, హింసకు అనువుగా అంటాయి. వారిలో చైతన్యం తేవాలి.మీరు తారసపడినప్పుడు అగ్రవర్ణ మహిళల మనోభావాలు ఎలా ఉంటాయి?
చిరునవ్వు నవ్వుతారు. మర్యాద ఇచ్చి మాట్లాడతారు. మహిళల కోసం మీరు పోరాడుతున్నారు కదా అంటారు. మీ గురించి వాళ్లు ఏమనుకుంటారని మీకు అనిపిస్తుంది?
తను కూడా ఒక మహిళే కదా అనే సహానుభూతి ఉండొచ్చు.

పార్లమెంటు రెండు నిమిషాలు మౌనం పాటించింది.
ఆ మౌనం... పార్లమెంటు బయట ప్రతిధ్వనించింది!
ఉత్తరప్రదేశ్ మలిన రాజకీయాలు తమ నాయకురాలిని పొట్టనపెట్టుకున్నాయని సమాజ్‌వాదిపార్టీ అగ్రనాయత్వం సంకీర్ణ ప్రభుత్వంపై విరుచుకుపడింది.
ఫూలన్‌దేవి అనుచరులు, స్నేహితులు, సన్నిహితులు, బడుగువర్ణాలవారు గొంతు కలిపారు. హత్య వెనుక ఎవరున్నారో న్యాయ విచారణ జరపాలన్నారు.
మెట్టినింటికి వెళ్లనని అమ్మను కావలించుకుని ఏడ్చిన అమ్మాయి ఎక్కడ? ఒక దేశాన్నే కదిలించేంత అధికారాన్ని, కన్నీళ్లు పెట్టించేంత అభిమానాన్ని సంపాదించిన ముప్పై ఎనిమిదేళ్ల మహిళ ఎక్కడ? మధ్యలో ఏం జరిగింది? ఫూలన్‌దేవి బందిపోటు రాణిగా, పార్లమెంటు సభ్యురాలిగా రూపాంతరం చెందడానికి విధి కదిపిన పావులు ఏమిటి?
ఒక చదువు లేని అమ్మాయి, డబ్బు లేని అమ్మాయి, అగ్రవర్ణం వెలి వేసిన అమ్మాయి... జీవితంతో ఎందుకు చదరంగం ఆడింది? ఆడి ఎలా గెలిచింది?

పన్నెండేళ్ల వయసులో -
ఫూలన్‌దేవి మొదటి గెలుపు... భర్త ఇంటి నుంచి పారిపోయి రావడం!
రెండో గెలుపు... ‘‘ఈ భర్త నాకు వద్దే వద్దు’’ అని అమ్మకి, నాన్నకి, అన్నకి, అక్కకీ, ఊరు మొత్తానికీ చెప్పేయడం.
మూడో గెలుపు... మయాదిన్‌తో తలపడడం.
తలపడడం మాత్రమే గెలుపు అవుతుందా? అవుతుంది! అన్యాయాన్ని చూస్తూ ఊరుకోవడం ఓటమి అయితే, తలపడడం తప్పని సరిగా గెలుపే అవుతుంది. ఓడామా గెలిచామా అని కాదు, అసలు పోరాడడమే గెలుపు.
మయాదిన్ మొరటు మనిషి. చిన్నాన్న కొడుకు. వాడొచ్చి తన తండ్రి పొలంలో రాయి పాతాడు. ఎకరా చెక్క అది. దాన్ని కాజేయడానికి వచ్చాడు. తండ్రి చూస్తూ ఊరుకున్నాడు. ఫూలన్‌దేవి ఊరుకోలేకపోయింది. అక్కను వెంటేసుకుని వెళ్లి పొలం మధ్యలో కూర్చుంది. ‘‘నువ్వు దొంగవి. ఫో... ఇక్కడి నుంచి’’ అని పెద్దగా అరిచింది. పుట్టీలాల్‌కు తనను కట్టబెట్టించింది మయాదినే. ఆ కోపం కూడా ఉంది ఫూలన్‌దేవిలో. కోపాన్ని కోర్టువరకూ తీసుకెళ్లింది.
కేసు గెలవలేదు. కానీ కేసు పెట్టించడం గెలుపే.

పొలం నిలువ లేదు. కానీ నిలుపుకోడానికి ఇటుక పెడ్డ అందుకోవడం గెలుపే.
ఎంత మొత్తుకున్నా మళ్లీ మళ్లీ భర్తతో వెళ్లక తప్పలేదు. కానీ... వెళ్లిన ప్రతిసారీ దౌర్జన్యంపై ఎదురు తిరిగి పుట్టింటికి వచ్చేయడం గెలుపే.
‘‘అతడంత చెడ్డవాడు లేడు’’ అని భర్త గురించి ఫూలన్‌దేవి తన బయోగ్రఫర్ మాలాసేన్‌కు చెప్పి మరీ రాయించారు. మగజాతి మీద ఫూలన్‌దేవికి ద్వేషం కలగడానికి కారణమైన మయాదిన్ గురించి కూడా ఆమె ఆత్మకథలో ఉంది. ఇంటికో మయాదిన్, ఇంటికో పుట్టీలాల్ ఉన్నందు వల్లనే ఆడవాళ్ల జీవితాలు ఇలా ఏడుస్తున్నాయి అనే మాట కూడా పుస్తకంలో ఉంది.
1983-1994 మధ్య ఫూలన్‌దేవి జైల్లో ఉన్నప్పుడు తరచు ఆమెను కలుస్తూ పుస్తకం పూర్తి చేశారు మాలాసేన్. ఫూలన్‌కు చదవడం రాదు, రాయడం రాదు. కాగితాలపై ప్రశ్నలు రాసి గ్వాలియర్ జైలుకు పంపేవారు మాలా. మూడో వ్యక్తి చేత సమాధానాలు రాయించి సేన్‌కు పంపేవారు ఫూలన్.
ఫూలన్ కంటే ముందు 1991లో ‘ఇండియాస్ బాండిట్ క్వీన్: ది ట్రూ స్టోరీ ఆఫ్ ఫూలన్ దేవి’ విడుదలైంది. ఫూలన్ వ్యక్తిగత జీవితం గురించి చాలా వరకు ఈ పుస్తకం ద్వారానే ప్రపంచానికి తెలిసింది. మాలాను ఫూలన్ ‘దీదీ’ అనేవారు.
అంతకు ముందెక్కడా తన గురించి చెప్పుకోని ఈ చెల్లెలు అక్క దగ్గర మనసు విప్పింది.
‘‘నేనొక్కదాన్నే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు నాలాంటి వాళ్లు’’ - ఇదీ ఫూలన్ ప్రారంభ వాక్యం!


‘నాలాంటి వాళ్లు’ అంటే - తక్కువ కులంలో పుట్టిన ఆడవాళ్లు అని. వాళ్లను ఎవరూ మనుషుల్లా చూడరు. పెద్ద కులాల వారు ఎలాగూ చూడరు సరే, ఊర్లోకి వచ్చే బందిపోట్లు అసలే చూడరు సరే... ఇంట్లో మగాళ్లకు ఏమైంది? వాళ్ల చెల్లెలే కదా, వాళ్ల అక్కే కదా, వాళ్ల భార్యే కదా... వాళ్ల కూతురే కదా. ఎందుకని దగ్గరికి తీసుకోరు? ఎందుకని బయటి వెధవలనుంచి కాపాడుకోలేరు?
ఫూలన్ రక్తం ఉడుకుతోంది. ఇరవై ఏళ్ల ప్రాయంలో ఉన్న రక్తం!
ఓ రాత్రి ఆమె నిద్రపోతుంటే ఎవడో వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. వాడి చేతిలో తుపాకీ ఉంది. వాడి వెనుక తుపాకులు పట్టుకుని ఉన్న బందిపోట్లు ఉన్నారు. తన చేతిలో ఉన్న తుపాకీని వారిలో ఒకడికి విసిరి, ఫూలన్‌ని రెండు చేతుల్లోకి ఎత్తుకుని చీకటి లోయల్లోకి గద్దలా తన్నుకుపోయాడు వాడు. డెబ్బై రెండు గంటల పాటు ఆమెను వేధించి వేధించి ఉసురు తీసినంత పని చేశాడు.

అతడి పేరు బాబు గుజ్జర్. బందిపోటు నాయకుడు!! అందుకు భయపడలేదు ఫూలన్. రాయికో బండకో పుట్టినట్లు ఉంటాడు.. అందుకు భయపడలేదు ఫూలన్. కోపమొస్తే కాల్చిపడేస్తాడు. అందుకు భయపడలేదు ఫూలన్. అతడు పెద్దకులం వాడు! అందుకు భయపడింది. ఈ పెద్దకులాల వాళ్లు... ప్రాణం తియ్యడానికి ముందు, ఆత్మగౌరవాన్ని తీసేస్తారు. ఆ తర్వాత ప్రాణం ఉన్నా ఒకటే పోయినా ఒకటే.
మోకాళ్ల మీద తలవాల్చి కన్నీళ్లు తుడుచుకుంటోంది ఫూలన్. ఎనిమిది వేల చదరపు మైళ్ల చంబల్ చీకట్లలో ఆ రాత్రి తనెక్కడ ఉందీ తెలియడం లేదు.
ఎవరో వచ్చి మళ్లీ చెయ్యిపట్టుకున్నారు. ఉలిక్కిపడి లేచింది ఫూలన్ దేవి.
‘‘భయపడకు. వాణ్ణి చంపేశా’’ అన్నాడతడు.
‘‘ఎవర్ని?!’’
‘‘వాడే, ఆ కులం పొగరు గాడిద... బాబు గుజ్జర్. వాడి చెయ్యి ఇక నీ మీద పడదు. వెళ్లి, యమునలో ఒళ్లు కడుక్కో’’ అన్నాడు.
అతడు విక్రమ్ ముల్లా.
బాబు గుజ్జర్ బాషలో ‘కడజాతి నా కొడుకు’.
గుజ్జర్‌ని కాల్చి చంపే క్షణం వరకు గుజ్జర్ అనుచరుడు!
విక్రమ్ వైపు కృతజ్ఞతగా చూసింది ఫూలన్. లతలా అతడిని అల్లుకుపోయింది. ఆమె కన్నీళ్లు అతడి భుజాన్ని తడిపేస్తున్నాయి.
‘‘ఏడవకు... లే’’ అన్నాడు. తుపాకీని చేతికి అందించాడు. ఆశ్చర్యంగా చూసింది ఫూలన్.
‘‘నేనున్నా లేకున్నా ఇది నీ పక్కన ఉండాలి’’ అన్నాడు. ఫూలన్ భయపడింది. అతడి పెదవుల్ని మూసింది. ఆ చేతి వేళ్లను ముద్దాడాడు విక్రమ్.
చంబల్‌లో ఇంకొక బందిపోటు ముఠా ఆవిర్భవించింది! విక్రమ్, ఫూలన్ కలిసి రైళ్లను పేల్చేస్తున్నారు. పెద్ద కులాల ఇళ్లను తగలబెడుతున్నారు. హత్యలు, కిడ్నాపులు చేస్తున్నారు. ఫూలన్ ఇప్పుడు సంతోషంగా ఉంది. పగతీర్చుకుంటోంది. ఆడవాళ్ల నుంచి ఆమెకు విజ్ఞప్తులు అందుతున్నాయి. ఒళ్లు దగ్గర పెట్టుకుని కాపురం చెయ్యమని వాళ్ల మగవాళ్లకు ఆదేశాలు అందుతున్నాయి. ఏడాదిలో ఈ దంపతులు చంబల్ లోయలో చెట్లకు చిగుర్లయ్యారు. ఊళ్లో ఉయ్యాల తొట్లకు పేర్లయ్యారు. సరిగ్గా ఏడాది. అంతే.

ఓరోజు అకస్మాత్తుగా ఫూలన్‌దేవికి అతి సమీపంలోంచి తుపాకీ చప్పుడు వినిపించింది! ‘‘ఏం జరుగుతోందో తెలియడం లేదు. విక్రమ్ హఠాత్తుగా నేలపై కూర్చున్నాడు. పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టారని అనుకున్నాను. నేను మా రైఫిల్స్ కోసం చూశాను. అప్పటికే అవి అక్కడ లేవు! మరుక్షణం విక్రమ్ పూర్తిగా ఒరిగిపోయాడు’’ అని ఫూలన్ తన ఆత్మకథ రాస్తున్న మాలాకు చెప్పారు.

ఆవేళ అక్కడి వచ్చింది పాత ముఠా సభ్యులు శ్రీరామ్, లాలారామ్. వచ్చి నేరుగా విక్రమ్‌ని కాల్చేశారు. కులం తక్కువ వాడు ముఠా నాయకుడు కావడమేంటని వారి ఆగ్రహం. విక్రమ్‌ని చంపాక, ఫూలన్‌ని వాళ్లు బందీగా పట్టుకున్నారు. చేతులు కాళ్లు కట్టేసి మారుమూల గ్రామం బెహ్మాయ్‌కి లాక్కుపోయారు. అగ్రవర్ణ ఠాకూర్‌లు ఒకర్నుంచి ఒకరు ఆమెను మార్చుకున్నారు. ఒకనాటి హింస కాదది. రోజులు, వారాల పాటు సాగిన ఉన్మాదం. అక్కడితో ఆగలేదు. ఫూలన్‌దేవిని దిగంబరంగా మార్చి ఊరంతా తిప్పారు. ఆమె ఒంటిపై కనిపిస్తున్న పచ్చి గాయాలను ఆ ఊరి గాలి కూడా తాకే సాహసం చేయలేకపోయింది. ఠాకూర్‌లు తుపాకులు పట్టుకుని ఆమె వెంటే నడిచారు. ఫూలన్‌దేవిని బందిపోటు రాణిగా మార్చిన ఘటన అది! ఆడవాళ్లెవరో చాటుగా కొంగు అడ్డు పెడితే అక్కడి నుంచి ఫూలన్ తప్పించుకుపోగలిగింది.

ఢిల్లీ దారులన్నీ మెరుపు వేగంతో ఎక్కడికక్కడ బ్లాక్ అవుతున్నాయి. పోలీసులు ఎవర్నీ వదలకుండా సోదాలు చేస్తున్నారు. సి.ఐ.ఎం.907 అనే నంబర్ ప్లేటు, ఆ నెంబరు ఉన్న ఆకుపచ్చరంగు మారుతి 800, దానిపై ఉన్న వేలి ముద్రలు తప్ప వారికి ఇంకేమీ దొరకలేదు.
ఫూలన్‌దేవిని ఎవరు చంపి ఉంటారు? లిస్ట్ చాలా పెద్దది. 1983 వరకు ఆమె బందిపోటుగా ఉన్నారు. 1994 వరకు ఆమె జైల్లో ఉన్నారు. 1996 నుంచి అమె ఎం.పీగా ఉన్నారు. రాజకీయ శత్రువులు, పోలీసు అధికార శత్రువులు, బందిపోటు శత్రువులు... వీరిలో ఎవరైనా ఆమెను చంపి వుండొచ్చు. అసలు వీళ్లెవరూ కాదనుకుంటే మిగిలింది... బెహ్మాయ్‌లోని అగ్రవర్ణాలవారు!
వాళ్లెందుకు చంపి ఉంటారు? ఎందుకో దేశం మొత్తానికీ తెలుసు!
అప్పటికి ఇరవై ఏళ్ల క్రితం -

బెహ్మాయ్ నుంచి తప్పించుకుని వెళ్లిన పదిహేడు నెలల తర్వాత 1981 ఫిబ్రవరి 14న తిరిగి బెహ్మాయ్ చేరుకుంది ఫూలన్‌దేవి. అయితే ఆమె ఫూలన్‌దేవిలా లేదు. బందిపోట్ల పని పట్టడానికి స్టెన్‌గన్‌తో వచ్చిన పోలీసులా ఉంది. ఖాకీ ప్యాంటు, ఎర్రటి షాల్, అంతకన్నా ఎర్రనైన తలగుడ్డ, వెనుక కొంతమంది అనుచరులు. వాళ్లు కూడా పోలీసు దుస్తుల్లోనే ఉన్నారు. గ్యాంగ్ నేరుగా గ్రామంలోకి చొరబడింది. ఫూలన్‌దేవి పెద్దగా అరుస్తూ గ్రామంలోని పెద్దకులాల మగవాళ్లను బయటికి రమ్మని ఆదేశించింది. శ్రీరామ్, లాలారామ్‌లను పట్టివ్వకపోతే ఒక్కొక్కరూ చస్తారని హెచ్చరించింది. ఆ ఇద్దరూ దొరకలేదు. దాంతో గ్రామంలో కనిపించినవాళ్లను కనిపించినట్లు ఇరవై రెండు మందిని ఫూలన్ గ్యాంగ్ ఒక కాల్చి చంపింది.

గ్రామంలో సంచలనం. రాష్ట్రంలో సంచలనం. దేశంలో సంచలనం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వి.పి.సింగ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఆ ఘటనతో ఫూలన్‌దేవి బందిపోటు రాణిగా అవతరించింది. దుర్గామాత అవతారంలో ఉన్న ఫూలన్‌దేవి ఫొటోలు ఉత్తర ప్రదేశ్ మార్కెట్‌లను ముంచెత్తాయి. మీడియా ఆమెను ‘అయిగిరి నందిని, నందిత మేదిని విశ్వవినోదిని’గా ప్రజెంట్ చేసింది.

కానీ ఆమె ఆ ఇరవై రెండు కుటుంబాలకు శత్రువు. ఆ కుటుంబాల వెనుక ఉన్న కులాలకు శత్రువు. ఒక నరహంతకిగా మాత్రమే వాళ్లు ఆమెను చూడ లేదు. భారతీయ వర్ణవ్యవస్థను తుపాకీ గొట్టంతో ప్రశ్నించిన ప్రమాదకరమైన సాంస్కృతిక దుష్టశక్తిగా చూశారు. కాబట్టి వాళ్లలోనే ఇద్దరో, ముగ్గురో ఢిల్లీ వచ్చి, కాపుగాసి ఆమెను చంపి ఉండాలి.
ఫూలన్ హంతకుల హంట్ మొదలయింది. ఆమె కేవలం ఒక బందిపోటుగా చనిపోతే ఇంత హైరానా ఉండేది కాదు. ఫూలన్ దేవి... నిమ్న కులాల హార్ట్‌బీట్.

ఫూలన్ హత్య జరిగినప్పుడు నేరస్థుల కోసం ఎలాగైతే హంట్ మొదలైందో, అంతకు పదింతల హంట్ బెహ్మాయ్ ఊచకోత తర్వాత ఫూలన్ కోసం మొదలైంది. రెండేళ్ల పాటు పోలీసులు ఆమె కోసం గాలించి గాలించి అలిసిపోయారు. కొందరసలు గాలించకుండానే అలసిపోయారు!
అంతే మరి. ఎంత పోలీసులైతే మాత్రం ‘గ్రామదేవత’ ను పట్టుకుంటానంటే వాళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు చూస్తూ ఊరుకుంటారా? స్థానిక యువకులకైతే మరీనూ. ఫూలన్‌దేవి వాళ్లకు ‘దాశ్యూ సుందరి’.

అంటే అందమైన బందిపోటు. చంబల్ హీరోయిన్. దుర్మార్గాన్ని అంతం చూసే గుణమే ఆమెను అందాల నాయికగా మార్చింది. ఇంతా చేసి నేరుగా ఎవరూ ఆమెను చూడలేదు. నేరుగా ఎవరికీ ఆమె కనిపించలేదు. ఒక మెరుపు. ఒక ఉరుము అంతే. ఒక మనిషిగా ఆమెను చూడ్డానికి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాలేదు. చివరికి ఫూలన్‌దేవే ప్రభుత్వాన్ని కనికరించారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల మీద తనకు నమ్మకం లేదని చెప్పి మధ్యప్రదేశ్ లోని భింద్‌లో అనుచరులతో పాటు లొంగిపోయారు. ఆయుధాలను పోలీసులకు కాకుండా గాంధీజీ, దుర్గామాతల చిత్రపటాల ముందు స్వాధీన పరిచారు.

ఫూలన్‌దేవిని చూడ్డం పోలీసులకు అదే మొదటిసారి. ఐదు అడుగులు కూడా లేని ఈవిడా రెండు రాష్ట్రాలను, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించింది అన్నట్లు చూస్తుండి పోయారు. పదివేల మంది ప్రజలు, మూడొందల మంది పోలీసులు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్‌సింగ్, ఆయనతో పాటు పదిమంది ఉన్నతాధికారుల సమక్షంలో ఐదంటే ఐదే నిమిషాల్లో ఫూలన్ సరెండర్ పూర్తయింది! అయితే ఆమెపై ఉన్న కేసుల విచారణ జరగడానికి పదకొండేళ్లు పట్టింది! యు.పి. ముఖ్యమంతి ములాయం సింగ్ యాదవ్ ఆ కేసులన్నిటినీ ఎత్తేయకపోతే ఫూలన్‌దేవి బహుశా రాజకీయాల్లోకి వచ్చేవారు కారేమో! రాజకీయాల్లోకి వచ్చినందుకే ఫూలన్‌కు రక్షణ లేకుండా పోయిందని నమ్మేవారి లాజిక్ ఇది.




పార్లమెంటు చల్లబడింది.
షేర్‌సింగ్ రాణా, ధీరజ్ రాణా, రణబీర్ అనేవారిని ఫూలన్‌దేవి హంతకులుగా యు.పి. పోలీసులు గుర్తించడంతో సమాజ్‌వాదీ పార్టీ శాంతించింది. బెహ్మాయ్‌లో ఇరవై రెండు మంది క్షత్రియులను హతమార్చినందుకు ప్రతీకారంగా ఫూలన్‌దేవిని చంపినట్లు శేర్‌సింగ్ ఒప్పుకున్నాడు. 2004లో అతడు తీహార్ జైలు నుంచి తప్పించుకున్నాడు. తిరిగి రెండేళ్ల తర్వాత పోలీసులకు పట్టుపడ్డాడు.

ఇప్పుడు విషయం ఏమిటంటే - షేర్‌సింగ్ రాణా ‘వీరోచిత’గాథ ఆధారంగా... అతడిని హీరోని చేస్తూ, దేశభక్తుడినిగా చూపిస్తూ... జగ్‌జీత్ సింగ్ వాలియా అనే వ్యక్తి యాభై కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమా తీయడానికి కొంతకాలం క్రితం చేసిన ప్రయత్నాలు మళ్లీ ముమ్మరం అయ్యాయి. చిత్రం పేరు ‘ది ఎండ్ ఆఫ్ బాండిట్ క్వీన్’.
సో... వన్ మోర్ ‘డర్టీ పిక్చర్’... కమింగ్

No comments:

Post a Comment