Total Pageviews

Monday, September 27, 2021

లవ్ స్టొరీ" మిగిలిపోయింది.... - మల్లి

ప్రేమ చుట్టూ ఉన్న అన్ని ముళ్లకంచెలు దేని చుట్టూ ఉండవు
ప్రేమ కోసం జరిగినన్ని యుద్ధాలు దీని కోసము జరగలేదేమో
కాలాలు కట్టుబాట్లు దాటి అవతల వైపున గెలిచేది ప్రేమ ఒక్కటే నేమో...

దాదాపు నేను రెండు సంవత్సరాల తర్వాత ఒక కథ గురించి విశ్లేషణ చేయాలనుకున్నాను...

ప్రేమ‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు క‌ల‌వ‌డానికి వ‌చ్చే ఇబ్బందులు ఎన్నో వాటిని తెరపై చూపించే చిత్రాలకు ఆదరణ మంచిగానే ఉంటది దర్శకులు యదార్దాలను ఆధారంగా చేసుకొని తెరపై చూపించే ప్రయత్నాలు చేస్తుంటారు అయితే అన్ని ప్రేమ కథలు జనాలు చూస్తరా లేదా అనేది దర్శకుడు ప్రేమకథను చెప్పే తీరు మీద విధానం మీద ఆధారపడి ఉంటుంది
డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌కు ఓ స్టైల్ ఉంది.  ఈసారి శేఖ‌ర్ క‌మ్ముల త‌న పంథాను మార్చుకుని ఓ డిఫ‌రెంట్ ప్రేమ‌క‌థ‌ను రూపొందించాడు
ఆ సినిమాయే ‘లవ్‌స్టోరి’. నాగ‌చైతన్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించారు. ప్రేమ‌కు అడ్డుప‌డే కులాలు, డ‌బ్బు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించిండు.

క‌థ‌:

నిజామాబాద్‌లోని ఆర్మూర్ గ్రామంలో ఉండే రేవంత్‌(నాగ‌చైత‌న్య‌) డ‌బ్బులు సంపాదించాల‌ని హైద‌రాబాద్‌కు వ‌స్తాడు. ఇంజ‌నీరింగ్ చ‌దువుకుని సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ కావాల‌ని అదే గ్రామం నుంచి వ‌చ్చిన అమ్మాయి మౌనిక‌(సాయిప‌ల్ల‌వి). బాబాయ్ అంటే చిన్న‌ప్ప‌టి నుంచి ఉండే భ‌యం, ఇంగ్లీష్ రాక‌పోవ‌డం, టెన్ష‌న్ ప‌డ‌టం వంటి కార‌ణాల‌తో మౌనిక‌కు జాబ్ రాదు. రేవంత్ త‌ను అద్దెకుండే ఇంట్లోనే జుంబా డాన్స్ స్కూల్‌ను ర‌న్ చేస్తుంటడు. లోన్ తీసుకుని స్కూల్‌ను డెవ‌ల‌ప్ చేయాల‌నుకుంటడు. రేవంత్‌, మౌనిక ఇద్ద‌రూ ప‌క్క‌ప‌క్క ఇళ్ల‌లో ఉండ‌టంతో ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచయం ఏర్ప‌డుతుంది. మౌనిక మంచిగా డాన్స్ చేస్తుంద‌ని ఓ సంద‌ర్భంలో తెలుసుకున్న రేవంత్ ఆమెను త‌న డాన్స్ స్కూల్‌లో పార్ట్‌న‌ర్‌గా జాయిన్ అవ్వమ‌ని చెబుతాడు. నెల‌కు ప‌దిహేను వేలు జీతం కూడా ఇవ్వ‌డానికి ఒప్పుకుంటడు. మౌనిక వ‌చ్చిన త‌ర్వాత రేవంత్ జుంబా డాన్స్ స్కూల్‌కు చాలా మంచి పేరు వ‌స్తుంది. స్టూడెంట్స్ పెరుగుతరు. ఆదాయం పెరుగుతది. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుడుతది. ఐతే వారి ప్రేమ‌కు ఆస్థులు, అంత‌స్థుల‌తో పాటు కులం కూడా అడ్డుగోడ‌గా నిలుస్తుంది. కులం కోసం ఎంత‌టి దారుణానికైనా పెద్ద‌లు దిగ‌జారుతర‌ని తెలుసుకున్న రేవంత్‌, మౌనిక పారిపోవ‌డానికి ఓ ప‌థ‌కం వేసుకుంటరు. ఇంత‌కీ ప్లాన్ ప్రకారం ఇద్ద‌రూ పారిపోయారా? ఇద్ద‌రి జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరిగాయి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


సమీక్ష‌:
ప్రేమ‌క‌థ‌ల‌ను తెర‌కెక్కించాల‌నుకోవ‌డం ద‌ర్శ‌కుల‌కు క‌త్తిమీద సామే. ఎందుకంటే ప్ర‌పంచ సినిమా అర‌చేతికి వ‌చ్చిన త‌ర్వాత ఎన్నో వైవిధ్య‌మైన ప్రేమ‌కథ‌ల‌ను వీక్షిస్తున్న మ‌న జనాలను మెప్పించాలంటే అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. ఇద్ద‌రు ప్రేమికులు అనుకోకుండా క‌లుసుకోవ‌డం, ప్రేమించుకోవ‌డం.. పెద్ద‌లు వారి ప్రేమ‌ను ఒప్పుకోక‌పోవ‌డంతో పారిపోవాల‌నుకోవడం, ఎదిరించ‌డం క‌థ సుఖాంతం కావ‌డ‌మో, లేక దుఃఖాంతం కావ‌డ‌మో అనే విష‌యాన్ని ఎంట‌ర్‌టైనింగ్‌గా, కొత్త‌గా చెప్పాలి. అలా కొత్త‌గా అనిపించ‌న‌ప్పుడు ప్రేక్ష‌కుడు పెద‌వి విర‌చ‌డం ఖాయం. ఆనంద్‌, గోదావ‌రి, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ వంటి ఫ్యామిలీఎంట‌ర్‌టైన‌ర్స్‌లో త‌న‌దైన ప్రేమ‌క‌థ‌ల‌ను తెర‌పై ఆవిష్క‌రించిన శేఖ‌ర్ క‌మ్ముల, ఇది వ‌ర‌కు ప్ర‌స్తావించిన‌ట్లు డిఫ‌రెంట్ రూట్‌ను ఎంచుకున్నడు. త‌నిప్ప‌టి దాకా చేయ‌ని ప్రేమ‌క‌థ‌తో ‘ల‌వ్‌స్టోరి’ని తెరకెక్కించాడ‌నే చెప్పాలి.

ఇదంతా ఒక ఎత్తైతే.. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా ఎంచుకోవ‌డం, ఈ ల‌వ్‌ట్రాక్‌కు డాన్స్ కాన్సెప్ట్‌ను జోడించ‌డం అనేది మ‌రో ఎత్తు. ఎందుకంటే సాయిప‌ల్ల‌వి బెస్ట్ డాన్స‌ర్ అన‌డంలో సందేహం లేదు. కానీ నాగ‌చైత‌న్య అలా కాదు, ఇప్ప‌టి వ‌ర‌కు డాన్స్ విష‌యంలో ఓకే అనిపించుక‌న్నాడు. మ‌రి ఈ భిన్న ధ్రువాల‌తో డాన్స్ కాన్సెప్ట్‌లో ల‌వ్‌స్టోరి అంటే నిజంగా సాహ‌స‌మే కదా, ఇక్కడ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమిటంటే నాగ‌చైత‌న్య పాత్ర‌ను తెలంగాణ యాస‌లో చిత్రీక‌రించాల‌నుకోవ‌డం. ఇది కాస్త ట‌ఫ్ జాబ్‌.. అయినా కూడా నాగ‌చైత‌న్య కూడా శేఖ‌ర్ క‌మ్ముల‌పై న‌మ్మ‌కంతో సినిమా చేయ‌డానికి ఓకే అన్నడు. సాయిప‌ల్ల‌వితో ఓ పాట‌లో పోటీ ప‌డి డాన్స్ చేసే ప్ర‌య‌త్నం అయితే చేశాడు. అది తెర‌పై క‌నిపిస్తది. అలాగే చైత‌న్య తెలంగాణ యాస‌ను కూడా మంచిగనే ప‌లికాడు. ఎమోష‌న‌ల్ యాంగిల్‌లో డిఫ‌రెంట్ లుక్‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఎక్క‌డా హీరోయిజం చూపించాల‌నే ప్ర‌య‌త్న‌మైతే చేయ‌లేదు. శేఖ‌ర్ క‌మ్ముల సినిమాను డీసెంట్‌గా త‌న‌మార్క్ డైలాగ్స్‌, సెన్సిబిలిటీస్‌తో ‘ల‌వ్‌స్టోరి’ని తెరకెక్కించిండు. సినిమాలో సాయిప‌ల్ల‌వి పాత్ర‌ను భ‌య‌స్తురాలిగా చూపించిండు. అస‌లు ఆమె భ‌యానికి త‌గ్గ కార‌ణాన్ని కూడా చివ‌ర‌లో ఎలివేట్ చేసిన తీరు బాగుంది.

చిన్న‌పిల్ల‌ల‌పై మాన‌వ మృగాలు చేస్తున్న అఘాయిత్యాల‌నే పాయింట్‌ను అంత‌ర్లీనంగా శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన తీరు ప్ర‌శంస‌నీయం. ప్రేమ‌కు కావాల్సింది కులాలు, ఆస్థులు, అంత‌స్తులు కాదు.. రెండు మంచి మ‌న‌సులు అనే విష‌యాన్ని చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. ఒక‌వైపు త‌న‌ది బ‌డుగు కులం అని ఇత‌రులు హేళ‌న చేస్తున్నా, ప‌ట్టించుకోకుండా ఎద‌గి చూపించాల‌నే క‌సి ఉన్న యువ‌కుడిగా నాగ‌చైత‌న్య పాత్ర‌ను మ‌లిచాడు డైరెక్ట‌ర్ శేఖ‌ర్‌. ఇక నాగ‌చైత‌న్, సాయిప‌ల్ల‌వి పెర్ఫామెన్స్ ప‌రంగానే కాదు, డాన్సింగ్ స్కిల్స్ చూపించడంలో ఆక‌ట్టుకున్నారు. హీరో త‌ల్లి పాత్ర‌లో ఈశ్వ‌రీరావు, హీరోయిన్ తల్లి పాత్ర‌లో దేవ‌యాని, బాబాయి పాత్ర‌లో రాజీవ్ క‌న‌కాల‌, ఇక పోలీస్ ఆఫీస‌ర్‌గా చేసిన ఉత్తేజ్ ఇత‌రులు వారి వారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు.
ఇక ఈ సినిమాకు ప‌వ‌న్ అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచింది. సినిమా విడుద‌ల‌కుముందే సారంగ ద‌రియా పాట ఎంత పెద్ద సెన్సేష‌నో కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నీ చిత్రం చూసి... ఏవో ఏవో క‌ల‌లే... పాట‌లు ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటాయి. ఇక విజ‌య్ సి.కుమార్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది.  నెరేష‌న్‌లో మ్యాజిక్ ఉంది. ఇక క‌థ‌లో ప్రీ క్లైమాక్స్ వ‌చ్చే ట్విస్ట్ మిన‌హా.. పాత క‌థ‌. అయితే త‌న స్టైల్‌కు భిన్నంగా, స‌మాజంలో ఆడ‌పిల్ల‌లు ఫేస్ చేస్తున్న 
ఓ ఇష్యూను అంత‌ర్లీనంగా సెన్సిబుల్‌గా శేఖ‌ర్ క‌మ్ముల చెప్ప‌డానికి చేసిన ప్ర‌య‌త్నం...


నా మాటలో...

ఏ వస్తువును ఏ ఇద్దరు ఒకేలా చూడలేరు...
అలాగే కొన్ని విషయాలను అందరూ ఒకేలా అంగీకరించలేరు...
తల్లి తండ్రులు కొన్నిసార్లు పిల్లలు...
ఒక కులాన్ని కారణంగా చూపి అతని వ్యక్తిత్వాన్ని, సామధ్యాన్ని అంచనా వేయడం సరికాదు...
ప్రేమకు అనేక పర్యాయపదాలున్నాయి నా దృష్టిలో ప్రేమంటే "నమ్మకం"

చివరకు కంచికి చేరని కథల్లో ఒక కథలా ఈ  "లవ్ స్టొరీ" మిగిలిపోయింది.

–------------ ------------- - మల్లి🙏

Thursday, November 3, 2016

Wednesday, November 21, 2012

నా మనసులొని బావాలను రంగులను గుర్తించిన మరొ మనసుకి నా సావాసం ఒక హరివిల్లు! -మల్లి

Tuesday, December 13, 2011

దేవిశ్రీ ప్రసాద్!

నీరసాన్ని పోగొట్టే గ్లూకోజ్... దేవిశ్రీ ప్రసాద్!
వట్టి గ్లూకోజ్ మాత్రమే కాదు...
ఫ్రెష్‌గా పిండి తీసిన బత్తాయి రసం,
షేక్ చేసి క్యాప్ లాగిన షాంపేన్ కూడా!
ఎవర్నీ కుర్చీ వెనక్కి వాలనివ్వడు. ఏ ముఖాన్నీ వేలాడనివ్వడు.
‘మూడ్స్’కి గాలం వేసి వెంట లాక్కుపోతాడు.
క్లాస్ చేత కుయ్యిన విజిల్ వేయిస్తాడు.
మాస్‌పై మంత్రజలం చల్లి మెలొడీ వినిపిస్తాడు.
అతడి మాట, పాట, ఆట... ఎవ్రీథింగ్...
ఒక రీఛార్జ్! వయసుల మధ్య కరచాలనం!!
రండి, ఇవాళ ఈ ‘మాస్’స్ట్రో మ్యూజిక్ వినేందుకు
సండేని ‘ప్లే’ చేద్దాం!




DSP
ఇంటిపేరు : గొర్తి
తల్లిదండ్రులు : శిరోమణి, సత్యమూర్తి
పుట్టింది : 1979 ఆగస్టు 2న వెదురుపాక (తూర్పు గోదావరి జిల్లా)లో
తొలి సినిమా : దేవి (1999) (తెలుగు) ఇనుదు ఇనుదు కాదల్ ఇనుదు
(తమిళం)(తెలుగు ‘ఆనందం’కి రీమేక్)
చేసిన ఆల్బమ్స్ : డాన్స్ పార్టీ, మిస్టర్ దేవి
గాయకునిగా మొదటి చిత్రం : వీరుడు
కుటుంబం : సోదరి పద్మిని (ప్రియదర్శిని ఆర్కిటెక్ట్) సోదరుడు విద్యాసాగర్ (సింగర్)
పాటల రచయితగా : {పేమంటే ఏమిటంటే (ఆనందం) వెచ్చవెచ్చగా (వంశీ)చైల చైలా (శంకర్‌దాదా MBB) ఉదయించే సూర్యుడినడిగా,ఆకాశం తన రెక్కలు (కలుసుకోవాలని)

*******

నారు పోసే వాడు నీరు పోయడు.
పోయాలని రూలూ లేదు.
అసలు- ఆ మాటకొస్తే-
నారు పోసేవాడు నీరూ పోసేస్తే ఇంక నువ్వేం పీకుతావ్?

*********

ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు మంచి కసి మీద ఉన్నారు. ఆయనకు ఒక హిట్ కావాలి. బ్రహ్మాండమైన హిట్. అంతకు ముందే ఆయన విజయశాంతితో ‘స్ట్రీట్‌ఫైటర్’ అనే సినిమా తీశాడు. ఫటాల్. బాక్సాఫీస్ దగ్గర ఢమాల్. డబ్బు పోయింది. పోతే పోయింది. అంతకు మించి ప్రొడ్యూసర్‌గా తన ఇమేజ్ దెబ్బ తింది. దారుణమైన నష్టం.
ఎమ్మెస్ రాజంటే ఎవరు?
శత్రువు, పోలీస్ లాకప్ వంటి భారీ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్.
అలాంటి తనకు ఎదురు దెబ్బా?
దీని నుంచి కోలుకోవాలి. ఒక కొత్త రకం సినిమాను బ్లాస్ట్ చేయాలి. ఆలోచించి ఆలోచించి ఆయనొక కథ అనుకున్నారు. దానికి ‘దేవి’ అని టైటిల్ పెట్టుకున్నారు. దేవతల్ని మనుషుల్ని మాయల్ని గ్రాఫిక్స్‌ని కలిపి అదరగొడదామనుకున్నారు.
అవన్నీ ఒకెత్తు. మ్యూజిక్ ఒకటీ ఒకెత్తు.
ఈ సినిమాకి మ్యూజిక్ కొత్తగా ఉండాలి. సరిగ్గా చెప్పాలంటే కొత్త మ్యూజిక్ డెరైక్టర్‌ని ఐడెంటిఫై చేసి బడ్జెట్‌ని కంట్రోల్ చేయాలి. అప్పటికే సౌత్‌లో ఏఆర్ రెహమాన్ హవా మొదలయిపోయింది. ‘రోజా’ కోసం పాతిక వేలు ఇచ్చి అంత మంచి సంగీతం రాబట్టుకున్నాడట మణిరత్నం. ఏం... అన్నింటికీ అరవం వాళ్లేనా? మన తెలుగువాళ్లు లేరా? ఏ ఆర్ రెహమాన్ అంతటివాడు కాకపోయినా ఆర్ ఏ రెహమాన్ లాంటివాడు మనకు దొరకడా?
ఎక్కడున్నాడు వాడు?

*******

మద్రాసులో చాలా ప్రిస్టీజియస్ కాలేజ్ అది. అక్కడ విజువల్ కమ్యూనికేషన్స్‌లో సీట్ రావాలంటే పురచ్చి తలైవి చెప్పినా వినరు. టాలెంట్ ఉండాల్సిందే. అలాంటి కోర్సు కోసం ఆ సంవత్సరం చాలా మంది అప్లయి చేస్తే అందులో పదిహేనుమందిని ఫిల్టర్ చేసి ఇంటర్వ్యూకు పిలిచారు. ఉన్నది పన్నెండు సీట్లు. పన్నెండూ ఇచ్చేశారు. పదమూడో వాడిగా మాట వరుసకి ఆ కుర్రాణ్ణి పిలిచారు.
చలాకీగా హుషారుగా గొంతులో షాంపేన్ పొంగుతున్నట్టుగా ఉన్నాడు ఆ కుర్రాడు.
హెడ్ ఆఫ్‌ది డిపార్ట్‌మెంట్ అతణ్ణి మార్చి మార్చి చూశాడు.
‘ఊ... నీకేనా సీట్ కావాల్సింది’
‘అవును. నాకే సార్’
‘చిన్ని చిన్ని ఆశ... పాటను మీ చెల్లాయి మీద షూట్ చేసి ఎడిట్ చేసి అప్లికేషన్‌తో పాటు జత చేసి పంపిన టేప్ నీదేనా’
’అవును నాదే సార్’
‘అదంతా నువ్వొక్కడివే చేశావా’
‘అవును.. నేనొక్కణ్ణే సార్’
హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ ఏం మాట్లాడలేదు. ఒక చిన్న స్లిప్ మీద ఏప్రిల్ 25 మధ్యాహ్నం 2 గంటలకు అని రాసి ఆ కుర్రాడికి ఇచ్చాడు.
‘ఏమిటి సార్ ఇది’
ఆ కుర్రాడు ఆశ్చర్యపోయాడు.
‘విజువల్ కమ్యూనికేషన్స్ కొత్త బ్యాచ్‌కి నువ్వు గెస్ట్ లెక్చర్ ఇవ్వాల్సిన టైము’
ఈసారి కుర్రాడు అదిరి పోయాడు.
‘అవునయ్యా. మేము మూడేళ్లలో నేర్పించేది నువ్వు ఇప్పటికే నేర్చుకుని ఉన్నావు. నీకు సీటు అక్కర్లేదు. పోయి ఇండస్ట్రీలో చేరు. ఏదైనా సినిమా తియ్యి’ అన్నాడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ జేబులో ఉన్న కర్చీఫ్ తీసి బట్టతల తుడుచుకుంటూ.
ఆ కుర్రాడు సంతోషంతో సంబరంతో వినయంతో తబ్బిబ్బయ్యాడు.
‘నిజమా సార్’
‘నిజమే’ అని ఆ హెడ్ ఆఫ్‌ది డిపార్ట్‌మెంట్ ఆగడం లేదు.
‘నువ్వు చాలా పెద్దవాడివవుతావయ్యా. చాలా పెద్ద వాడివి’... అని ఆ సంతోషంలో ఆ కుర్రాడి పేరు గుర్తుకు రాక ‘మిస్టర్...’ అంటుంటే ఆ కుర్రాడు అందించాడు-
‘దేవి శ్రీ ప్రసాద్’

*******

ఇంట్లో ఎప్పుడూ తిట్టుకుంటూ ఉంటే పిల్లలకు తిట్లు వస్తాయి. ఇంట్లో ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటే పిల్లలకు కొట్లాటలొస్తాయి. ఇంట్లో ఎప్పుడూ పేకాడుతుంటే పిల్లలకు పేకముక్కలు తెలుస్తాయి. ఇంట్లో కాసిన్ని మంచి మాటలు మాట్లాడుకుంటుంటే పిల్లలకు బోలెడన్ని సంస్కారపు తునకలు అందుతాయి.
అదృష్టం. ఆ ఇంట్లో ఎప్పుడూ మంచి పాటలు వినిపించేవి. మంచి మాటలు వినిపించేవి. మంచి సినిమాలు ప్లే అయ్యేవి. మంచి మంచి సృజనకారుల రాకపోకలుండేవి.
ఆ ఇల్లు సినీ రచయిత సత్యమూర్తిది.
తను లోప్రొఫైల్‌లో ఉన్నా తన మాటలతో స్క్రిప్ట్‌తో సినిమాలను హై రేంజ్‌కు తీసుకెళ్లిన రచయిత ఆయన. దేవత... బావా మరదళ్లు... ఖైదీ నెంబర్ 786... పుణ్యస్త్రీ... ఛాలెంజ్... చంటి... పెదరాయుడు... బంగారు బుల్లోడు... అన్నీ ఆయన సినిమాలు. హిట్ సినిమాలు.
అయితే రాయడం మాత్రమే ఆయనకు తెలిసిన విద్య కాదు. ఇంకా చాలా తెలుసు. మంచి ఫొటోగ్రఫీ తెలుసు. మంచి సంగీతం తెలుసు. మంచి సంగీతాన్ని అప్రీషియేట్ చేయడం తెలుసు. మంచి కళను పిల్లలకు పరిచయం చేయడం తెలుసు. అప్పుడప్పుడు తనే పాటలు రాసుకొని తనే బాణీలు కట్టుకొని సరదాగా పాడుకుంటూ ఉండేవారు. ఆ వైబ్రేషన్స్ ఆ ఇంట్లో నిలిచిపోయాయి. అవి ఆ ఇంటి పెద్ద కొడుకు దేవిశ్రీ ప్రసాద్‌ను తాకాయి.
‘అమ్మా... సంగీతం నేర్చుకుంటా’ అన్నాడొక రోజు తల్లితో.
తల్లికి సంతోషం వేసింది. ఎందుకంటే ఆమెకూ సంగీతం అంటే ప్రాణం. పైగా ఆమె తల్లి మంచి గాయని. ఏమో... ఆ లక్షణమే వీడికీ వచ్చిందేమో. కాని వీడు అడుగుతున్నది ఆషామాషీగానా సీరియస్‌గానా అనేది తేలాలి.
‘సంగీతం నేర్చుకోవడం అనేది తపస్సు బాబు. నూరు లెక్కల పుస్తకాలు ఔపోసన పట్టినంత కష్టం. అంతేకాదు చాలా డెడికేటెడ్‌గా ఉండాలి. పొద్దున్నే నాలుగ్గంటలకల్లా లేచి సాధన చేయాలి’ అందామె.
దేవి ఆలోచనలో పడ్డాడు.
నిజంగా అంత కష్టమా సంగీతం అంటే? దానిని సాధించలేమా మనం. ఆలోచించుకుంటూనే నిద్ర పోయాడు.
రాత్రయ్యింది. ఇంకా రాత్రయ్యింది. తల్లి గాఢనిద్రలో ఉండగా ఎవరో లేపినట్టుగా అనిపించి కళ్లు తెరిచి చూసింది. దేవి.
‘అమ్మా. లే. సంగీతం సాధన చేద్దాంలే’ అంటున్నాడు దుప్పటి చుట్టూ కప్పుకొని.
ఆమె అదిరిపోయి, కళ్లు నులుముకొని, టైము చూసింది.
సరిగ్గా- ఐదు నిమిషాలు తక్కువ నాలుగు.

*******

‘నా గురువు మైకేల్ జాక్సన్’ అని ప్రకటించాడు దేవి ఒక రోజు.
అప్పటికి దేవి హైస్కూలు చదువుతున్నాడు. క్లాసు పుస్తకాలు, హోమ్ వర్కూ కాకుండా దేవి చేస్తున్న ఒకే ఒక్క పని మైకేల్ జాక్సన్ వీడియోలు చూడటం. పాటలు పాడేవాడొకడు... పాటలు రాసేవాడొకడు... ఎవరో రాసి ఎవరో పాడితే దానికి డాన్స్ చేసేవాడొకడు... ఏమిటి ఇదంతా.. మొత్తం నేనే చేస్తా... మైకేల్ జాక్సన్‌లా అంతా నేనే చేస్తా అని సవాలు విసురుతున్నాడు.
అప్పటికే దేవికి కీబోర్డ్ వచ్చేసింది.
డాన్సూ వచ్చేసింది.
డిష్... డిష్‌డిష్... ధన్... ధన్‌ధన్... అని నోటితోనే రిథమ్ ఇస్తూ నేల మీద నిలబడటమే మానేశాడు. తల్లి ఇదంతా గమనించింది. ఇది రాకెట్ స్పీడు. ప్రవాహం. దీనిని కొంచెం మందగించేలా చేయాలి. అభిషేకానికి అనువుగా కమండలంలో ఇమడ్చగలగాలి. శాంతంగా ప్రశాంతంగా తనలోకి తనలోన తాను పొంగిపొరలేలా చేయగలగాలి.
ఆ పని చేయగలిగినది ఒక్కటే- శాస్త్రీయ సంగీతం.
‘బాబూ... నిన్ను ఒక గురువు దగ్గరకు తీసుకువెళతాను. ఆయన దగ్గర సంగీతం నేర్చుకుంటావా’ అందామె.
‘అది బాగుంటుందా?’
‘చాలా’
దేవి తలాడించాడు. ఆ సాయంత్రమే కొడుకును తీసుకొని వాళ్ల ఇంటికి రెండు వీధుల అవతల ఉన్న ఒక మాస్టారి దగ్గరకు తీసుకువెళ్లిందామె. ఆ మాస్టారు సంగీతం నేర్పడానికి ఎవరి దగ్గరా డబ్బు తీసుకోడు. అవసరమైతే తనే శిష్యులకు ఏం కావాలో అది అమరుస్తాడు. పెద్దగా మాట్లాడడు. పెద్దగా కోప్పడడు. పువ్వులోని పరిమళం తనంతట తానుగా గుబాళించేలా చేస్తాడు.
ఆయన దేవిని చూశాడు.
‘ఏదీ ఏదైనా పాడు’ అన్నాడు.
దేవి మైకేల్ జాక్సన్ పాట ఒకటి పాడాడు. తల్లి వర్రీగా గురువు వైపు చూసింది. గురువు- చిర్నవ్వు నవ్వి- అదే పాటను అంతకంటే బాగా తన మాండలిన్ మీద పలికించాడు.
దేవి - అరె అనుకొని చూశాడు.
ఇలాగనా అని ఆశ్చర్యపోయాడు.
ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు- తన ఎదురుగా ఉన్న వ్యక్తే తన గురువు. ఎప్పటికీ మరెప్పటికీ.
తర్వాత తల్లితోపాటు ఇంటికి తిరిగొస్తూ తల్లిని గురువు పేరు అడిగాడు.
‘శ్రీనివాస్ నాయనా. అందరూ మాండలిన్ శ్రీనివాస్ అంటారు’ అంది తల్లి.
మాండలిన్ శ్రీనివాస్ - దేవి గురువు.

*******

దేవికి ఇప్పుడు ఒక టైమ్ టేబుల్ అలవాటయ్యింది. ఉదయం నాలుగు నుంచి ఆరు వరకు మాండలిన్ శ్రీనివాస్ దగ్గర శిష్యరికం. ఎనిమిది గంటలకు స్కూల్. మూడింటికి రావడం. ఆరు వరకు ఆటలు, హోమ్ వర్క్. మళ్లీ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకూ సంగీతం.
మద్రాసులో మాండలిన్ శ్రీనివాస్ ఏ కచ్చేరీ చేసినా వెనుక దేవి ఉండాల్సిందే. తంబూరా అందించడం. తాళం వేయడం. గురువు కచ్చేరి ఇస్తుంటే మైమరిచి చూడటం. అన్నింటికంటే దేవి పొందిన బెనిఫిట్ ఏమిటంటే- కచ్చేరీ లైవ్‌లో జరగడం వల్ల ప్రేక్షకుల హావభావాలు గమనించడం.
ఎలాంటి సంగీతానికి వాళ్లు స్పందిస్తున్నారు... ఎలాంటి సంగీతానికి పొంగిపోతున్నారు... ఎలాంటి సంగీతానికి ఏడుస్తున్నారు... ఎలాంటి సంగీతానికి నిర్లిప్తమవుతున్నారు...
ఇది తాను గుర్తుపెట్టుకున్నాడు. శ్రోతల స్పందనే తనకు పాఠం.
ఆ పాఠాల్లో దేవి ఆరి తేరాడు.

*******

డీవియేషన్స్ ఉంటాయి దారిలో. ఒక్కోసారి బాట వదలి పక్కకు వెళ్లి తిరిగి బాటను కనుగొనే పరిస్థితి వస్తుంది. దేవికి కూడా వచ్చింది. ఒకరోజు సత్యమూర్తి ఫారిన్ నుంచి ఓ వీడియో కెమెరా తెప్పించి ఇచ్చారు దేవికి. దాని పేరు ఎమ్ 3000. పానాసోనిక్ కంపెనీ. ఆ రోజుల్లోనే దాని ఖరీదు 45 వేలు. దేవికి ఆ కెమెరాతో లవ్ మొదలయ్యింది. పిచుకను షూట్ చేయడం. ఎలుకను షూట్ చేయడం. వర్షించే మేఘాన్ని షూట్ చేయడం. చెల్లెల్ని తమ్ముణ్ణి పెట్టి మోడల్స్‌గా ర్యాంప్‌వాక్ చేయించడం. ప్రొఫెషనల్ కెమెరామెన్ కూడా పనికిరాడు అన్నట్టుగా సాధన చేయడం.
సత్యమూర్తికి మంచి ఫ్రెండ్ అయిన కెమెరామెన్ లోక్‌సింగ్ ఒకరోజు దేవి షూట్ చేసిందంతా చూసి బుర్ర గీరుకున్నాడు. వర్క్ సామాన్యంగా లేదు. ఇంత చిన్న వయసులో అంత నైపుణ్యమా? ఆ సంగతి తండ్రి దగ్గర ఏం పొగుడుతాం అని చెప్పి వెళ్లి చిరంజీవి దగ్గర పొగిడాడు.
‘సార్. ‘సత్యమూర్తి కొడుకు మేధావిలా ఉన్నాడు. మామూలు కెమెరాతోనే ఇరగదీస్తున్నాడు’ అని చెప్పాడు.
చిరంజీవికి ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యం అంటే మరుసటి రోజు ఆయనే స్వయంగా సత్యమూర్తి ఇంట్లో ప్రత్యక్షమయ్యి దేవి తీసిందంతా చూసి - దేవిని ముద్దాడి - ‘సత్యమూర్తీ మీ వాణ్ణి ఏం చేద్దామనుకుంటున్నావ్?’ అని అడిగారు.
‘మ్యూజిక్ డెరైక్టర్’ అన్నాడు సత్యమూర్తి.
‘మ్యూజిక్ డెరైక్టర్ ఎప్పుడైనా కావచ్చు. మీవాడిలో మంచి డెరైక్టర్ ఉన్నాడు. ఆ వైపు ట్రైనింగ్ ఇప్పించు’ అని లేచారు చిరంజీవి.
కారు ఎక్కబోతూ దేవిని పిలిచి చెప్పారు- ‘నువ్వు డెరైక్టర్‌వైతే నేను ఫ్రీగా యాక్ట్ చేస్తా. ప్రామిస్’
అది చిన్న కాంప్లిమెంట్ కాదు.
ఆ వయసు కుర్రాడికి దాదాపు ఆస్కార్.

*******

టెన్త్ ఓవర్. ప్లస్ టూ ఫినిష్. డెరైక్టర్ కావడానికి విజువల్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ జాయిన్ అవుదామనుకుంటూ ఉంటే అనుభవం ఎక్కువైందని నో సీట్.
మరేం చేయాలి?
దేవి సొంత ఆల్బమ్స్ చేస్తున్నాడు. పాటలు పాడుతున్నాడు. తన లోకంలో తను ఉన్నాడు. ఇంట్లోనే తన లోకం సృష్టిస్తున్నాడు. సత్యమూర్తిని కలవడానికి వచ్చే సినిమా వాళ్లకు ఇది ఒక రకమైన డిస్టర్బెన్స్. ఒక రకమైన సరదా. ఒకరోజు ఒకాయన మాత్రం దేవి గోలను విని విని ఆగలేక మేడ మీదకు వచ్చేశాడు.
‘హాయ్. నా పేరు ఎమ్మెస్ రాజు. మీ నాన్నగారి ఫ్రెండ్‌ని. ఇప్పుడు నువ్వు పాడుతున్న ట్యూన్ ఎవరిది?’ అన్నాడు.
‘నాదే సార్’ చెప్పాడు దేవి.
‘బాగుంది. నీకో సిట్యుయేషన్ చెబుతా. దానికి ట్యూన్ కడతావా?’ అనడిగాడాయన.
దేవికి సరదాగా అనిపించింది.
‘అలాగే అంకుల్’ హుషారుగా చెప్పాడు.
ఆయన ఓ సిట్యుయేషన్ చెప్పి ‘నేను రేపొస్తా. ట్యూన్ రెడీ చేయ్’ అనేసి వెళ్లిపోయాడు. దేవి ఆ సంగతిని సీరియస్‌గా తీసుకోవాలో సరదాగా తీసుకోవాలో తెలియక వదిలేశాడు. తెల్లారింది. ఎమ్మెస్ రాజు మళ్లీ ప్రత్యక్షమయ్యారు.
‘ట్యూన్ చేశావా?’
దేవి కంగారుపడ్డాడు.
‘అంకుల్... మీరు నిజంగా అన్నారనుకోలేదు’
‘సరే... రేపటికైనా రెడీ చేస్తావా?’
‘ష్యూర్’
ఆ రాత్రంతా నిద్రపోకుండా ఓ ట్యూన్ చేశాడు దేవి.
ఆయనకు వినిపిస్తే ఏం మాట్లాడలేదు. నచ్చలేదేమో అనుకున్నాడు దేవి.
‘ఇప్పుడు నేను ఓ సినిమా చేయబోతున్నా. దానికి మ్యూజిక్ చేస్తావా?’ అడిగాడాయన.
దేవికి కళ్లు తిరిగినంత పనైంది. నిజమా అబద్ధమా. నిజమే. దేవి సినిమాకి మ్యూజిక్ డెరైక్టర్‌గా దేవిశ్రీప్రసాద్ పేరు ఖరారయ్యింది. 17 ఏళ్లకే బంపర్ ఆఫర్. అయిదు పాటలు... నాలుగు శ్లోకాలు... అదిరిపోయే రీరికార్డింగ్.
దేవి అద్భుతమైన రిజల్ట్ ఇచ్చాడు.
‘దేవి’ రిలీజయ్యింది. సూపర్ హిట్ అయ్యింది. ఆ వెంటనే దేవి పేరు కూడా. ఒకేసారి పది ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. ఏం చేయాలి? దేవి అన్నిటినీ రిజెక్ట్ చేశాడు. సత్యమూర్తి ఆశ్చర్యపోయారు.
‘లేదు నాన్నా... అన్నీ దేవిలాంటి పాము సినిమాలే. అవిగాని చేస్తే నేనిక పాము బూర ఊదుకోవాల్సిందే’ చెప్పాడు దేవి.
దేవికి ధైర్యం వేరే ఉంది.
మొదటి సినిమాకు ఎమ్మెస్ రాజు అవకాశం ఇచ్చారు.
వెంటనే ఆయన భారీ సినిమా ‘దేవీపుత్రుడు’ మొదలెట్టారు.
ఆ అవకాశం కూడా తనకే వస్తుంది.
చేస్తే అలాంటి పెద్ద సినిమా చేయాలి. చిన్న చిన్న సినిమాలు ఎందుకు? ఎమ్మెస్ నారు పోశారు. ఆయనే నీరు పోస్తారు.
అని ఎదురు చూస్తూ కూచుని ఉన్నాడు దేవి.
కాని దేవి అనుకున్నట్టుగా జరగలేదు. వేరే ఏవో కారణాల వల్ల బిజినెస్ ప్యాకేజ్‌లో భాగంగా దేవిపుత్రుడు మ్యూజిక్ ఇంకొకరికి వెళ్లింది. దేవికి కాదు. దేవి అదిరిపోయాడు. టీనేజ్‌లో ఉన్న కుర్రాడు. కలలు కంటున్న కుర్రాడు. కలలకు వేరొకరిపై ఆధారపడిన కుర్రాడు. ఆదిలోనే ఇలాంటి అనుభవాన్ని ఊహించలేదు.
డిప్రెషన్.
వచ్చిన సినిమాలు వదులుకున్నాడు.
రావలసిన సినిమా రాలేదు.
ఏం చేయాలి? ఈ గ్యాప్‌లో కాలం ఊరికే ఉంటుందా

*******
ఆంటీ కూతురా... అమ్మో అప్సరా ముస్తాబదిరింది....
మణిశర్మ రెచ్చిపోతున్నాడు.
రామ్మా... చిలకమ్మా... ప్రేమా మొలకమ్మా అని రేగిపోతున్నాడు.
రోజావే... చిన్ని రోజావే... అని ఎస్‌ఏ రాజ్‌కుమార్ రెడీ.
రమణగోగుల, ఆర్‌పి పట్నాయక్, చక్రి... అందరూ బరిలో దిగి అవకాశాలను వేటాడుతున్నారు. ఇలాంటి సమయంలో దేవి మళ్లీ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు.
వీళ్ల హోరులో తన పాట ఎప్పుడు వినిపించాలి.
తను ఎప్పుడు బయట పడాలి?

*******

కోడి రామకృష్ణ నూరు సినిమాలు తీశారు. ఇంకో నూరు సినిమాలు తీసినా ప్రతి సినిమానూ తన మొదటి సినిమాగా తీయడం ఆయన అలవాటు. ప్రతి సినిమాకు తగిన న్యాయం చేసేవాళ్లను వెతుకుతుంటారాయన. ఇప్పుడు ఆయన చేతికి ‘నవ్వుతూ బతకాలిరా’ అనే సినిమా వచ్చింది.
జేడీ చక్రవర్తి హీరో... శ్రీనివాసరెడ్డి ప్రొడ్యూసర్... మార్కెట్‌ను అనుసరించి డిమాండ్ ఉన్న మ్యూజిక్ డెరైక్టర్‌ని తీసుకోవచ్చు. కానీ ఆయనకు దేవి గుర్తుకొచ్చాడు. తాను డెరైక్ట్ చేసిన దేవికి పని చేసిన కుర్రాడికి ఇంకో చాన్స్ ఇవ్వాలని కోడి రామకృష్ణకు అనిపించింది.
దేవిని పిలిచి ‘ఒక్క పాట హిట్ చేయ్ చాలు. అన్నీ అక్కర్లేదు’ అన్నారాయన.
దేవి అప్పటికే కసిమీదుతున్నాడు.
‘కోనసీమ కుర్రదాన్నిరో...’ లాంటి మాస్ పాటలను మోతెక్కించాడు.
‘నవ్వుతూ బతకాలిరా’ సినిమా యావరేజ్... కానీ పాటలు సూపర్‌హిట్. ఒకావిడ ఇంటర్నెట్‌లో ఈ పాటల గురించి రివ్యూ రాస్తూ ‘తెలుగు సినిమాకు దొరికిన సరికొత్త బహుమతి దేవిశ్రీప్రసాద్’ అని ప్రశంసించింది.
తొలి గుర్తింపు. ఇక మలి గుర్తింపు రావాలి. వచ్చింది. శ్రీను వైట్ల తీసిన ‘ఆనందం’ రూపంలో.
ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూశారా... హిట్.
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా... సూపర్ హిట్.
‘ఆనందం’ సినిమాతో పాటు ఆనందం ఆడియో దుమ్ము లేపేసింది. ఎవరితడు? దేవిశ్రీ ప్రసాద్ అట. ఎవరితడు? అని ఒకటే ఎంక్వయిరీలు.
అది తెలుసుకునేలోపే ‘సొంతం’ వచ్చింది.
ఆ తర్వాత ‘కలుసుకోవాలని’.
ఆ తర్వాత ’ఖడ్గం’.
ఆ తర్వాత నాగార్జున ‘మన్మథుడు’.
గుండెల్లో ఏముందో కళ్లల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది...
పెద్ద హిట్.
ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ టాప్ డెరైక్టర్.
కానీ చాలదు. చిరంజీవి సినిమాకు పాటలు ఇవ్వని
వాడు టాప్ డెరైక్టర్ ఎలా అవుతాడు?

*******


డెరైక్టర్ రాజూ హిరాణి దేశాన్ని షేక్ చేశాడు. మున్నాభాయ్ ఎంబిబిఎస్‌తో కొత్తరకం ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రవేశపెట్టాడు. ఆ లెవల్ సినిమాకు తెలుగులో సరిజోడి ఎవరు? ఇంకెవరు చిరంజీవే! శంకర్‌దాదా ఎంబిబిఎస్ మొదలైంది. అందరిలోనూ టెన్షన్. ఏ క్యారెక్టర్ ఎవరికి పోతుందో? ఏ డిపార్ట్‌మెంట్ ఎవరికి దక్కుతుందో. ముఖ్యంగా మ్యూజిక్. అప్పటికి చిరంజీవికి మణిశర్మే పర్మినెంట్. ఇప్పుడూ ఇంతేనా... ఇప్పుడూ.
కానీ కాల్ దేవికి వచ్చింది.
‘శంకర్ దాదా ఎంబీబీఎస్’...
అవతలివైపు మాట పూర్తి కాక ముందే ‘చేస్తా... చేస్తా... గ్యారంటీగా నేనే చేస్తా’ అని పెద్దగా అరిచాడు దేవి. తన దర్శకత్వంలో ఫ్రీగా యాక్ట్ చేస్తానన్న చిరంజీవి తన సంగీత దర్శకత్వంలో యాక్ట్ చేయడానికి అంగీకరించారు.
ఆ సినిమా రిలీజైంది. దేవి పేరు మోగిపోయింది. తను ఇంట్రడ్యూస్ చేసిన కుర్రాడు తన ప్రమేయం లేకుండా తన దారి తాను వెతుక్కోగలిగాడు అన్న సంతృప్తి ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజుకు దక్కింది.
చాలా రోజుల తర్వాత ఆయన దేవికి ఫోన్ చేశాడు.
‘రే... నా సినిమా నువ్వు చేయాలి’
‘చేస్తాను అంకుల్. పేరేమిటి’
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా?’.
సూపర్ హిట్.

*******

సాధారణంగా తమిళ మ్యూజిక్ డెరైక్టర్లు తెలుగులో దుమ్ము రేపడం ఆనవాయితీ. కేవీ మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, హేరీస్ జైరాజ్...
ఏం... ఒక తెలుగు మ్యూజిక్ డెరైక్టర్ తమిళంలో
దుమ్ము రేపకూడదా.
రేపాడు. దేవి.
ఎక్స్‌క్యూజ్‌మీ మిస్టర్ మల్లన్నా
ఓ కాఫీ తాగుదాం ఆవోనా...
విక్రమ్‌కు మల్లన్న ఆడియో హిట్.
చూడొద్దే నను చూడొద్దే కత్తిలాగ నను చూడొద్దే...
సూర్యకు ‘ఆరు’ ఆడియో హిట్. నిన్న మొన్నటి
‘సింగం’ ఆడియో కూడా హిట్.
దూసుకుపోతున్నాడు దేవి.
ఆగడం లేదు.
ఆపడమూ సాధ్యం కాదు.

*******

ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన దగ్గర నారు ఉందా
లేదా చూసుకోవాలి.
నారు ఉంటే నీరు కోసం వెతుక్కోకుండా మనమే
రంగంలో దిగాలి.
ప్రయత్నం చేస్తే పనులు అవుతాయి.
ప్రయత్నం చేస్తే అవకాశాలు వస్తాయి.
ప్రయత్నం చేస్తే సక్సెసూ అవుతారు.
ప్రయత్నం చేస్తే రీఛార్జ్ అవుతారు.
ఇన్నెందుకు - ప్రయత్నం చేస్తే మీరు దేవిశ్రీ ప్రసాద్
అవుతారు.

బాత్రూమ్‌లో పుట్టిన పాట
కృష్ణవంశీ డెరైక్షన్‌లో ‘ఖడ్గం’ సినిమా. ఎంతో ఇష్టపడి మ్యూజిక్ చేస్తున్నాడు దేవి.
ఓ రోజు సడన్‌గా ఫోన్ చేశారు కృష్ణవంశీ. ‘‘నెక్ట్స్ షెడ్యూల్‌లో తీద్దామనుకున్న పాట ఇమ్మీడియెట్‌గా తీయాల్సి వస్తోంది. సోనాలిబింద్రే కాల్షీట్లు రెడీగా ఉన్నాయి. అర్జంట్‌గా పాట కావాలి’’ అని పీక మీద కత్తి పెట్టినంత పనిచేశారు. ఇప్పటికిప్పుడు రొమాంటిక్ సాంగ్ రెడీ చేసేయాలి. ఆ టెన్షన్‌లో రెండుమూడు సార్లు బాత్రూమ్‌కి వెళ్లాడు దేవి. అక్కడే ఓ ఆలోచన వచ్చింది. అదే ‘నువ్వు... నువ్వు...’ పాట. సీతారామశాస్త్రి లిరిక్ రాశారు. ఫోన్‌లో పాట విన్న కృష్ణవంశీ ‘‘అదరగొట్టావ్ దేవీ. నువ్వు నా ఎదురుగా ఉంటే గట్టిగా వాటేసుకునే వాణ్ణి’’ అని అభినందించారు. ‘ఖడ్గం’ ఎంత హిట్టయ్యిందో ఆ పాట అంతకు రెట్టింపు హిట్టయ్యింది.

హీరోగా బోలెడన్ని ఆఫర్లు
దేవి పాటల్లో ఎంత ఎనర్జీ, గ్లామర్ కనిపిస్తాయో తనలో కూడా అవే కనిపిస్తాయి. ఆడియో ఫంక్షన్‌లో దేవి డయాస్‌పైకి ఎక్కితే సందడే సందడి. హీరోహీరోయిన్లు కూడా అతని చుట్టూ మూగుతారు. ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్’, ‘శంకర్‌దాదా జిందాబాద్’ చిత్రాల్లో ఓ పాటలో చిరంజీవితో కలిసి దేవి స్టెప్పులేస్తూ కనిపిస్తారు. త్వరలో విడుదల కానున్న తమిళ సినిమా ‘వెడీ’ లో కూడా ఆయన ఓ పాటలో నటించారట. మరి పూర్తిస్థాయి హీరోగా ఎప్పుడు? అంటే నవ్వేస్తారాయన. ‘‘నటించాలని నాక్కూడా ఉంది. కానీ నా వృత్తికి న్యాయం చేయడానికే టైమ్ సరిపోవట్లేదు. ఇక యాక్టింగ్ కూడా అంటే టైం స్పెండ్ చేయడం చాలా కష్టం’’ అని చెబుతారు దేవి. చాలా పెద్ద పెద్ద నిర్మాతలే దేవిని హీరోగా చేయమని ఆఫర్లు ఇచ్చారు. అశ్వనీదత్, అల్లు అరవింద్, ఉషాకిరణ్ మూవీస్ వాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. కానీ దేవికి సంగీతమే ప్రపంచం. ప్రస్తుతానికి రెండో ఆలోచన లేదు. ఏమో... భవిష్యత్తులో తను హీరోగా సినిమా రావచ్చేమో! అల్లు అరవింద్ అయితే డెరైక్షన్ ఆఫర్ కూడా ఇచ్చారట. ‘‘హీరోగా అయినా, డెరైక్టర్‌గా అయినా మా సంస్థలో ఎనీటైమ్ నీతో సినిమా చేయడానికి రెడీ’’అని చెప్పారట.

అబ్రహాం లింకన్ బెస్ట్ ప్రెసిడెంట్

అమెరికా చరిత్రలో ది బెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు?
అమెరికా మెట్టమొదటి అధ్యక్షుడా? కాదు.
లాడెన్‌ని మట్టుపెట్టిన ఇప్పటి అధ్యక్షుడా? కానే కాదు.
మధ్యలో నలభై రెండు మంది ప్రెసిడెంట్లు ఉన్నారు. వీళ్లలో ఎవరు?
ఎప్పుడు అభిప్రాయసేకరణ జరిగినా... మొదటిస్థానంలో నిలిచే పేరు...
అబ్రహాం లింకన్. తర్వాతే జార్జి వాషింగ్టన్, రూజ్వెల్ట్!
అమెరికాకు ఆకృతిని, రక్తమాంసాలను ఇచ్చిన పితామహులు, అధ్యక్షులు
ఉంటే ఉండొచ్చు కానీ..
ఆ దేశానికి ఆత్మను ఇచ్చిన మహనీయుడుమాత్రం లింకనే!!
యుద్ధాన్ని ఇష్టపడని ఈ వ్యక్తి ద్వేషం చిమ్మినవారిని క్షమించిన
ఈ వ్యక్తి ప్రపంచ పౌరుల ఆరాధ్య అధ్యక్షుడిగా
రాజకీయాలలో ఆదర్శ నాయకుడిగా ఎదగడం వెనుక ఉన్న
స్ఫూర్తిదాయకమైన సందర్భాల సమాహారమే ఈవారం ‘బయోగ్రఫీ’


బయోడేటా
అబ్రహాం లింకన్, 16వ అమెరికా అధ్యక్షుడు
12 ఫిబ్రవరి 1809 - 15 ఏప్రిల్ 1865

జన్మస్థలం : కెంటకీ, అమెరికా
తల్లిదండ్రులు : థామస్ లింకన్,
నాన్సీ హాంక్స్
మారుతల్లి : శారా బుష్ జాన్‌స్టన్
తోబుట్టువులు : అక్క శారా, తమ్ముడు థామస్ జూ॥
భార్య : మేరీ టాడ్ (వివాహం : 4 నవంబర్ 1842)
సంతానం : నలుగురు కొడుకులు (రాబర్ట్, ఎడ్వర్డ్, విల్లీ, థామస్ టాడ్) వీరిలో ఎడ్వర్డ్ నాల్గవ యేట,
వీల్లీ పన్నెండవ యేట, టాడ్ పద్దెనిమిదవ యేట చనిపోయారు)
అధ్యక్షుడిగా : 4 మార్చి 1861 - 15 ఏప్రిల్ 1865
దాస్యవిముక్తి ప్రకటన : 1 జనవరి 1863

ఫిబ్రవరి - మార్చి - ఏప్రిల్... లింకన్ జీవితం.
ఫిబ్రవరిలో పుట్టారు. మార్చిలో ప్రెసిడెంట్ అయ్యారు. ఏప్రిల్‌లో... విద్వేషానికి బలయ్యారు!
యాభై ఆరేళ్ల పాటు ఈ మూడు నెలల మధ్య లింకన్ జీవితం మలుపులు తిరిగి విషాదాంతం అయింది.

*******

నీతి - నిజాయితీ - స్వయంకృషి ... లింకన్ వ్యక్తిత్వం.
జీవితంలో ఎన్ని దెబ్బలు లింకన్‌కు! లేమిలో పెరిగాడు. పూటపూటకూ పస్తులున్నాడు. రెండుసార్లు వ్యాపారంలో తలకిందులయ్యాడు. ఎనిమిదిసార్లు ఎన్నికల్లో ఓడిపోయాడు. నరాలు చచ్చుబడి ఆరు నెలలు మంచానికి అంటుకుపోయాడు. మరీ దౌర్భాగ్యం... తొమ్మిదేళ్లకే తల్లిని పోగొట్టుకున్నాడు!
నీతిగా బతకమని అమ్మ చెప్పింది. కష్టపడి బతకమని అంతరాత్మ చెప్పింది. పదిమందిని బతికించమని ైదైవం చెప్పింది. జీవితమంతా ఈ ముగ్గురు చూపిన తోవలోనే నడిచాడు లింకన్. అందుకే ఎన్ని దెబ్బలు తగిలినా నిలబడగలిగాడు. నాయకుడయ్యాడు.

*******

దాస్య విముక్తి - దేశ సమైక్య స్థితి ... లింకన్ లక్ష్యం.
ఆఫ్రికన్ బానిసలకు విముక్తి ప్రసాదించినందుకు సొంతజాతికే శత్రువయ్యారు. ముక్కలు ముక్కలు కాబోతున్న అమెరికా సంయుక్త రాష్ట్రాలను కలిపి ఉంచే ప్రయత్నంలో చివరికి ప్రాణత్యాగం చేశారు.
లింకన్ ... బిలాంగ్స్ టు ది ఏజెస్!

*******

మొదట అనుకున్న ప్రకారం అయితే జాన్ విల్కెస్ బూత్... అబ్రహాం లింకన్‌ని కిడ్నాప్ చెయ్యాలి! కిడ్నాప్ చేశాక, ‘‘మా మనుషుల్ని విడుదల చేస్తేనే మన అధ్యక్షుడిని వదిలిపెడతాం’’ అని ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చెయ్యాలి. అదీ పథకం. విల్కెస్ రంగస్థల నటుడు. అమెరికా నుంచి వేరుపడేందుకు ప్రయత్నించి అంతర్యుద్ధానికి కారణమైన దక్షిణ అమెరికా బానిస రాష్ట్రాల (బానిసత్వ వ్యవస్థ చట్టబద్ధమై ఉన్న రాష్ట్రాలు) సానుభూతిపరుడు. లింకన్ ప్రభుత్వం ఆ తిరుగుబాటును అణిచివేసి, వేర్పాటువాదుల్ని జైల్లో పెట్టింది. వారిని విడిపించుకోవడం కోసమే లింకన్‌ని కిడ్నాప్ చెయ్యాలనుకున్నాడు విల్కెస్.

అయితే - లింకన్ ప్రసంగం విన్నాక అతడి నిర్ణయం మారింది! కిడ్నాప్ కాదు, మనిషినే లేకుండా చెయ్యాలని అనుకున్నాడు. అంతకుముందే అతడు లింకన్ ప్రసంగం విన్నాడు. రెండోసారి అధ్యక్షుడు అయిన సందర్భంగా లింకన్ ఇచ్చిన ప్రసంగం అది. నల్లజాతి ప్రజలకు ఓటు హక్కు కల్పిస్తాననని హామీ ఇచ్చారు లింకన్. ఆ మాట విల్కెస్‌కు కోపం తెప్పించింది. పుండు మీద కారప్పొడిలా రాలి పడింది. ‘వేరుపడతానంటే పడనివ్వడు కానీ, సమానహక్కులు కల్పిస్తాను కలిసి ఉండండి అంటాడా’ అని విల్కెస్ ఆగ్రహం! అందుకే అయన్ని హతమార్చాలనుకున్నాడు. అనుకున్నట్లే చేశాడు!!

వాషింగ్టన్‌లోని ఫోర్డ్స్ థియేటర్‌లో - బాల్కనీలో కూర్చుని ‘అవర్ అమెరికన్ కజిన్’ నాటకాన్ని దీక్షగా చూస్తున్న లింకన్‌ను... వెనుక వైపు వచ్చిన విల్కెస్, తలకు అతి సమీపంగా తుపాకీ గురిపెట్టి కాల్చాడు. లింకన్ తల వాలిపోయింది. రాత్రి 10.13 గం. ఈ సంఘటన జరిగింది. లింకన్ కోమాలోకి వెళ్లిపోయారు. మర్నాడు ఉదయం గం.7.22 లకు ఆయన మరణించారు. వార్త విన్న మరుక్షణం ప్రపంచమంతటా విషాదం కమ్ముకుంది. అంతిమక్రియల అనంతరం - ‘‘నౌ హి బిలాంగ్స్ టు ది ఏజెస్’’ అని సైనిక దళం నివాళులర్పించింది.

*******

లింకన్ సకల కాలాల, సకల స్థలాల ప్రియతముడు.
లింకన్‌ను ఒక కాలానికి, ఒక దేశానికి, ఒక జాతికి, ఒక సమూహానికి మాత్రమే చెందిన వ్యక్తిగా గుర్తించడానికి వీలుకాదు. జీవన్మరణ సమస్యలు అతడిని శక్తిమంతుడిగా మార్చాయి. వరుస ఓటములు అతడిని విజేతగా నిలబెట్టాయి. అమెరికా గానీ, తక్కిన ప్రపంచ దేశాలు కానీ మునుపెన్నడూ భూమి మీద ఎక్కడా ఇలాంటి నాయకుడి జాడలు చూడలేదని ఈనాటికి ఒప్పుకుంటూనే ఉన్నాయి.

లింకన్ రాజనీతిజ్ఞుడు. దేశం రాజ్యాంగ సంక్షోభంలో ఉన్నప్పుడు, సైనిక సంక్షోభంలో ఉన్నప్పుడు, మానవీయ విలువల సంక్షోభంలో ఉన్నప్పుడు, సంక్షోభాలన్నీ కలిసి అంతర్యుద్ధంగా మారినప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలను ఆయన సమైక్యంగా ఉంచగలిగారు.
లింకన్ మహోన్నతుడు. పేదల్ని ఆదరించాడు. రాజకీయాలలో నిస్వార్థ సేవలు ఉండవనే భావనను పోగొట్టి సాధారణ పౌరులకు దగ్గరయ్యాడు. ఒక మంచి వ్యవస్థను నిర్మించాడు. బానిసలకు విముక్తి ప్రదాత అయ్యాడు. నిరుపేద కుటుంబం నుంచి ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఎదిగిన స్వయంకృషీవలుడు లింకన్. ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలు, అవి నేర్పిన పాఠాలు ఉన్నాయి.

*******

అమెరికా అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్‌కు గొప్ప లక్ష్యాలు ఉన్నాయి. అయితే అమెరికాకు అధ్యక్షుడు అవాలన్న లక్ష్యం మాత్రం అతడికి పదవయేటే ఏర్పడింది. ఒక చిన్న సంఘటన లింకన్‌కు అంత పెద్ద లక్ష్యం ఏర్పడడానికి కారణమైంది. చదివి ఇచ్చే ఒప్పందం మీద క్రాఫర్డ్ అనే సంపన్న రైతు దగ్గర లింకన్ ఒకసారి వీమ్స్ రాసిన ‘లైఫ్ ఆఫ్ వాషింగ్టన్’ పుస్తకం అరువు తీసుకున్నాడు. అది అమెరికా తొలి అధ్యక్షుడు వాషింగ్టన్ జీవిత చరిత్ర. ఇంకొన్ని పేజీలు చదివితే పూర్తవుతుందనగా, నిద్ర తరుముకుని వస్తుండడంతో, పుస్తకాన్ని భద్రంగా చేతికి అందుబాటులో ఉన్న అరలో ఉంచి, మంచంపై వాలిపోయాడు లింకన్. అయితే ఆ రాత్రి వచ్చిన ఈదురుగాలి నుంచి లింకన్ కుటుంబం ఉంటున్న ఇల్లు క్రాఫర్డ్ పుస్తకానికి రక్షణ కల్పించలేకపోయింది. తెల్లారేసరికి పుస్తకం తడిసి ముద్దయింది! లింకన్ చాల బాధపడ్డాడు. ఏ ముఖం పెటుకుని ఆయనకు కనిపించాలి? ఉన్న విషయం చెప్పి ఏదో ఒక విధంగా ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు నిర్ణయించుకున్నాడు. తిన్నగా క్రాఫర్డ్ దగ్గరకు వెళ్లాడు.
‘‘మిస్టర్ క్రాఫోర్డ్. మీ పుస్తకాన్ని మీకు జాగ్రత్తగా తిరిగిచ్చేస్తానని మాట ఇచ్చాను. కానీ అలా ఇవ్వలేక పోతున్నాను. పుస్తకం పూర్తిగా పాడైపోయింది. అందుకు నా నిర్లక్ష్యం కారణం కాదు. దురదృష్టవశాత్తూ అలా జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తే మీకు నష్ట పరిహారం ఇచ్చినట్లు అవుతుందో దయచేసి చెప్పండి’’ అని అడిగాడు లింకన్.
క్రాఫోర్డ్ నిక్కచ్చి మనిషి. లింకన్ చేతిలో ఉన్న తన పుస్తకాన్ని చూశాడు. అది పుస్తకంలా లేదు!!
‘‘ఐ యామ్ సారీ మిస్టర్ క్రాఫోర్డ్. దీనికి తగిన మూల్యం చెల్లించడానికి నా దగ్గర డబ్బులేదు. బదులుగా మీకు ఏదైనా సహాయం చేసిపెడతాను’’ అన్నాడు లింకన్ .
‘‘నా పొలంలో మూడురోజులు మొక్కజొన్న కంకుల్ని కోసి పెట్టు. సరిపోతుంది. పుస్తకాన్ని కూడా నువ్వే ఉంచుకోవచ్చు’’ అన్నాడు క్రాఫోర్డ్. అలాగే చేసిపెట్టాడు లింకన్.
పుస్తకం చదివాక వాషింగ్టన్ చాలాసార్లు లింకన్ కలలోకి వచ్చారు. ఎప్పటికైనా తను అమెరికా ప్రెసిడెంట్ అవాలని ఆ వయసులోనే తీర్మానించుకున్నాడు.

*******

లింకన్ తండ్రి థామస్. తల్లి నాన్సీ హాక్స్. అక్క శారా. తమ్ముడు థామస్ జూనియర్. ఇదీ కుటుంబం. కెంటకీలో చెక్కలతో చేసిన ఇంట్లో నివాసం. తల్లిపోయాక తండ్రికి మానసికంగా దూరమయ్యాడు లింకన్. అదే సమయంలో మారుతల్లికి చేరువయ్యాడు. ఇంటి బాధ్యతల్ని మీద వేసుకున్నాడు. అక్క శారా ఇరవై ఏళ్లకే పురిటి నొప్పులతో చనిపోయింది. అంతకు చాలాకాలం క్రితమే నెలల బిడ్డగా తమ్ముడు థామస్ చనిపోయాడు. కెంటకీ నుంచి ఇల్లినాయిస్ సమీపంలోని డెకాటర్‌కు నివాసం మార్చాక పూర్తిగా పనిలో పడిపోయాడు లింకన్. ఈ పనీ ఈ పనీ లేదు. పడవల్నీ తయారు చేయడం. పడవలపైకి ప్రయాణికుల సమాన్లను చేరవేయడం, రంపపు మిల్లులో దుంగల్ని కోయడం..! ఎంత పని చేసినా చదువును మాత్రం నిర్లక్ష్యం చెయ్యలేదు. చదువుకు కావలిసిన డబ్బును తనే సంపాదించుకున్నాడు. లా చదివాడు. క్రమంగా రాజకీయాల వైపు మళ్లాడు.

*******

లింకన్‌ను బలమైన నాయకుడిగా నిలబెట్టిన సుగుణాలలో నిజాయితీ మొదటిది. లింకన్‌కు ‘హానెస్ట్ ఆబ్’ అని పేరు. పచ్చి అబద్ధాల కోరులా, పచ్చి నిజాయితీపరుడున్నమాట! కొంతకాలం ఆయన కిరాణా దుకాణం నడిపారు. కస్టమర్లకు నాణ్యమైన సరుకు ఇచ్చేవాడు. ధరలు కూడా న్యాయంగా ఉండేవి. జనం బాగా వచ్చేవారు. లెక్కలన్నీ కచ్చితంగా ఉండేవి. ఒకరోజు రాత్రి దుకాణం మూసి ఇంటికి వెళ్లబోయేముందు లెక్కలో చిన్న తేడా వచ్చింది. ఒక కస్టమర్ నుంచి కొన్ని సెంట్‌లు తను ఎక్కువగా తీసుకున్నట్లు ఆయన గుర్తించారు. వెంటనే బయల్దేరి ఆ కస్టమర్ ఇల్లు కనుక్కుని ఎక్కువగా తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేశారు. జరిగిన పొరపాటుకు క్షమాపణలు కూడా చెప్పారు.
ఇంకొకసారి - టీ పొడి కొన్న కస్టమర్‌కు తూకంలో తక్కువగా ఇచ్చిన ట్లు మర్నాడు ఉదయం గమనించిన లింకన్ వెంటనే తక్కువ పడిన టీ పొడిని పొట్లంలో కట్టుకుని కస్టమర్ ఇల్లు వెదుక్కుంటూ వెళ్లి అందజేశాడు. ఆవిడెంతో ఆశ్చర్యపోయారు. ‘తూకం తగ్గినట్లు నాకేమీ అనిపించలేదే’ అన్నారు!
కొన్ని వృత్తులలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండడం కుదరదనుకుంటాం. నిజాయితీగా ఉండకపోవడమే తమ వృత్తి ధర్మం అనుకునే వారూ ఉంటారు. అయితే లింకన్ వేరు. లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న కాలంలో, రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో న్యాయానికి, నైతిక విలువలకు గట్టిగా కట్టుబడి ఉన్నారు ఆయన. లింకన్ తమ మధ్య పక్షి కాదని తోటి న్యాయవాదులు సైతం గుర్తించి ఆయన్ని ఆయనలాగే ఉండనిచ్చారు. ‘‘ఆబ్ అసలు నాలుగు రాళ్లు వెనకేసుకోగలడా?’’ అని వారు అనుకున్న సంఘటన ఒకటి... లింకన్ న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో జరిగింది.
లింకన్, ఆయన స్నేహితులు కలిసి గుర్రాలపై ఇల్లినాయిస్ చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టివచ్చేందుకు బయల్దేరారు. మధ్యలో ఒకచోట లింకన్‌కు నేలపై రెండు పక్షి పిల్లలు కనిపించాయి. వెంటనే గుర్రాన్ని ఆపి వాటిని తన చేతుల్లోకి తీసుకున్నారు లింకన్. ఆగకుండా వెళ్లిపోయిన మిత్రులు కొంతదూరం వెళ్లాక వెనక్కి తిరిగి చూసుకుంటే లింకన్ కనిపించలేదు! గుర్రాలకు నీళ్లపెట్టడం కోసం వారంతా ఒక ప్రదేశంలో ఆగినప్పుడు లింకన్ ఏమయ్యాడన్న ప్రశ్న వచ్చింది. కొందరు ఆందోళన చెందారు. ఈలోగా లింకన్ దూరంగా వస్తూ కనిపించారు. ‘‘ఏమయ్యావ్ మిత్రమా? అని వాళ్లంతా ఆశ్చర్యంగా అడిగారు. ఆయన చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు.
‘‘ఆ పక్షి పిల్లల్ని వాటి తల్లి చెంతకు చేర్చకపోతే ఈ రాత్రికి నాకు నిద్రపట్టేది కాదు’’ అన్నారు లింకన్!
ఇలాంటివే మరికొన్ని సందర్భాలు ఉన్నాయి.
పెద్ద లాయర్‌గా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రోజుల్లో లింకన్ ఒకనాడు స్ప్రింగ్‌ఫీల్డ్ పట్టణ వీధుల్లో నడుచుకుంటూ వెళుతుంటే పదేళ్ల చిన్నారి పెద్దగా ఏడుస్తూ కనిపించింది. ఒక ట్రంకు పెట్టె ఆమె సమీపంలో ఉంది. లింకన్ ఆ చిన్నారి దగ్గరకు వెళ్లి ‘‘ఎందుకు ఏడుస్తున్నావ్?’’అని అడిగాడు.
‘‘నేను డెకాటర్ వెళ్లాలి. రైల్వేస్టేషన్ వెళ్లడానికి ఒక్క గుర్రబ్బగ్గీ నన్ను చూసి ఆగడం లేదు. మరి నేనెలా వెళ్లడం’’ అని మళ్లీ ఏడ్వడం మొదలుపెట్టింది.
లింకన్ ఆమెను సముదాయించాడు. ‘‘ఏడ్వకు, బండి రాకపోతేనేం. నేనొచ్చాను కదా’’ అన్నాడు. ఆమె ట్రంకు పెట్టెను తన భుజం మీద పెట్టుకుని, అమె చెయ్యి పట్టుకుని స్ప్రీంగ్ ఫీల్డ్ వీధుల గుండా అర మైలు దూరం నడిచి రైల్వేస్టేషన్ చేరుకున్నాడు. ఆ చిన్నారిని భద్రంగా టైన్ ఎక్కించి. ట్రంకుపెట్టెను జాగ్రత్తగా చూసుకొమ్మని చెప్పి ఆమె దగ్గర్నుంచి చిరునవ్వుల వీడ్కోలు తీసుకున్నాడు.
ఇలాంటి కోణాలో లింకన్‌లో అనేకం ఉన్నాయి.
కేసులు వాదిస్తున్నప్పుడు, తన క్లయింట్‌దే తప్పుందని లింకన్‌కు అనిపిస్తే, ఆ కేసును మధ్యలోనే వదులుకునేవారు. ఒక కేసులో వాదోపవాదాలు నడుస్తుండగా ఇలాగే జరిగింది! తప్పు తన మనిషిలో ఉందని లింకన్ గ్రహించారు. వెంటనే కేసు నుంచి వైదొలిగారు. ఆ కేసును లింకన్ సహచరుడైన ఇంకో న్యాయవాది వాదించి, క్లయింట్‌ను గెలిపించాడు. క్లయింట్ ఇచ్చిన డబ్బులో సగం వాటాను పదిలంగా తీసుకువచ్చి లింకన్‌కు ఇవ్వబోతే, ఆయన నిరాకరించారు.
అలాగే త న ‘లా-పార్ట్‌నర్’తో లింకన్ లెక్కలు కచ్చితంగా ఉండేవి. ఒక కేసు విషయమై లింకన్‌కు కొంత డబ్బు అందింది. అందులోంచి సగం తీసుకుని, మిగతా సగం మొత్తాన్ని ఒక కాగితంలో చుట్టి, దానిపై ‘బిల్లీ’ అని రాసి జాగ్రత్తగా ఒకపక్క ఉంచారు లింకన్. బిల్లీ అతడి పార్ట్‌నర్. ‘‘ఎందుకలా చెయ్యడం, వాడుకున్నాక తిరిగి ఇచ్చేస్తే సరిపోతుంది కదా’’ అని మిత్రులు అన్నప్పుడు లింక న్ చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా?
‘‘మా అమ్మకు నేను ప్రమాణం చేశాను. ఎంత అవసరంలో ఉన్నా ఇతరుల డబ్బు వాడుకోనని’’ అని చెప్పారు. దటీస్ లాయర్ లింకన్.

*******

ప్రెసిడెంట్ అవక ముందు ఎలా ఉన్నారో, అయ్యాకా అలానే ఉన్నారు అబ్రహం లింకన్. ఆయనదొక క్రమబద్ధమైన జీవితం. ఆయనివి నిశ్చితమైన అభిప్రాయాలు. సమ్మోహనమైన ఉపన్యాసాలు. ఆ ధోరణీ, తీరు అమెరికా అధ్యక్షులలో అతి తక్కువ మందికి మాత్రమే ఉన్నాయని చరిత్రకారులు అంటారు. శత్రువును ఆదరించిన సందర్భాలు కూడా లింకన్ రాజకీయ జీవితంలో ఉన్నాయి.
ఇల్లినాయిస్‌లో చాలా ఏళ్లు జార్జి పికెట్ అనే వ్యక్తి లింకన్‌కు పరిచయం. తర్వాత అతడు సౌత్ ఆర్మీలో చేరాడు. ఎత్తులతో, జిత్తులతో ‘కాన్ఫెడరసీ’లో జనరల్‌గా ఎదిగాడు. కాన్ఫెడరసీకి ప్రెసిడెంట్ లింకన్ వ్యతిరేకం. ప్రత్యేక ప్రతిపత్తి కోసం ఉత్తరమెరికా రాష్ట్రాలతో పోరాడుతున్న దక్షిణమెరికా రాష్ట్రాల యూనియన్ ఇది. అమెరికా అంతర్యుద్ధానికి ఈ కాన్ఫెడరసీనే కారణం. యుద్ధం ముగింపునకు వస్తుండగా వర్జీనియాలో చాలా భాగం సౌత్ ఆర్మీ స్వాధీనంలోంచి యూనియన్ ఆర్మీ చేతుల్లోకి వచ్చేసింది. ఆ సమయంలో -
వర్జీనియాలో ఉన్న జనరల్ పికెట్ ఇంటికి స్వయంగా వెళ్లారు అబ్రహాం లింకన్. గడప దగ్గర ఆయన భార్య ఎదురైంది. ఆమె చేతుల్లో చంటి బిడ్డ ఉంది. ‘‘ఇది.. జార్జి పికెట్ ఇల్లేనా?’’ అని అడిగారు లింకన్.
‘‘అవును. నేను ఆయన భార్యను. ఇది మా బిడ్డ’’ అని చెప్పారావిడ.
‘‘నేను. అబ్రహాం లింకన్’’ అన్నారు లింకన్.
ఆవిడ సంతోషంతో కూడిన విస్మయానికి లోనయ్యారు. ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్! అంతకు ముందెప్పుడూ ఆమె నేరుగా ఆయన్ని చూడలేదు. భర్త మాత్ర ం అప్పుడప్పుడు ఆమెకు చెబుతుండేవాడు. గర్వం లేని మనిషి అనీ, చిన్నవారికి కూడా మర్యాదిచ్చి మాట్లాడతారనీ, తప్పనిసరి పరిస్థితుల్లో అంత మంచి మిత్రుడితో వ్యతిరేకించవలసి వస్తోందనీ అంటుండేవాడు.
‘‘మీరు... ప్రెసిడెంట్ అబ్రహాం లింకనా?’’ అందావిడ, అప్రయత్నంగా.
‘‘కాదు, కాదు... జార్జి పికెట్ పాత స్నేహితుడిని’’ అని చెప్పారు లింకన్.
తల్లి చేతుల్ని వదిలించుకుని లింకన్ మీదికి ఎగబాకుతోంది బిడ్డ. ప్రేమగా తన చేతుల్లోకి తీసుకున్నారు లింకన్. వాత్సల్యంతో బిడ్డను దీవించాడు. బిడ్డ, నోరంతా తెరిచి నవ్వింది. తన చేతులతో లింకన్ ముఖాన్ని తమిడింది. బిడ్డను తల్లికి ఇచ్చేస్తూ - ‘‘మీ నాన్నకు చెప్పు. ఆ రాస్కెల్ నా స్నేహితుడే. నీ కళ్లలో వెలుగు చూసి వాడిని క్షమించాను. ఆ మాట చెప్పు’’ అన్నారు వీడ్కోలు తీసుకుంటూ.

*******

సెనెటర్‌గా ఎన్నికల బరిలో ఉన్నప్పుడు ఇల్లినాయిస్‌లోని స్ప్రింగ్ ఫీల్ట్‌లో లింకన్ అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. అది ‘ది డివెడైడ్ స్పీచ్’గా ప్రసిద్ధి చెందింది. ఆ వేళ ఏం జరిగిందంటే - ప్రసంగం కాపీని సరి చూసుకోడానికి లింకన్ తన లా పార్ట్‌నర్ హెర్న్‌డాన్ ఆఫీస్ గదిలోకి వెళ్లి కూర్చున్నారు. గది తలుపులు వేశాక, జేబులోంచి కాగితాలను తీసి చదవదడం మొదలుపెట్టారు లింకన్. ప్రసంగ పాఠంలోని ప్రతి మాటా ఉద్వేగపూరితంగా, భావయుక్తంగా ఉంది. ఆ క్రమంలో ఒకచోట - ‘సగం మంది బానిసలు, సగం మంది స్వేచ్ఛాజీవులతో ఏ ప్రభుత్వమైనా ఎల్లకాలం మనుగడ సాగిస్తుందన్న నమ్మకం నాకు లేదు’ అన్న వాక్యం వచ్చింది.

‘‘నిజమే కానీ, ఈ సమయంలో ఈ సమస్యను ప్రస్తావించడం మంచి పాలసీ కాకపోవచ్చు’’ అని హెర్న్‌డాన్ సంశయం వ్యక్తం చేశారు. లింకన్ ఆ మాటకు విభేదించారు. ‘‘మంచి పాలసీ కాకపోవచ్చు. కానీ నిజం మాత్రం ఇదే కదా. ఆ నిజం ప్రజలకు తెలియాలి. ఆరు వేల ఏళ్లుగా ఈ రెండు సగాలూ ఇలాగే ఉన్నాయి. వాస్తవం నుంచి మనం పారిపోలేం’’ అన్నారు లింకన్. చివరికి ఆ స్పీచ్ లింకన్ గతినే మార్చేసింది. ప్రజలు అతడిని నమ్మారు. ఓటు వేశారు. అధ్యక్షుడిగా గెలిపించారు.
అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక వాషింగ్టన్ వెళ్లడానికి ముందు స్ప్రింగ్‌ఫీల్డ్‌లో భావ గంభీరంగా మాట్లాడారు లింకన్. స్ప్రింగ్‌ఫీల్డ్ ప్రజలు తమ ప్రియతమ నాయకుడికి వీడ్కోలిచ్చేందుకు రైల్వేస్టేషన్ చేరుకున్నారు. వారి ఉద్దేశించి లింకన్ మాట్లాడారు.

‘‘నా స్నేహితులారా... ఈ ఎడబాటు నాకు ఇష్టం లేనిది. మీ అందరికీ నేను రుణపడి ఉన్నారు. ఇక్కడ నేను పావు శతాబ్దానికి పైగానే ఉన్నాను. నా పిల్లలు ఇక్కడ పుట్టారు. వారిలో ఒకరు ఈ భూమిలోనే ఖననం అయ్యారు. తిరిగి మళ్లీ మిమ్మల్ని ఎంతకాలానికి చూస్తానో తెలీదు. నాపై ఒక పెద్ద బాధ్యత ఉంది. బహుశా అది వాషింగ్టన్ తర్వాత బాధ్యతలు చేపట్టిన అధ్యక్షులంతా నిర్వర్తించిన బాధ్యతకంటే కూడా పెద్దది. అది దైవికమైనది. దేవుడి తోడ్పాడు లేకుండా పూర్తి కానిది. కనుక నా స్నేహితులారా మీ అధ్యక్షుడి ప్రయత్నాలు సఫలం అవ్వాలని దేవుడిని ప్రార్థించండి. మీరు లేకుండా నేను లేను’’.
ఈ ఆత్మీయతకు ఏ హృదయం ఉప్పొంగకుండా ఉంటుంది? ఏ కన్ను చెమర్చకుండా ఉంటుంది? ఏ మనసు ఆయన్ని మరీ మరీ కలవాలని తపించకుండా ఉంటుంది?

*******


వైట్ హైస్‌లో సాధారణ పౌరులను కలుసుకోవడం కూడా లింకన్‌కు ఒక అత్యవసర సమావేశమే! ఎంత ఒత్తిడిలో ఉన్నా ఏ ఒక్కరినీ నిరాశపరచకూడదని యన తన సిబ్బందికి స్థిర సూచనలు ఇచ్చారు. తెల్లవారు జామున మూడింటికే లింకన్ లేచి కూర్చుంటారు. ఐదింటి నుంచి సందర్శకులతో మాట్లాడేందుకు వెయిటింగ్ హాల్‌కి వస్తారు. ఒకసారి లింకన్‌ను కలుసుకునేందుకు ఒక వ్యక్తి వచ్చాడు. ఉదయం సరిగ్గా అయిదు గంటలకు అపాయింట్ మెంట్. పావు తక్కువ ఐదుకే వచ్చి వేచి చూస్తున్నాడు. ఇంతలో అక్కడికి అధ్యక్ష భవన ఉద్యోగి ఒకరు వస్తే వారిని అడిగాడు - ‘‘నేనిప్పుడు లింకన్‌ని కలవొచ్చా’’ అని. ‘‘కుదరదు’’ అని చెప్పాడా ఉద్యోగి. ‘‘కానీ నాకు అపాయింట్ మెంట్ ఉంది’’అన్నాడు వ్యక్తి.
‘‘ఎన్ని గంటలకు?’’
‘‘ఐదింటికి’’
‘‘ఐతే ఐదుగంటలకే ఆయన మిమ్మల్ని కలుస్తారు’’
సందర్శకుడు ఐదు అవడం కోసం టెన్షన్‌గా ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పక్కగదిలోంచి ఒక గొంతు గంభీరంగా వినిపిస్తోంది. ‘‘లోపలి మాటలు ఎవరివి’’ అని అడిగాడు సందర్శకుడు. ‘‘ప్రెసిడెంట్ స్వరం అది. రోజూ తెల్లవారు జామున నాలుగు నుంచి ఐదు గంటల వరకు లింకన్ ప్రార్థన చేస్తారు. భక్తి ప్రవచనాలు చదువుతారు’’అని చెప్పాడు ఉద్యోగి. లింకన్ తన జీవితంలో ఎప్పుడూ ఈ క్రమాన్ని తప్పలేదు. క్రమబద్ధంగా లేని వ్యక్తులను ఆయన చేరదియ్యలేదు.

*******

లింకన్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేనాటికి అంతర్యుద్ధం నుంచి అమెరికా అప్పుడప్పుడే కుదురుకుంటోంది. ఇక పునర్నిర్మాణమే మిగిలిందని అమెరికా ప్రజలు ఎదురుచూస్తుండగా ఆయన హత్య జరిగింది! కానీ లింకన్ వంటి చరిత్రాత్మక పురుషులకు మరణం ఉండదు. అయన అనుసరించిన ఉదాత్తమమైన జీవన శైలి తరతరాలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది.
లింకన్ జననం మానవాళికొక వరం. లింకన్ జీవనం ఆదర్శప్రాయం.



మనుషులంతా ఒక్కటే
లింకన్ స్కూల్లో చదివింది చాలా తక్కువ. కొన్ని నెలలు మాత్రమే పాఠశాలకు వెళ్లాడు.

పదకొండో యేటే చదువు మాని పన్లోకి వెళ్లాడు.

లింకన్‌కు తన మారుతల్లి శారా బుష్ జాన్‌స్టన్ దగ్గర చనువెక్కువ.

చిన్న వయసులో లింకన్ బైబిల్ ఎక్కువ గా చదివేవారు. బైబిల్ సత్యాలను తన జీవితమంతా ఆచరించారు.

అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు పెన్సిల్వేనియాలోని గెట్టిస్‌బర్గ్‌లో లింకన్ ఇచ్చిన ప్రసంగం చరిత్రాత్మకమైనది. నాలుగున్నర నెలల విరామం తర్వాత దక్షిణమెరికా రాష్ట్రాల కూటమి ‘కాన్ఫెడరసీ’పై యూనియన్ ఆర్మీ విజయం సాధించిన సందర్బంలో ఆయన ఈ ప్రసంగం చేశారు. ‘‘ ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్’’ అన్న మాట ఆయన ఇక్కడ అన్నదే. తర్వాత అది ఫేమస్ కొటేషన్ అయింది.

సెనెటర్‌గా లింకన్ రెండుసార్లు ఓడిపోయారు.

లింకన్ టాప్ 10 కోట్స్
ఏదైనా నీ లక్ష్య సాధన తర్వాతే.

ఎన్నేళ్లు జీవించామని కాదు, అన్నేళ్లలో ఎంత జీవితం ఉందన్నది చూడాలి.

మనస్తత్వం చెట్టులాంటిది. గుర్తింపు దాని నీడ వంటిది.

సామాన్యులంతా గొప్పవాళ్లే. దేవుడు సామాన్యులనే ఎక్కువగా పుట్టించడం వెనుక కారణమిదే.

గుర్తింపు రాలేదని బాధపడకు. గుర్తింపు కోసం పడే తపనను చల్లారనీయకు.

మనుషులంతా సమానంగా సృష్టింపబడినవారే.

శత్రు సంహారానికి నేను స్నేహ హ స్తం అనే ఆయుధాన్ని ఉపయోగిస్తాను.

స్వభావాన్ని బట్టే సంతోషం అన్నది దొరుకుతుంది.

నేను మెల్లిగా నడుస్తాను. వెనక్కి మాతం నడవను.

నిన్నటి కన్నా నేడు కాస్తయినా మెరుగవని వ్యక్తిని నేను పట్టించుకోను.

బానిసలకు దేవుడు
లింకన్ అధ్యక్షుడవగానే... అమెరికా సంయుక్త రాష్ట్రాలనుంచి వేరుపడుతున్నట్లు ప్రకటించుకుని ప్రత్యేక దేశంగా ఏర్పడిన 11 దక్షణమెరికా బానిస రాష్ట్రాల కూటమే కాన్ఫెడరసీ. ఈ కూటమిని కాన్ఫెడరేట్ స్టేట్స్ అనీ, కాన్ఫెడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనీ, సి.ఎస్.ఎ. అని కూడా అంటారు. బానిస రాష్ట్రాలంటే బానిసత్వం చట్టబద్ధమై ఉన్న రాష్ట్రాలు. లింకన్ ప్రభుత్వం తమకు గుర్తింపున్వికపోవడంతో కాన్ఫెడరసీ కయ్యానికి దిగింది. 1861-1865 మధ్య నాలుగేళ్ల పాటు ‘ఫ్రీ స్టేట్’ (బానిసత్వం లేనివి) గా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలపై తిరగబడి అమెరికా అంతర్యుద్ధానికి కారణమయింది. ఆ యుద్ధంలో కాన్ఫెడరేట్స్‌ని లింకన్ వ్యూహం అణిచివేసింది. 1865లో 13వ రాజ్యాంగ సవరణ ద్వారా బానిసత్వాన్ని రద్దు చేశారు.

లింకన్ హాస్య చతురత
లింకన్ సరదాగా మాట్లాడతారు. నవ్విస్తారు. జోకులు వేస్తారు. పిట్టక థలు చె ప్తారు. తన మీద వచ్చిన జోక్‌లను కూడా ఆయన ఎంజాయ్ చేస్తారు.

గాయపడి, ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న సైనికులను లింకన్ తరచు పరామర్శిస్తుండేవారు. మధ్యమధ్య జోక్స్ చెప్పి వారిని నవ్విస్తుండేవారు. అలా ఒకసారి - బెడ్‌పై ఉన్న సైనికులను నవ్వించి లింకన్ వెళ్లిపోగానే ఒక సందర్శకుడు సైనికుల వార్డులోకి అడుగుపెట్టాడు. వాళ్లింకా నవ్వుల నుంచి తేరుకోలేదు.

‘‘ఎందుకు నవ్వుతున్నారు? మీకు అయిన గాయాలు ఏమంత పెద్దవి కానట్లున్నాయి’’ అన్నాడా సందర్శకుడు.
దానికి ఒక సోల్జర్ సమాధానం:

‘‘నిజమే. ఏమంత పెద్ద గాయం కాదు. ఒక కాలు మాత్రమే పోయింది. లింకన్ వచ్చి జోక్స్ చెప్తానంటే రెండో కాలు పోగొట్టుకోడానికీ నేను సిద్ధంగా ఉన్నాను’’ అన్నాడు. అదీ ప్రెసిడెంట్ లింకన్ ‘విట్టీ పవర్’, ఆయన ఇచ్చే విల్‌పవర్.

జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్ టాటా

జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్ టాటా!
షార్ట్‌కట్‌లో జె.ఆర్.డి. ఇంకా షార్ట్‌గా... జే.
పేర్లకు షార్ట్‌కట్‌లు ఉంటాయి.
దారులకు షార్ట్‌కట్‌లు ఉంటాయి.
కానీ - కలలు నెరవేర్చుకోడానికి లక్ష్యాలకు దారులు వేసుకోడానికి లాంగ్ అవర్స్... వెరీ లాంగ్ అవర్స్ పనిచెయ్యాలి.
‘జే’ విజయ రహస్యం ఇదే.
దేశ నిర్మాణానికి ‘ఉక్కు’పాలు పట్టించారు జే.
జాతి పురోగతికి రెక్కలు తొడిగారు జే.
జాతీయ పతాకంలా...
దేశ అతిశయ పతాకమై రెపరెపలాడారు జే!
అజేయుడైన ఆ పారిశ్రామిక సార్వభౌముడి బయోగ్రఫీ ఇది.

జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్ టాటా (జె.ఆర్.డి.)
29 జూలై 1904 - 29 నవంబర్ 1993

జన్మస్థలం : పారిస్, ఫ్రాన్స్
తల్లిదండ్రులు : రతన్‌జీ దాదాభాయ్ టాటా
తల్లి : సూజన్ (సూనీ)
తోడబుట్టినవారు :సిల్లా, రోడాబె, దరబ్, జంషెడ్. (సిల్లాకు రోడాబెకు మధ్యలో జె.ఆర్.డి)
భార్య : థెల్కా వికాజీ
పిల్లలు : లేరు
ప్రతిష్ఠ : భారతరత్న అవార్డు



జె.ఆర్.డి. ది ప్రేమ వివాహం. థెల్మా వికాజీని అయన ప్రేమించి, పెళ్లిచేసుకున్నాడు. పెళ్లికి ముందు ఆమెతో రెండు నిమిషాలు ఏకాంతంగా మాట్లాడే అవకాశం కోసం ఆమె చుట్టూ ఉన్న పిల్లలకు ఏదో ఒక లంచం ఇచ్చి అక్కడి నుంచి పంపించేవాడు!

లాక్‌హీడ్‌లోని ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీ. కాలిఫోర్నియా.
గుయ్యిన విడిపరికరాలు తయారవుతున్నాయి. అన్నిటినీ కలిపితే జుయ్యిన పైకి ఎగిరే ఒక విమానం! ఆసక్తిగా చూస్తున్నాడు జె.ఆర్.డి. టాటా. ఎంత ఎత్తుకు ఎదిగింది అమెరికా!! కానీ అక్కడొక లూయీ బ్లేరియట్ పుట్టకుండా ఎలా సాధ్యం? అదే ఆలోచిస్తున్నారు జె.ఆర్.డి.
లూయిన్ బ్లేరియట్... ఫ్రెంచి ఏవియేటర్! విమానాలు నడుపుతాడు. ఎలా నడుపుతాడంటే, ఎక్కినవాళ్లకు దిగాలనిపించదు. దిగాక కూడా దిగినట్లనిపించదు. భూమి గిర్రున తిరుగుతున్నట్లుంటుంది. అన్ని చక్కర్లు కొట్టిస్తాడు. చెవులు పిండుతాడు. అతడి మీసాలు కూడా మీసాల్లా ఉండవు. విమానం రెక్కల్లా ఉంటాయి. పిల్లవాడిగా ఉన్నపుడు అతడి గురించి విన్నాడు జె.ఆర్.డి. కాస్త పెద్దవాడయ్యాక అతడిని నేరుగా చూశాడు.
ఎగురుతున్న పక్షిని మొదటిసారి చూసినప్పుడు జె.ఆర్.డి.కి ఏమనిపించిందో తెలీదు. బ్లేరియట్‌ను చూసినప్పుడు మాత్రం ఒకటనిపించింది. తను కూడా బ్లేరియట్‌లా విమానం తోకకు తాడు కట్టితిప్పినట్లు ఆకాశంలో గిరగిర తిప్పేయాలని! అలా జె.ఆర్.డి.కి హీరో అయ్యాడు బ్లేరియట్. పక్షులు చీకట్లో ఎగరవు నిజమే కానీ, బ్లేరియట్‌ను గుర్తుచేసుకుంటే జె.ఆర్.డి. నిద్దట్లో కూడా పక్షిలా మారిపోయి ఖండాలు దాటేస్తుంటాడు.
ఇండియాలో తొలి పైలట్ లెసైన్స్ జె.ఆర్.డి. టాటాది. దాని వెనుక ఉన్న ఇన్‌స్పిరేషన్ బ్లేరియట్‌ది.
...కానీ, బ్లేరియట్ పుట్టని అమెరికా అంత గొప్పది ఎలా అయింది?!
లాక్‌హీడ్ కర్మాగారంలోని యంత్రాల కర్ణకఠోర ధ్వనులను శ్రావ్యంగా వింటూ - చేతులు వెనక్కు కట్టుకుని - ముందుకు నడుస్తున్నారు జె.ఆర్.డి. ఇండియా నుంచి పనిగట్టుకుని అక్కడికి వచ్చారు ఆయన. విమానాల్ని ఎలా మలిస్తే ఎలా నడుస్తాయో తెలుసుకోవడం కోసం వచ్చారు. అప్పటికి ‘ఎయిర్ ఇండియా’ లేదు. ఇండియాను స్వేచ్ఛగా ఎగరనిచ్చే స్వాతంత్య్రమూ లేదు. ఇండియాలో ఎప్పటికైనా - ప్రయాణికుల కోసం విమానాలను నడిపే కంపెనీ పెట్టాలన్న ఒకే ఒక ఆలోచన ఆయన్ని ఇంతదూరం రప్పించింది.
చాలాసేపటిగా ఫ్యాక్టరీలో కలియదిరుగుతున్నారు జె.ఆర్.డి. గొంతు తడారినట్లనిపిస్తుంటే మంచి నీళ్ల కోసం చూశారు. లాక్‌హీడ్ అధికారులు వాటర్ డిస్పెన్సర్లు ఉన్నవైపు ఆయన్ని నడిపించారు. అక్కడ రెండు డిస్పెన్సర్లు ఉన్నాయి. రెండు ఎందుకంటే.. ఒకటి తెల్లవాళ్ల కోసం. ఇంకొకటి నల్లవాళ్ల కోసం!
జె.ఆర్.డి. తిన్నగా, నల్లవాళ్లకు కేటాయించిన డిస్పెన్సర్ దగ్గరికి వెళ్లి నీళ్లు తాగబోయారు. అది చూసి తెల్ల అధికారి ఒకరు పరుగున వచ్చారు. ‘‘వొద్దొద్దు మిస్టర్ జె.ఆర్.డి. అది మన కోసం కాదు’’ అన్నారు.
జె.ఆర్.డి. ఆశ్చర్యపోయారు. ‘‘నేను తెల్లవాడిని కాదు కనుక అది నా కోసం కేటాయించినదే అవుతుంది కదా’’ అన్నారు.
ఆ క్షణంలో ఆయనకెవ్వరూ అడ్డు చెప్పలేదు. ఆ తర్వాతెప్పుడూ అక్కడ రెండు డిస్పెన్సర్‌లు కనిపించలేదు.
అమెరికా గొప్ప దేశమే.
అంతకన్నా గొప్ప మానవతావాది జె.ఆర్.డి.!
తను గొప్ప వ్యక్తినని జె.ఆర్.డి. ఏనాడూ, ఎక్కడా చెప్పుకోలేదు. కానీ ఆయన పేరు, ప్రస్తావన లేకుండా భారతదేశం గొప్పతనం గురించి మాట్లాడుకోవడం కుదరని పని. స్వాతంత్య్రం వచ్చాక దేశ పునర్నిర్మాణానికి వెన్ను, సున్నం అందించిన జె.ఆర్.డి. రిటైర్ అయ్యేనాటికి ఆయన చేతికింద యాభైకి పైగా అత్యంత కీలకమైన పరిశ్రమలు ఉన్నాయి. పదివేల కోట్ల రూపాయలకు మించిన టర్నోవర్ ఉంది. స్టీల్, కెమికల్స్, ఏవియేషన్, ఇంజినీరింగ్, సైన్స్. వీటిల్లో కొన్ని... స్వాతంత్య్రానికి ముందే పుట్టినవి. జె.ఆర్.డి. పుట్టింది కూడా స్వాతంత్య్రానికి పూర్వమే.

*******

జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్ టాటా (జె.ఆర్.డి.) పుట్టింది పారిస్‌లో. పార్శీల కుటుంబం. అయితే తననొక భారతీయుడిగా మాత్రమే ఎవరైనా గుర్తించాలని ఈ పారిశ్రామికవేత్త జీవితాంతం కోరుకున్నారు. భారతీయతపై ఆయన పట్టింపు ఎంత గట్టిదో తెలియజెప్పే సంఘటనలు అనేకం ఉన్నాయి. ఓసారి ప్రఖ్యాత రచయిత్రి గీతా పిరామల్ జె.ఆర్.డి.ని ఇంటర్వ్యూ చేసేందుకు బాంబే హౌస్ చేరుకున్నారు. బాంబే హౌస్... టాటా గ్రూపు సంస్థల ప్రధానకేంద్రం. ఆవిడ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు జె.ఆర్.డి.
ఇంటర్వ్యూ మొదలైంది. అయితే మొదటి ప్రశ్న గీతా పిరామల్ కాకుండా, జె.ఆర్.డి. అడిగారు.
‘‘ఇంటర్వ్యూ ప్రధానంగా ఏ అంశంపై సాగబోతోందో తెలుసుకోవచ్చా’’ అని.
‘‘పారిశ్రామిక రంగంలో అగ్రగాములుగా నిలిచిన పార్శీల గురించి రాయబోతున్నాను’’ అని ఎంతో ఉత్సాహంగా చెప్పారు గీత.
కోపాన్ని ఆపుకున్నారు జె.ఆర్.డి.
‘‘నేను కేవలం ఒక పార్శీగానే ఎందుకు మిగలాలి? భారతీయుడిగా ఉండలేనా?’’ అని అడిగారు. గీతా పిరామల్ బిత్తరపోయారు. ఇంటర్వ్యూ అక్కడితో కట్.
జె.ఆర్.డి. నిరాడంబరంగా ఉంటారు. నిజాయితీని ఇష్టపడతారు. దేశాన్ని ప్రేమిస్తారు. తేడా వస్తే దేశ నాయకులనైనా వేలెత్తి చూపుతారు. ఆయనలో ఇంకా చాలా క్వాలిటీలు ఉన్నాయి. జీవితానికి క్రమశిక్షణ ముఖ్యం అంటారు. సమయాన్ని గౌరవించలేని వారు వ్యక్తిగా తమ గౌరవాన్ని కోల్పోతారని హెచ్చరిస్తారు. చేస్తున్న పనిపై శ్రద్ధ, ధ్యాస లేకపోవడం... సోమరితనం కన్నా కూడా దారుణమైన నైతిక నేరం అంటారు. భారతదేశంలోని రెండు మూడు తరాలను బాధ్యతాయుతమైన పారిశ్రామిక వేత్తలుగా మలిచిన వ్యక్తిత్వం ఆయనది. తల్లిదండ్రుల నుంచి ఆయనకు సంక్రమించిన సంపద అది!
జె.ఆర్.డి తండ్రి ఆర్.డి. (రతన్‌జీ దాదాభాయ్ టాటా) భారతీయుడు. జె.ఆర్.డి తల్లి సూజన్ బ్రియర్. ఫ్రెంచి వనిత. వాళ్లది ప్రేమ వివాహం. ఆర్.డి.తో పెళ్లయ్యాక ఆవిడ పార్శీ మతం స్వీకరించారు. ‘సూనీ’గా పేరు మార్చుకున్నారు. ‘టాటా’ అన్నది రతన్‌జీ దాదాభాయ్‌కి జంషెడ్జీ నస్సెర్‌వాన్జీ టాటా నుంచి పారిశ్రామికంగా అందివచ్చిన పేరు! దేశ అవసరాలను పదేళ్ల ముందే కనిపెట్టగల దార్శనిక పారిశ్రామిక వేత్త జంషెడ్జీ. మొదట ఆయన టెక్స్‌టైల్స్ బజినెస్ ప్రారంభించారు. తర్వాత ఉక్కు పరిశ్రమను నెలకొల్పారు. భారతదేశంలోనే అది మొట్టమొదటి స్టీల్ ఫ్యాక్టరీ. ఆ తర్వాత స్టీల్‌ని, టెక్స్‌టైల్స్‌ని కలిపి ‘టాటా అండ్ సన్స్’తో జాయింట్ వెంచర్‌గా మార్చారు. అందులో ఒక భాగస్వామి జంషెడ్జీ కుమారుడు దొరాబ్ టాటా. ఇంకో భాగస్వామి జంషెడ్జీ భార్య తరఫు బంధువు ఆర్.డి.
జంషెడ్జీని జె.ఆర్.డి. టాటా చూడలేదు. జె.ఆర్.డి. పుట్టడానికి రెండు నెలల ముందే జంషెడ్జీ మరణించారు.
జె.ఆర్.డి ప్రతిభను అతడి తల్లి చూడలేదు. జె.ఆర్.డి.కి పందొమ్మిదేళ్లప్పుడే ఆమె మరణించింది.
‘టాటా సన్స్’లో తన అప్పులు తీర్చడానికి కొడుకెన్ని తిప్పలు పడిందీ ఆర్.డి చూడలేదు. జె.ఆర్.డి.కి ఇరవై రెండేళ్లప్పుడే ఆయన మరణించాడు.
జీవితం ఎప్పుడు మొదలయ్యిందో, ఎక్కడ మొదలయ్యిందో జె.ఆర్.డి.కి గుర్తు లేదు. గుర్తు లేనంతగా అతడు పనిలో పడిపోయాడు. ఎప్పుడైనా ఒకసారి - ఏకాంతంలో... అతడికి అమ్మ గుర్తుకు వచ్చేది. అమ్మమ్మ ఆడించిన ఆటలు గుర్తుకు వచ్చేవి. ఫ్రాన్సుకు, ఇండియాకు మధ్య గడిచిన బాల్యంలోని జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేవి. ఆ జ్ఞాపకాలు... అతడి చుట్టూ తిరిగే విమానాలు అయ్యేవి.

*******

ఫ్రాన్స్‌లోని హార్డెలాట్ సిటీ.
అక్కడి బీచ్‌లో స్నేహితులతో కలిసి ఆడుకుంటూ పైన ఎరుగుతున్న విమానాన్ని చూశాడు చిన్నారి జె.ఆర్.డి.
మొదట ఆశగా చూశాడు. తర్వాత ఆసక్తిగా చూశాడు. అతడి ఆశని, ఆసక్తిని చూసి - ‘‘మా డాడీకి చెప్పి జాయ్‌రైడ్ కి తీసుకెళ్తాలే’’ అని జె.ఆర్.డి.కి మాటిచ్చాడు ఒక స్నేహితుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఆ స్నేహితుడి తండ్రి పేరు బ్లేరియట్. లూయీ బ్లేరియట్. తర్వాత్తర్వాత ఆయనే జె.ఆర్.డి.కి ఆరాధ్యుడయ్యాడు. ఆయన స్ఫూర్తితోనే - జె.ఆర్.డి. పాతికేళ్ల లోపే పైలట్ అయ్యాడు! ముప్పై నిండకుండానే సొంత విమానయాన సంస్థకు ఓనర్ అయ్యాడు. చివరికి భారత పారిశ్రామిక రంగానికే పైలట్ అయ్యాడు.
జె.ఆర్.డి. టాటా పేరు వినిపించినప్పుడు యావత్ భారతదేశం కంటే ముందు ముంబైలోని కెథడ్రాల్ అండ్ జాన్ కన్నన్ స్కూల్ ఉప్పొంగుతుంది. ఆయన చదువుకున్నది అక్కడే. ఆయనతో అనుబంధం ఉన్న సంస్థల యజమానులు, సన్నిహితులు, సాధారణ వ్యక్తులు, ప్రముఖులు, టాటా ఉద్యోగులు ఆయన్నొక వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా భావిస్తారు. ఆయన మాటల్లో అంతటి మంత్రం ఉంది మరి! నిజానికది మాటల్లోని మంత్ర శక్తి కాదు, జీవితాన్ని క్రమబద్ధం చేసుకున్న ఒక వ్యక్తి అనుభవాల నుంచి అనుక్షణమూ పలుకుతుండే అంతర్వాణి.
చదువు పూర్తయ్యాక ఫ్రెంచి సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఈ భారతీయుడు... తండ్రి ఆదేశం మేరకు ఇండియా వచ్చి ‘ఇండస్ట్రియల్ దళపతి’గా దేశాన్ని నడిపించడం వెనుక ఆయన సామర్థ్యం ఎంత ఉందో, విధుల నిర్వహణలో ఆయన నెలకొల్పిన విలువల ప్రభావం అంతగానూ ఉంది. లాభాలతో బరువెక్కిన ప్రతిమ కాదు జె.ఆర్.డి. జీవితం. దేశభక్తి, వ్యాపారశక్తి కలిసి ప్రతిష్టించిన ఉత్తేజపూర్వక విగ్రహం.

*******

‘‘మీ విజయ రహస్యం ఏమిటి?’’

ఎవరో అడిగారు జె.ఆర్.డి.ని.
‘‘నో సీక్రెట్. జస్ట్ లాంగ్ అవర్స్’’ - చెప్పారు జె.ఆర్.డి.
వారానికి డెబ్బై ఐదు నుంచి ఎనభై గంటలు పనిచేస్తారాయన! ఇక విజయం ఏ దారిన ఆయన కన్నుగప్పి తప్పించుకుంటుంది? అందుకే ఆయన యాభై రెండేళ్ల పాటు ‘టాటా’ గ్రూపు సంస్థల ఛైర్మన్‌గా విజయాలు సాధించారు. ఉక్కు, విద్యుచ్ఛక్తి, కెమికల్స్, ఆటోమొబైల్స్... ఇలా ఎన్నో పరిశ్రమలతో ఆయన దేశానికి స్వయం సమృద్ధిని సాధించి పెట్టారు. జె.ఆర్.డి. ఉండగా టాటా జంషెడ్‌పూర్‌లోని ఉక్కు కర్మాగారంలో ఒక్క రోజైనా సమ్మె జరగ లేదు!
జె.ఆర్.డి.ని ఆయన కన్నా వయసులో పెద్దవాళ్లు, సన్నిహితులు చనువుగా ‘జే’ అని పిలుస్తారు. ప్రపంచం ఆయన్ని గౌరవంగా... ‘మిస్టర్ టాటా’ అంటుంది. టాటాల మహాసామ్రాజ్యం ఆయనకు ఆపేక్షగా పెట్టిన కిరీటమే ‘టాటా’ అన్న పేరు. అందుకే అది పేరులా ఉండదు. ఒక బిరుదులా అనిపిస్తుంది! టాటా కూడా పైకి ఒక పెద్ద వ్యాపారవేత్తలా కనిపిస్తారు కానీ, లోలోపల అనేకమంది టాటాల కలయిక జె.ఆర్.డి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్, ఎడ్యుకేషన్, ఎక్స్‌పర్ట్ మేనేజ్‌మెంట్... ఇలా ప్రతి రంగంలోని అవసరాలను గుర్తించడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. అందుకు అవసరమైన వనరులను సమకూరుస్తారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటర్ రిసెర్చ్ జె.ఆర్.డి. నెలకొల్పినవే. ఆయన ఇచ్చిన నిధులతోనే హోమీ భాభా పరిశోధనా సంస్థ ఆవిర్భవించింది. మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోతే మేధస్సు నిరుపయోగమౌతుందని అంటారు జె.ఆర్.డి. ఆ కాలంలో గనుక ఇలాంటి వ్యక్తులు కనీసం ఇంకో ఇద్దరు ముగ్గురైనా ఉంటే భారతదేశం ఒక సంపన్న దేశం అయివుండేదని ఆయన ఆత్మకథ ‘బియాండ్ ద లాస్ట్ బ్లూ మౌంటేన్’ను రాసిన బయోగ్రఫర్ ఆర్.డి.ల అభిప్రాయం.
జనాభాను నియంత్రించకపోతే దేశాభివృద్ధి కుంటుపడుతుందని మొదట హెచ్చరించిన పారిశ్రామిక వేత్త జె.ఆర్.డి. అయితే హెచ్చరిక చేసి ఊరుకోలేదు ఆయన. కుటుంబ నియంత్రణకు పథకాలను కూడా రూపొందించారు. సామాజిక ధోరణులను అధ్యయనం చేసి, సామాజిక వైరుధ్యాలకు అవసరమైన పరిష్కారాలను పరిశీలించడం కోసం ‘టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్’ను స్థాపించారు. జె.ఆర్.డి. ప్రస్థానం అక్కడితో ఆగిపోలేదు.
క్యాన్సర్ మహమ్మారి గురించి మనకసలు ఏమీ తెలియనప్పుడు, మరణం తప్ప మరో మందుగానీ, చికిత్స గానీ లేదని అనుకుంటున్నప్పడు ‘టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రిసెర్చ్’ని స్థాపించారు జె.ఆర్.డి. ఒకనాడు పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన క్యాన్సర్ చికిత్సా సదుపాయాలు నేడు మనకూ అందుబాటులోకి వచ్చాయంటే ఆయన కృషి ఫలితమే.
ఒక్కమాటలో చెప్పాలంటే స్వాతంత్య్రానికి పూర్వమూ, స్వాతంత్య్రం వచ్చాక దేశాన్ని ‘పాలించిన’ ఏకైక పారిశ్రామికవేత్త ఆయన. డెబ్బై ఏళ్ల వయసులోనూ ముంబై నుంచి లండన్ వరకు విమానాన్ని నడుపుకుంటూ వెళ్లిన జె.ఆర్.డి.కి. పరిశ్రమల స్టీరింగ్‌తో దేశాన్ని నడపడం ఏమంత పెద్ద విషయం?
‘‘జస్ట్ లాంగ్ అవర్స్’’ అని కదా చెప్పారు జె.ఆర్.డి. తన విజయ రహస్యం గురించి!
కానీ ఒక్కరే లాంగ్ అవర్స్ కూర్చుని పని చేస్తే విజయం వరిస్తుందా? అందర్నీ కలుపుకుని పోవాలి. సంస్థలో కింది వారికి, పైవారికి... ఎవరికి తగిన గుర్తింపు వారికి ఇవ్వాలి. చిన్నాచితక ఉద్యోగులకు సైతం తామే సూత్రధారులమన్న నమ్మకం కలిగించాలి. జె.ఆర్.డి. ఆ పనే చేశారు. పెద్ద ప్రాజెక్టయినా, తన ఉద్యోగికి వచ్చిన చిన్న సమస్యైనా ఒకేలా శ్రద్ద తీసుకుని పనిచేస్తారాయన. ఆయన సమక్షంలో ప్రతి వ్యక్తి అభిప్రాయానికి విలువ ఉంటుంది. అందుకే టాటా సంస్థలతో అనుబంధం ఉన్న వ్యక్తులు ఆయన ఔదార్యం గురించి, ఆయన పాటించే విలువల గురించి పదే పదే గొప్పగా చెప్పుకుంటారు.

*******

తాజ్ గ్రూప్ హోటళ్ల ఒకప్పటి వైస్ ప్రెసిడెంట్ టి. దాము దగ్గర జె.ఆర్.డి.కి సంబంధించి కొన్ని అమూల్యమైన జ్ఞాపకాలు ఉన్నాయి. 2004లో జె.ఆర్.డి. శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వాటిని ఆయన ‘ది హిందూ’ పాఠకులతో పంచుకున్నారు. ముంబై హౌస్‌లోని టాటా ట్రస్ట్‌లో దాము ట్రెయినీగా ఉన్నప్పుడు... అతడు రోజూ వచ్చే సబర్బన్ రైలు ఆ వేళ ఆలస్యం కావడంతో ఆఫీస్‌కి లేటయింది. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ కారిడార్‌లోంచి నడుచుకుంటూ వెళుతుంటే అతడికో షార్ట్‌కట్ ఆలోచన వచ్చింది. తూర్పు వైపు ఉన్న లిఫ్ట్‌లోంచి తను ఎందుకు వెళ్లకూడదూ... అనుకున్నాడు. సాధారణంగా ఆ లిఫ్టును జె.ఆర్.డి. మాత్రమే ఉపయోగిస్తారు. ఆ విషయం గుర్తుకురాకో, ఇంకా ఆలస్యం కాకూడదనో లిఫ్టు దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు దాము. ఈలోపు ఎవరిదో గంభీరమైన స్వరం వినిపించింది. వెనక్కి తిరిగి చూశాడు దాము.
జె.ఆర్.డి!!
దామూకి గుండె ఆగినంత పనైంది. మనిషి బిర్ర బిగుసుకుపోయాడు. సారీ చెబుతున్నట్లుగా నవ్వు ముఖం పెట్టి పక్కనే ఉన్న మెట్లవైపు వెళ్లాడు. రెండు మెట్లు ఎక్కగానే వెనుక నుంచి ఖంగున జె.ఆర్.డి. పిలుపు. ‘‘ఇటొచ్చెయ్. వెళ్దాం’’ అంటున్నారు ఆయన. పరుగున లిఫ్టులోకి వచ్చి ఒద్దికగా, ఒక పక్కగా నిలబడి ‘‘థాంక్యూ సర్’’ అన్నాడు దాము.
‘‘ఏ ఫ్లోర్’’ అని అడిగారు జె.ఆర్.డి. సెకండ్ ఫ్లోర్ అని చెప్పగానే, అక్కడ ఆపమని లిఫ్టుబాయ్‌కి చెప్పారు జె.ఆర్.డి.
సెకండ్‌ఫ్లోర్‌లో దిగిపోతూ వెనక్కి తిరిగి మళ్లీ థ్యాంక్స్ చెప్పాడు దాము. చిరునవ్వుతో తల ఊపారు జె.ఆర్.డి.
తర్వాత కొంతకాలం వరకు దాము ఆ షాక్ నుంచి తేరుకోలేదు.
జె.ఆర్.డి. దేన్నీ వృథా కానివ్వరు. ముఖ్యంగా సమయాన్ని! ఆఫీసుకు వస్తున్నప్పుడు దారిలో ఎవరైనా వాచ్ చూసుకుంటూ హడావుడి పడుతుంటే డ్రైవర్ చేత కారు ఆపించి, లిఫ్ట్ ఇస్తారు. అది తన పౌరధర్మం అని భావిస్తారు.
తనే కాదు, ఎవరి నిమిషాన్నీ వృధా కానివ్వరు జె.ఆర్.డి. అలాగే ఏ చిన్న సలహానూ తీసిపారెయ్యరు. ఇందుకు ప్రత్యక్ష సాక్షి... ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధ.

*******

అప్పట్లో సుధ... సుధామూర్తి కాదు. సుధా కులకర్ణి. బెంగుళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ క్యాంపస్ విద్యార్థిని. లేడీస్ హాస్టల్లో ఉండి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తోంది. ఓరోజు ఆమె... లెక్చర్ హాల్ కాంప్లెక్స్ నుంచి హాస్టల్‌కు తిరిగి వెళుతుంటే నోటీస్ బోర్డులో టెల్కో (ఇప్పటి టాటా మోటార్స్) కంపెనీ ఉద్యోగ ప్రకటన కనిపించింది.
‘‘కష్టించి పని చేయగల అత్యుత్తమప్రతిభావంతులైన యువ ఇంజినీర్లకు టెల్కో ఆహ్వానం పలుకుతోంది. ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవచ్చు’’ అన్నది సారాంశం.
దాని కిందే చిన్న నోట్ : మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేయనవసరం లేదు.
నోట్ చదవగానే సుధ తీవ్రమైన ఆవేదనకు లోనయ్యారు. అందులోని లింగ వివక్షను ఆమె సహించలేకపోతోంది. నిజానికి ఆమెకా ఉద్యోగం చెయ్యాలని లేదు. కానీ నోట్ చూశాక ఆ కంపెనీ యజమానికి కనువిప్పు కలిగించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. హాస్టల్ గదికి రాగానే పోస్ట్ కార్డు అందుకుని జె.ఆర్.డి. టాటాకు ఉత్తరం రాయడం మొదలు పెట్టారు. టెల్కో టాటా వాళ్లది కాబట్టి, టాటాకు అధినేత జె.ఆర్.డి. కాబట్టి నేరుగా ఆయన్ని ఉద్దేశించే రాశారు. వాస్తవానికి అప్పటి టెల్కో ఛైర్మన్ సుమంత్ మూల్గావ్‌కర్.
‘‘టాటాలంటే గొప్పవాళ్లు. ఇండియాకు రక్తమాంసాలు ఇచ్చినవాళ్లు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వంటి విద్యాసంస్థల ఆవిర్భావం టాటాల పుణ్యమే. అదృష్టవశాత్తూ నేనక్కడే చదువుకున్నాను. కానీ టెల్కో వంటి టాటా కంపెనీ లైంగిక వివక్షను పాటించడం నాకు ఆశ్చర్యంగా ఉంది’’.
ఇంతవరకు రాసి సుధ ఆ ఉత్తరాన్ని డెరైక్టుగా జె.ఆర్.డి.కి పోస్ట్ చేశారు. తర్వాత ఆ విషయం మరిచిపోయారు. వారం తర్వాత ఆమెకొక టెలిగ్రామ్ వచ్చింది. టెల్కో ఇంటర్వ్యూకి రమ్మని!! పుణె దగ్గర పింప్రీలో ఇంటర్వ్యూ. సుధ వెళ్లింది.
బోర్డు సభ్యులలో ఒకరు సుధను చూస్తూ - ‘‘ఈ అమ్మాయే జె.ఆర్.డి.కి ఉత్తరం రాసింది’’అని పక్కన ఉన్నవాళ్లకు చెప్పడం ఆమె గమనించింది. ఏదో పిలవడానికి పిలిచారు కానీ, తనకా ఉద్యోగం రాదని సుధ అనుకుంది. అందుకే నిర్లక్ష్యంగా సమాధానాలిచ్చింది. పనిలో పనిగా అమ్మాయిలను ఉద్యోగాలకు వద్దనడం న్యాయమేనా? అని అడిగింది.
ఇంటర్వ్యూ చేస్తున్నవాళ్లలో ఒక పెద్దాయన సౌమ్యంగా సమాధానం చెప్పారు. ‘‘చూడమ్మా... ఇది కో-ఎడ్యుకేషన్ కాలేజీ కాదు. కర్మాగారం. మీలాంటి ప్రతిభ గల అమ్మాయిల్ని రిసెర్చ్ లేబరేటరీలలోకి తీసుకోగలం కానీ, చూస్తూ చూస్తూ యంత్రాల మధ్యకు పంపలేం కదా. అందుకే అలా నోట్ పెట్టాం’’ అన్నారు.
‘‘ఎక్కడో ఒక చోట ఈ సంప్రదాయానికి బ్రేక్ పడాలి కదా’’ అంది సుధ. ఆమె అన్నట్లే బ్రేక్ పడింది. ఆమెకా ఉద్యోగం వచ్చింది. తర్వాత సుధా కులకర్ణి... సుధామూర్తి అయింది. అయితే పుణె నుంచి బాంబే బదలీ అయ్యేవరకు ఆమెకు జె.ఆర్.డి. దర్శనభాగ్యమే కలగలేదు. కంపెనీ ఛైర్మన్ సుమంత్ మూల్గావ్‌కర్‌కు ఏవో నివేదికలు అందించడం కోసం బాంబే హౌస్ ఫస్ట్ ఫ్లోర్‌లో వేచి ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఓరోజు అమెకు జె.ఆర్.డి. కనిపించారు. అదే మొదటిసారి సుధ ఆయన్ని చూడ్డం!
‘‘జే.. టెల్కో ఫ్యాక్టరీలో చేరిన మొట్టమొదటి ఉమన్ ఇంజినీర్’’ అంటూ సుధను పరిచయం చేశారు సుమంత్. సుధలో వణుకు మొదలైంది. దేవుడా దేవుడా పోస్ట్ కార్డ్ సంగతి ఎత్తకుండా చూడు అనుకుంది. జె.ఆర్.డి. చిరునవ్వు నవ్వి సుమంత్‌తో మాటల్లో పడిపోయారు.

ఆ తర్వాత అప్పుడప్పుడు టాటాహౌస్‌లో జె.ఆర్.డి. తారసపడుతూనే ఉన్నారు సుధకు.
ఓరోజు - ఆఫీస్ టైమ్ అయిపోయాక మూర్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సుధ. పక్కనే వచ్చి నిలబడ్డారు జె.ఆర్.డి. ఆవిడకు మళ్లీ పోస్ట్ కార్డ్ గుర్తొచ్చింది.
‘‘ఇక్కడేం చేస్తున్నావమ్మా’’ అని అడిగారు టాటా అధినేత తన ఉద్యోగిని.
‘‘సర్.. ఆఫీస్ టైమ్ అయిపోయింది. పికప్ చేసుకోడానికి నా భర్త వస్తానన్నారు. అందుకే వెయిట్ చేస్తున్నా’’ అని భయం భయంగా చెప్పారు సుధ.
‘‘చీకటి పడుతోంది. ఆయన వచ్చేవరకు నేనూ ఇక్కడే ఉంటాను’’అన్నారు జె.ఆర్.డి.
సుధ ఫ్రీజ్ అయిపోయింది. కనుకొనల్లోంచి ఆయన్నే చూస్తోంది. వైట్ ప్యాంట్, వైట్ షర్ట్‌లో చాలా సింపుల్‌గా ఉన్నారు ఆయన. వృద్ధాప్యపు ఛాయలు ఆయన ముఖంలోని కాంతిని పోగొట్టేందుకు విఫలయత్నం చేస్తున్నాయి. సుధ ఆలోచిస్తోంది. దేశంలోనే అత్యంత గౌరవనీయుడైన ఒక పారిశ్రామికవేత్త ఒక సగటు ఉద్యోగికి సహాయంగా వేచి ఉండడం ఆమెను ఉద్వేగానికి లోను చేస్తోంది. క్షణాలు గడుస్తున్నాయి. మూర్తి వస్తూ కనిపించాడు. రివ్వున ఎగిరిపోయింది సుధ.
జె.ఆర్.డి. ఆమెను పిలిచి చెప్పారు - ‘‘ఇంకె ప్పుడూ తన భార్యను ఇలా నిరీక్షింపజెయ్యొద్దని నీ భర్తకు చెప్పు’’ అన్నారు. జె.ఆర్.డి.లోని కేరింగ్ స్వభావానికి చిన్న ఉదాహరణ మాత్రమే ఇది.
1982లో టెల్కో నుంచి బయటికి వచ్చారు సుధ. నిజానికి అంతమంచి ఉద్యోగం మానేసి వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు. కానీ తప్పని పరిస్థితి. ఫైనల్ సెటిల్‌మెంట్ అయ్యాక బాంబే హౌస్ మెట్లు దిగుతుంటే జె.ఆర్.డి. ఎదురయ్యారు ఆమెకు. ఏదో ఆలోచనలో ఉన్నారు. ఆయన దగ్గర వీడ్కోలు తీసుకోవడం కోసం ఆగారు సుధ.
‘‘ఎలా ఉన్నావమ్మాయ్’’ అని అడిగారు జె.ఆర్.డి.
‘‘ఉద్యోగం మానేస్తున్నాను సర్’’ అని చెప్పింది సుధ.
‘‘మానేసి?’’
‘‘పుణె వెళ్లిపోతున్నాను సర్. నా హస్బెండ్ అక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. పేరు ఇన్ఫోసిస్’’.
‘‘ఓ! ఆ తర్వాత ఏమిటి? ఐ మీన్... అది సక్సెస్ అయ్యాక ఏమిటి?’’
సుధ క్షణం సేపు ఆగింది. ‘‘సక్సెస్ అవుతామో లేదో తెలీదు సర్’’ అంది.
జె.ఆర్.డి. ఆమె వైపు చూశారు.‘‘ ఏ పనినీ అపనమ్మకంతో మొదలుపెట్టకూడదు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. సక్సెస్ అయినప్పుడు సమాజానికి మనం ఏదైనా ఇవ్వాలి. ఎందుకంటే సమాజం మనకు ఇచ్చినందువల్లే తిరిగి ఇచ్చే స్థితికి చేరుకుని ఉంటాం కాబట్టి. ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
జె.ఆర్.డి తను ఇవ్వగలిగినంతా సమాజానికీ, దేశానికీ ఇచ్చారు. ఆ ప్రయత్నంలో ఊహించని విధంగా ఎదుైరె న విమర్శలను తట్టుకుని సమర్థంగా నిలబడ్డారు. పారిశ్రామిక వేత్తలు దేశాన్ని విదేశాలకు తాకట్టు పెడుతున్నారన్న ఆరోపణలు వచ్చినప్పుడు స్థిరంగా నిలబడి తిప్పికొట్టారు. ఒక సందర్భంలో గాంధీజీతో కూడా తలపడ్డారు!

*******

1945 - మే - మొదటివారం.
ఐదు కోట్ల మందిని బలితీసుకున్న రెండో ప్రపంచం సమాప్తం అయింది! ఐరోపాలో దేశాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. ఇక్కడ - బొంబాయిలో గుడి గంటలు మోగుతున్నాయి. యుద్ధం అంతమైనందుకు భారతీయులు దేవుడికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కానీ అదే వారం ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరు మహాత్మాగాంధీ, ఇంకొకరు జె.ఆర్.డి. టాటా!
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కోసం భారతదేశ పారిశ్రామికవేత్తల బృందం ఇంగ్లండ్, అమెరికా దేశాలను పర్యటించడానికి సిద్ధం కావడం సిగ్గుచేటని గాంధీజీ అన్నారు. ఆ మాట జె.ఆర్.డి.కి ఆగ్రహం తెప్పించింది. ‘‘భారతదేశ పారిశ్రామికాభివృద్ధి కోసం గాంధీజీ అనుకుంటున్న సిగ్గుచేటు పని చెయ్యడానికి ఎవరైనా వెనకాడవలసిన పనిలేదు’’ అని ప్రకటించారు. గాంధీ మార్గాన్ని గౌరవించిన జె.ఆర్.డి... గాంధీజీ స్వదేశీ సిద్ధాంతంలోని అభివృద్ధి అవరోధక కోణాలపై బాహాటంగానే చర్చించారు. అదీ జె.ఆర్.డి. సంకల్పబలం.

పారిశ్రామిక సామ్రాజ్యాధీశుడిగా జె.ఆర్.డి.ని కాసేపు పక్కన పెట్టి చూస్తే ఆయనలో భిన్నమైన వ్యక్తి కనిపిస్తారు. నాయకత్వం అంటే ఆయన దృష్టిలో ఆధిక్యం ప్రదర్శించడం కాదు. ఆత్మీయంగా ఉండడం. డబ్బు సంపాదన కోసం ఆయన ఏ పనీ చెయ్యలేదు. డబ్బు వస్తుందా లేదా అని లెక్కలేసుకుని ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ‘‘డబ్బు ఎరువు లాంటిది. కుప్పగా పోస్తే కుళ్లి కంపు కొడుతుంది. విస్తారంగా చల్లితే పంటగా ఎదుగుతుంది’’ అంటారు జె.ఆర్.డి! సామాన్యుల ఆకలి ఆహారంతో తీరితే.. అసామాన్యుల క్షద్బాధ సేవాకార్యక్రమాలతో కానీ చల్లార దని కూడా ఆయన అంటుండేవారు.
‘‘పని చేస్తున్నప్పుడు అంతా నీ మీదే ఆధారపడి ఉన్నదనుకుని పని చెయ్యి. ప్రార్థిస్తున్నప్పుడు భారమంతా దేవుడి మీదే వేసి ప్రార్థించు’’ అని జె.ఆర్.డి. చెప్పిన మాట ఇవాళ్టికీ... కార్పోరేట్ ఆఫీసులను వేదమంత్రమై నడిపిస్తోంది.



జె.ఆర్.డి. గురించి మరికొంత
బాల్యమంతా ఫ్రాన్స్‌కు, భారత్‌కు మధ్య గడిచింది. (మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ కుటుంబం రెండేళ్ల పాటు జపాన్‌లో కూడా గడిపింది.)

చిన్నప్పుడు జె.ఆర్.డి.కి ఫ్రెంచి తప్ప మరే భాషా సరిగ్గా వచ్చేది కాదు.

కేంబ్రిడ్జిలో ఇంజినీరింగ్ చదవాలని ఆయన కోరిక. అందుకోసం మంచి ఇంగ్లీష్ నేర్చుకోడానికి ఇంగ్లండ్ వెళ్లాడు.

కోర్సు పూర్తి కాకుండానే జె.ఆర్.డి. కి ఫ్రాన్స్ నుంచి పిలుపు వచ్చింది. ఇరవై ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఫ్రాన్స్ సైన్యంలో పని చెయ్యాలి. అందుకే ఆ పిలుపు.

ఏడాది అయ్యాక - టాటా స్టీల్ వ్యవహారాలు చూసుకోడానికి రమ్మని - భారత్‌లో తండ్రి నుంచి పిలుపు వచ్చింది.

అలా ఇంజినీరింగ్ చదవాలన్న జె.ఆర్.డి. కోరిక నెరవేరలేదు.

టాటా స్టీల్ డెరైక్టర్-ఇన్‌చార్జి జాన్ పీటర్‌సన్ దగ్గర వ్యాపార లావాదేవీలలో ఐదేళ్ల పాటు జె.ఆర్.డి. శిక్షణ పొందారు.

ఛైర్మన్‌గా జె.ఆర్.డి బాధ్యతలు స్వీకరించే నాటికి టాటా గ్రూపులో 14 కంపెనీలు ఉండేవి. వాటి టర్నోవర్ సుమారు రూ.250 కోట్లు.

ఛైర్మన్‌గా జె.ఆర్.డి రిటైర్ అయ్యేనాటికి టాటా గ్రూపులో 50కి పైగా కంపెనీలు ఉన్నాయి. వాటి టర్నోవర్ సుమారు రూ. 10000 కోట్లు.

1938 జూలైలో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించేనాటికి జె.ఆర్.డి వయస్సు 34.

జె.ఆర్.డి. దగ్గర ఎప్పుడూ టేప్ రికార్డర్ ఉండేది. తన ప్రసంగాలను అందులో రికార్డ్ చేసుకుని రెండుమూడుసార్లు విని సరిచేసుకునేవారు. తర్వాతే ప్రసంగించేవారు.

‘ఎయిర్ ఇండియా’ సంస్థ జె.ఆర్.డి. నెలకొల్పిందే. మొదట దాని పేరు ‘టాటా ఎయిర్‌లైన్స్’. ప్రభుత్వం దాన్ని జాతీయం చేశాక ఎయిర్ ఇండియా అయింది.



జె.ఆర్.డి. స్వభావం
టైమ్ అంటే టైమే.

ఉద్యోగులతో స్నేహ సంబంధాలు

నిజాయితీ

బ్యూరోక్రాట్ల పెత్తనంపై అసహనం.

భారతదేశానికి ఏదైతే మంచిదో టాటాలకూ అదే మంచిది అనే విశ్వాసం.

తంత్ర చాణక్య

నా పేరు మల్లి నేను నా జీవితంలొ ప్రభావితం ఐన కొంతమంధి వ్యకుతులలొ చానక్యుడు కూడా ఒకరు

అమెరికా అప్పుల్లో ఉంది. లక్షల కోట్ల డాలర్ల తిప్పలవి!
ఐరోపా గొప్పల్లో ఉంది. ఉడకని ‘ఉమ్మడి’ యూరోల పప్పులవి!
అయిల్ కంట్రీల జాతకం ఘాతుకంలా ఉంది. నియంతల గొంతుకు బిగుస్తున్న పిడికిళ్లవి!
ఆసియన్ల అభివృద్ధి ఎక్కడిదక్కడే ఉంది. ముందుకు పడని అడుగులవి!!
కూటములకు, పాటవాలకు ఈ లెక్కలేవీ అందడం లేదు. దిక్కులు తోచడం లేదు.
రాచరికం, రిపబ్లికనిజం, సోషలిజం, ఐరాసయిజం... చిల్లర డబ్బుల కోసం దేబిరిజం!!
ఓ మై చాణక్యా! మౌర్యవంశ మంత్రివర్యా!! అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నడిపావయ్యా?!
ఇవాళ 20 నవంబర్. క్రీ.శ. 2011. ఇవాళ్టికీ అగ్రరాజ్యాలు, అల్పాదాయ దేశాలు...
ఓం చాణక్యాయ నమః దరి చేర్చాయనమః అంటున్నాయి! ఏమిటి చాణక్యుడి గొప్పతనం?
ప్రభుత్వాలు ఎందుకిలా ఆయన్ని జపిస్తున్నాయి? ఇదే ఈవారం బయోగ్రఫీ.



దూకుడు మీద ఉన్నాడు అలెగ్జాండర్.
బల్గేరియా, ఇజ్రాయిల్, ఈజిప్టు, లిబియా, ఇరాక్, ఇరాన్, ఆప్ఘనిస్థాన్, సోవియెట్ యూనియన్... ఒకటొకటీ మోకాళ్లపై కుంగిన గుర్రాలవుతున్నాయి.
మిగిలింది... భారతావని!
ప్రపంచాన్ని జయించడం అలెగ్జాండర్ టార్గెట్. హిందూఖుష్ పర్వతాలకు కాస్త అవతల... ప్రపంచ భూభాగం అంతమౌతుందని అతడి గురువు అరిస్టాటిల్ చెప్పినట్లు గుర్తు. ఇప్పుడు అటువైపే వస్తున్నాడు అలెక్స్.
హిందూఖష్ దగ్గర అప్పటికే నాలుగు నదుల్ని దాటింది అలెగ్జాండర్ సైన్యం. ఐదవ నది హైఫాసిన్ కూడా దాటితే... మగధ, గాంధార రాజ్యాలు! వాటిని కూడా జయిస్తే... తనిక మేసిడోనియా చక్రవర్తి కాదు. జగదేక గ్రీకు వీరుడు.
నదిలోని నీళ్లను తలపై చల్లుకుని పులకరించిపోయాడు అలెగ్జాండర్.
నదిని దాటి వస్తే... మ-గ-ధ!

********

దిగ్గున లేచి కూర్చున్నాడు చాణక్యుడు!
కలగన్నాడా? కాదు, అలెగ్జాండర్ కంటున్న కల నెరవేరబోతున్నదని గ్రహాలు చెబుతున్నట్లు గ్రహించాడు.
భుజాల కిందికి దిగిన శిరోజాలను సాలోచనగా సవరించుకుని, జుట్టు ముడివేసుని పైకి లేచాడు చాణక్యుడు. తక్షశిల నుంచి తక్షణం మగధకు బయల్దేరాడు. అతడిప్పుడు మగధ చక్రవర్తి ధననందుడిని కలవాలి. అలెగ్జాండర్ ఎంతటి శక్తిమంతుడో వివరించాలి. మగధను రక్షించుకునే మార్గం చెప్పాలి. వింటాడా? విందులు, చిందులలో తేలిపోతున్న చక్రవర్తి.. మేఘాలలోంచి కిందికి దిగుతాడా? లేక పర్షియా చక్రవర్తి డేరియస్‌లా పరాజితుడై ప్రజల్ని, పడతుల్ని అలెగ్జాండర్‌కు వదిలి పారిపోతాడా?
రాజప్రాసాదం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు చాణక్యుడు. తక్షశిల విశ్వవిద్యాలయ ఆచార్యుడతడు. చరిత్ర తెలుసు, వర్తమానం తెలుసు. భవిష్యత్తూ తెలుస్తోంది. అలెక్స్ మూకలు పర్షియా రాజధాని పెర్సిపొలిస్‌ను విజయగర్వంతో ఎలా తొక్కి నాశనం చేసిందీ అతడి బుద్ధి ఊహిస్తోంది. అంతటి దుర్గతి మగధకు గానీ, మరే భారత భూభాగానికి గానీ పట్టకూడదు.
సభకు చేరుకున్నాడు చాణక్యుడు. నిండు సభలో కొలువై ఉన్నాడు ధననందుడు.
‘ఈ అందవికారుడికి ఇక్కడేమిటి పని’ అన్నట్లు సభ అతడిని నిలబెట్టి నిశ్శబ్దంగా చూస్తోంది. చక్రవర్తికి రుచించని ఏ వార్తనూ వినేందుకు సభ సిద్ధంగా లేదు!
చాణక్యుడు గొంతు సవరించుకున్నాడు.
‘‘దేవుడి దయ వల్ల మనమింకా మన రాజ్యంలోనే ఉన్నాము చక్రవర్తీ. సమయం మించిపోలేదు. సరిహద్దులవైపు అలెగ్జాండర్ సైనిక బలగాలు కదులుతున్న సూచనలు గోచరిస్తున్నాయి. వారిని మనవైపు రానివ్వకుండా గాలివానలు ఆపుతున్నాయి. ఈలోపే మగధ, గాంధార రాజ్యాలు ఏకం కావాలి. లేదంటే మగధరాజ్యం మేసిడోనియా మహాసామ్రాజ్యపు తునకగా మిగిలిపోతుంది’’ అన్నాడు.
గర్జన, ఘీంకారం కలగలిపి అహంకరించాడు ధననందుడు! సభ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సభలోని నిశ్శబ్దం బిక్కచచ్చింది.
‘‘ఎవరక్కడ! ఈ తీతువును తరిమికొట్టండి’’ అన్నాడు. మళ్లీ ఒక్క క్షణంలో - ఆగమన్నాడు.
‘‘అతడి జుట్టు పట్టుకుని ఈడ్చుకువెళ్లండి. ఆ జుట్టు కిందే కదా మగధసామ్రాజ్య భవిష్యత్తు ఉంది! అలెగ్జాండరట, గాంధారదేశంతో సంధులు, సమాలోచనలట. జోస్యం వినేందుకు నేనీ పీఠం మీద కూర్చోలేదని ఆచార్యులవారికి అర్థమయ్యేలా దేహబుద్ధులను శుద్ధి చెయ్యండి’’ అని ధననందుడు అజ్ఞాపించాడు.
మంత్రులు, పరరాజ్య ప్రతినిధులు, రాజ్యాధికారులు, రమణులు... ఇందరున్న సభలో చాణక్యుడుకి అవమానం జరిగింది. అతడి ప్రజ్ఞకు ఘోర పరాభవం జరిగింది. శరీరంతో పాటు మనసూ గాయపడింది. రక్తం ఓడింది. ఆగ్రహంతో. ఆవేదనతో, ప్రతీకారంతో బయటికి నడిచాడు. జుట్టు ముడి విప్పాడు. ధననందుడిని రాజ్యభ్రష్టుడిని చేసేవరకు, భరతదేశాన్నంతటినీ సమైక్యంగా ఉంచే సమర్థుడిని మగధకు చక్రవర్తిని చేసేవరకు జుట్టుముడి వేయనని శపథం చేశాడు.

********


క్రీస్తుకు పూర్వం 300 ఏళ్ల నాటి సంగతి ఇది.
చాణక్యుడు శపథం నెరవేర్చుకున్నాడు. నందవంశ పాలనను అంతమొందించి, తన శిష్యుడు చంద్రగుప్తుడిని మగధకు చక్రవర్తిని చేశాడు. తను మంత్రి అయ్యాడు. మౌర్య సామ్రాజ్యానికి పునాదులు వేశాడు.
అలెగ్జాండర్‌తో అసలు గొడవేలేకుండా పోయింది. హైఫాసిన్ నదిని దాటేందుకు అతడి సేనాపతులు సంశయించారు. అప్పటికే మూడు నెలలుగా ఏకధాటిన వర్షం. ఆహార పదార్థాలు పాడయ్యాయి. ఆయుధాలు తుప్పుపట్టాయి. శకునాలేవీ బాగోలేవని త్రికాలజ్ఞులు తేల్చేశారు. అలెక్స్ నిరాశ చెంది, అంతదూరం వచ్చినందుకు ఆనవాళ్లుగా పన్నెండు మంది గ్రీకు దీవుళ్లకు పన్నెండు ప్రార్థనా పీఠాలు ప్రతిష్టింపజేసి వెనుదిరిగాడు.

ఒక వేళ - ప్రకృతి అలెగ్జాండర్‌కు సానుకూలంగా ఉండి ఉంటే, అతడు మగధను, గాంధారను కలుపుకుని ఉంటే... మౌర్య వంశ స్థాపన జరిగి ఉండేది కాదు. చాణక్యుని ‘అర్థశాస్త్రం’, ‘నీతిశాస్త్రం’ గ్రీకు సామ్రాజ్య సంపదలై ఉండేవి.
ఎనిమిదేళ్ల సుదీర్ఘ దండయాత్రల అనంతరం హిందూఖుష్ నుంచి వెనుదిరిగి నేరుగా మేసిడోనియాలో అడుగుపెట్టినప్పుడు అలెగ్జాండర్‌కు అరాచకం, అవినీతి స్వాగతం పలికాయి. వాటిని చక్కదిద్దలేక సతమతమయ్యాడు అలెక్స్. పక్కన చాణక్యుడు ఉంటే బహుశా పరిస్థితి ఇంకోలా ఉండేది. రాజనీతి వ్యూహాలకు, సంక్షోభ నివారణ తంత్రాలకు చాణక్యుడిని మించినవారు అవనిలోనే లేరు.

********

క్రీస్తు శకం 2011. నవంబర్ 20.
అమెరికా. ఒంట్లో బాగోలేదు. డాలర్‌కి అస్తమానం ఏవో ఇన్ఫెక్షన్‌లు.
ఐరోపా. ఉమ్మడి ఇంట్లో యూరోల గొడవలు. చాల్లేదని ఒకరు. సరిపెట్టుకొమ్మని ఒకరు.
ఇండియా. జనాభా ఎక్కువ. జాగ్రత్తలు తక్కువ.
కూటములకు, కటిక రాజనీతిజ్ఞులకు సైతం దిక్కుతోచడం లేదు. హే, చాణక్యా! మౌర్యసామ్రాజ్యాన్ని ఎలా నడిపావయ్యా?!
రెండు వేల మూడొందల ఏళ్ల తర్వాత... ఇవాళ్టికీ ప్రపంచ దేశాలు, రాజ్యాలు... చాణక్యుడిని తలచుకుంటూనే ఉన్నాయి. కష్టమొచ్చినప్పుడు మనిషి దేవుడి వైపు చూసినట్లు, సంక్షోభ కాలంలో దేశాలు చాణక్యుడు రచించిన అర్థశాస్త్రాన్ని తిరగేస్తున్నాయి. గిట్టనివారు అతడిని కౌటిల్యుడు అన్నప్పటికీ, గట్టెక్కడానికి చివరికి ఆ కౌటిల్యతనే అనుసరించారు. నిజానికది కుటిలత్వం కాదు. జీవనలౌక్యం. బతకడం ఎలాగో నేర్పించ డం.
‘‘అంత నిజాయితీ పనికిరాదు’’ అంటాడు చాణక్యుడు. దీన్ని మనం ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. చాణక్యుడి అర్థం వేరే. నిటారుగా ఉండే చెట్లను మొదట నరికేస్తారనీ, నిజాయితీగా ఉండేవాళ్లు త్వరగా నమ్మకద్రోహానికి గురవుతారని ఆయన ఉద్దేశం.
‘‘ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మొదట నిన్ను నువ్వు మూడు ప్రశ్నలు వేసుకో. నేనెందుకు ఈ పని చేస్తున్నాను? ఫలితం ఎలా ఉండబోతోంది? ఇందులో నేను విజయం సాధిస్తానా?
ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభిస్తే అప్పుడు నువ్వు ముందుకు వెళ్లవచ్చు’’
‘‘పుస్తకాలకే పరిమితమైన జ్ఞానం, ఇతరుల స్వాధీనంలో ఉన్న ఆస్తి మన అవసరాలకు ఉపయోగపడవు’’.
చాణక్యుడి అర్థశాస్త్రంలోని సూత్రాలివి. ఇంకా చాలా ఉన్నాయి. అన్నిటి అంతస్సూత్సం ఒకటే - ‘‘నీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకు. అది నిన్ను నాశనం చేస్తుంది’’.

చాణక్యుని కీలక గురుమంత్రం ఇది. నువ్వు బయట పడితే నీకు భయపడడం తగ్గుతుందన్నది అంతరార్థం.
చాణక్యుని అర్థశాస్త్రంలో ఆరువేలకు పైగా సూత్రాలు ఉన్నాయి. ‘చాణక్య నీతి’ అనేది మరో ఉద్గ్రందం. అందులో నీతి సూత్రాలు ఉన్నాయి. ఆర్థశాస్త్రంలో డబ్బు గురించి ఉన్నప్పటికీ, డబ్బు గురించి మాత్రమే లేదు. రాజనీతి, యుద్ధనీతి, వ్యక్తి నీతి, సంఘ నీతి... ఇలా అనేక జీవన నీతులున్నాయి. ఇప్పటికీ, ఎప్పటికీ అవి మనిషికి, వ్యవస్థలకు అవసరమైనవి. అప్పుడప్పుడు మన బడ్జెట్ ప్రసంగాలలో చాణక్యుని మాట వినిపిస్తుంటుంది. బడ్డెట్‌ల రూపకల్పనల్లో చాణక్య నీతి కనిపిస్తుంటుంది.

బతకడానికి, బాగా బతకడానికి మధ్య తేడాలను చెప్పిన తాత్విక పండితుడు చాణక్యుడు. అనుభవంతో పండి, అనుభవసారాన్ని పిండి లోకానికి ఉగ్గు పట్టించిన ‘హితా’మహుడతడు. వృత్తిలో ఎదగదలచిన వాడికి స్నేహమెంత ముఖ్యమో, శత్రుత్వం అంత ముఖ్యమని అంటాడు. ఎదుగుతున్న క్రమంలో మంచీచెడూ రెండూ సోపానాలే అంటాడు.


ఏదైనా పని మొదలు పెట్టేముందు ఎవరైనా తమ ఇష్టదైవాన్ని స్తుతిస్తారు. చాణక్యుడు మాత్రం ఓం మంచీచెడాయనమః అంటాడు. ఆయన భాషలో అది ‘ఓం నమః శుక్రబృహస్పతిభ్యాం’. అంటే బృహస్పతికొక దండం, శుక్రాచార్యుడికొక దండం అని. బృహస్పతి దేవతల గురువు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. దండం ఇద్దరికీ పెట్టినా మంచికే లయబద్ధుడై ఉంటాడు చాణక్యుడు.
ఇంతటి విజ్ఞత, స్థితప్రజ్ఞత చాణక్యుడికి ఎక్కడివి? ఏ తల్లికి ఏ దేవుడి మంత్రోపదేశంతో ఈ లోకంలో కళ్లు తెరిచి ఉంటాడు. ఉహు.. లోకంలోకి వచ్చే వరకు ఆగి ఉండడు. తల్లి గర్భంలోనే కళ్లు తెరిచి ఉంటాడు!

********

చాణక్యుడు రాసిన గ్రంథాలు రెండే రెండు. చాణక్యుడిపై వచ్చిన పుస్తకాలు వందలు వేలు. చాణక్యుడు తను చెప్పదలచింది రాశాడు గానీ తన గురించి రాసుకోలేదు. కనుక చాణక్యుడి గురించి రాయడానికి ఎవరికీ ఏమీ దొరకలేదు. వందేళ్ల క్రితం మైసూరులోని ప్రాచ్యలిఖిత భాండాగారంలో చెదలు పట్టబోతున్న స్థితిలో ఉన్న చాణక్యుని అర్థశాస్త్రం తాళపత్ర గ్రంథం నకలు దొరికిందని, వాటి అర్థం తెలిసిన పండితులొకరు ఆంగ్లంలోకి అనువదించి, పుస్తకాలుగా ముద్రించడంతో చాణక్యుని ఖ్యాతి, భారతీయ సంస్కృతి గొప్పదనం ప్రపంచానికి తెలిసిందని అంటారు. అప్పటి వరకు చాణక్యుడు ఒక పురాణ పాత్ర, కావ్య పండితుడు. అంతే.
విశాఖదత్తుని ‘ముద్రారాక్షసం’ నాటకంలో -

‘‘చాణక్యుడు తంత్ర జ్ఞుడైన బ్రాహ్మణుడు. అర్థశాస్త్రాన్ని రచించినవాడు. చాణక్య కుటిల నీతి అనేది ఇతడి నుంచే వాడుకలోకి వచ్చింది. కొంతమంది ఇతడిని కౌటిల్యుడు అంటారు. నందుల్ని (నందవంశస్థులు) మ్లేచ్ఛుల చేత చంపించి, చంద్రగుప్తుణ్ణి రాజుగా చేసి నందుల మంత్రి రాక్షసుణ్ణే చంద్రగుప్తుడి మంత్రిగా చేస్తాడు’’ అని ఉంది.

ఎవరెలా అభివర్ణించినా, ఏ గ్రంథం ఎలా ప్రస్తావించినా... చాణక్యుడు పుట్టిన స్థల కాలాల విషయంలో మాత్రం అన్ని గ్రంథాలలోనూ దాదాపుగా ఏకరూపత కనిపిస్తుంది. చాణక్యుడి అసలు పేరు విష్ణుగుప్తుడు. తండ్రి చణకుడు కాబట్టి ఆ పేరుతో చాణక్యుడయ్యాడు. (పంజాబ్‌లోని ‘చాణక్’ అనే ప్రదేశంలో జన్మించాడు కాబట్టి చాణక్యుడయ్యాడనే భావన కూడా ఉంది).

చాణక్యుడు కౌటిల్యుడిగా కూడా ప్రసిద్ధుడయ్యాడు. కుటిలత్వం కారణంగా కౌటిల్యుడనే పేరు వచ్చిందనే సాధారణ అపార్థం ఒకటి చెలామణిలో ఉంది కానీ, నిజానికది గోత్రనామం అని చరిత్రకారుల పరిశీలన.

ఇంతకీ చాణక్యుడు ఎప్పటి వాడు? ఎక్కడి వాడు?
క్రీ.పూ. 370 - 283 మధ్య చాణక్యుడి జీవించి ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అయితే అతడు ఏ ప్రాంతానికి చెందినవాడనే విషయమై అనేక వాదనలు ఉన్నాయి. అతడు రాశాడని చెబుతున్న అర్థశాస్త్రంగానీ, నీతిశాస్త్రం కానీ అతడివి కావ నే వాదనా ఉంది, షేక్స్‌పియర్ రచనల మీద ఉన్నట్లు.

చాణక్యుని జన్మస్థలం ఉత్తర భారతదేశమని, దక్షిణ భారతదేశమనీ, తక్షశిల అనీ భావించడానికి ఆధారమైన రచనా సాహిత్యం కొంత అందుబాటులో ఉంది. తెలుగులో మామిడిపూడి వెంకట రంగయ్య, నెల్లూరి సత్యనారాయణ వంటి పరిశోధకులు... చాణక్యుని ప్రాంతీయతను నిర్థరించే ప్రయత్నం కొంత చేశారు. ఈ ప్రయత్నాలన్నిటికీ మూలాధారం మళ్లీ చాణక్యుని ఆర్థ, నీతి శాస్త్రాలే.

ఉదా: అర్థశాస్త్రంలో 18 ముహూర్తాలు గల పగలు అతి దీర్ఘమైనదని చాణక్యుడు పేర్కొన్నాడు. అటువంటి దీర్ఘమైన పగలు ఉత్తరదేశంలో కనిపిస్తుంది. ఈ విధంగా చాణక్యుడు ఉత్తరదేశస్థుడు. అయితే అర్థశాస్త్ర ప్రతులు చాలావరకు దక్షిణ దేశంలో లభించడాన్ని బట్టి ఆయన దక్షిణదేశస్థుడు అని భావించడానికి వీలు కలిగింది. తక్షణశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేశారు కాబట్టి తక్షశిల ప్రాంతీయుడు అయివుంటారని ఇంకో అభిప్రాయం. పూర్వం గాంధార రాజ్యానికి ముఖ్య పట్టణంగా ఉన్న తక్షశిల ప్రస్తుతం పాకిస్థాన్‌లోని రావల్పిండి జిల్లా పరిధిలో ఉంది. గుప్తులశకం అంతరిస్తున్న తరుణంలో కనుమరుగైన చాణక్య గ్రంథాలు తిరిగి 1915 వరకూ లభ్యం కాలేదు. చాణక్యుడి గురించి ప్రపంచానికి కాస్త గట్టిగా తెలుస్తున్నదంతా గత వందేళ్ల నుంచే.

********


ఎవరి తెలివితేటలనైనా ప్రస్తుతించేటప్పుడు ‘అపర చాణక్యుడు’ అంటారు. అంటే చాణక్యుడంతటి వాడని. చాణక్యుడు మేధావి. చంద్రగుప్తుడు అనే ఓ సాధారణ బాలుడిని చేరదీసి, అతడి తల్లి పేరుతో ఒక సామ్రాజ్యాన్నే స్థాపించి, దానికి చక్రవర్తిని చేసిన రాజనీతిజ్ఞుడు. చంద్రగుప్తుడి తల్లి పేరు ‘ముర’. ఆమె పేరు మీదే చాణక్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మించాడు. మంత్రిగా సలహాలిచ్చి చంద్రగుప్తుడికి తిరుగులేని సార్వభౌమాధిపత్యాన్ని సాధించిపెట్టాడు.

ఇన్ని తెలివితేటలు, ఇంత లౌక్యం, అపారమైన ప్రజ్ఞ, దార్శనికత... ఇవన్నీ చాణక్యుడికి తండ్రి నుంచి పుట్టుకతో సంక్రమించాయనుకోవాలి. తండ్రి చణకుడు వేద పారంగతుడు. వైద్య పండితుడు. గొప్ప జ్యోతిష్యుడు. శివ, విష్ణువులను ఆరాధించే భగవత్ సంప్రదాయాన్ని అనుసరించే శోత్రీయ కుటుంబానికి చెందినవాడు. అయితే వ్యక్తిగతంగా చణకుడు విష్ణు భక్తుడు. అందుకే కావచ్చు తనయుడికి విష్ణుగుప్తుడు అనే పేరు పెట్టుకున్నాడు. విష్ణుదేవుడి సేవకుడి పేరు అది. తర్వాత చాణక్యుడు కూడా తండ్రినే అనుసరించాడు. విష్ణువుని ఆరాధించాడు.

చాణక్యుని తండ్రి చణకుని పూర్వీకులు కేరళ ప్రాంతానికి చెందినవారనీ, అక్కడి నుంచి విద్యాభ్యాసం కోసం చాణక్యుడిని తక్షశిల పంపారనీ, ఆ తర్వాత అక్కడి విశ్వవిద్యాలయంలోనే ఆచార్యుడిగా చేరాడని ఒక కథనం. తక్ష శిల... మహామహులు చదివిన విద్యాపీఠం. తక్షశిల అంటే కఠిన శిల అని అర్థం. జీవితంలో ఎదురయ్యే కఠినమైన సమస్యలను తట్టుకుని నెగ్గుకు రావడం ఎలాగో తక్షశిల నేర్పుతుందనే ఉద్దేశంలో ఆ పేరు పెట్టారు.

విద్యార్థిగా చాణక్యుడు ఇక్కడే రాటు తేలాడు. మనం ఇప్పుడు కష్టమనుకుంటున్న పాఠ్యాంశాలన్నీ ఇష్టంగా చదివాడు. ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్, మేథ్స్, మెడిసిన్, ఆస్ట్రాలజీలను తేలిగ్గా చదివి సూక్ష్మాలను గ్రహించాడు. కొత్త విషయాలను కనిపెట్టి ప్రొఫెసర్‌గా ఇక్కడే విద్యార్థులకు బోధించాడు. మధ్య యుగాలనాటి అంధకారం నుంచి భారతావనికి వెలుగును ప్రసాదించిన జీవన నైపుణ్యాల జనకుడు చాణక్యుడు.

చంద్రగుప్తుడి తర్వాత మూడు తరాలు చాణక్యుని నీతి సూత్రాలతోనూ దేశాన్ని పాలించాయి. తర్వాతి రాజ వంశాలు, రాజ్యాంగాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలూ ఆ సూత్రాలను అనుసరిస్తూ వస్తున్నాయి. ఇప్పటికీ మన బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో చాణక్యుడిదే సిలబస్!

రాజులకు, చక్రవర్తులకు మంచి చెప్పాలనుకోవడం ప్రాణాలకు తెగించడమే. తండ్రి చణకుడు, తనయుడు చాణక్యుడు ఇలా ఇద్దరూ ప్రాణాలకు తెగించినవారే. ఇందుకు దారితీసిన కారణాలు కూడా ఒకే విధమైనవి కావడం విధి చిత్రమో, యాదృచ్ఛికమో తెలీదు. బహుశా అనువంశికం అయి ఉండాలి. మగధరాజు మహానందుడికి మంచి చెప్పబోయి చణకుడు ప్రాణాలు పోగొట్టుకుంటే, మహానందుడి వారసుడు ధననందుడికి మంచి చెప్పబోయి చాణక్యుడు తన ప్రతిష్టను భంగపరుచుకుని, శపథం చేయవలసి వచ్చింది.

రాజవంశీయుడు కాకుండానే రాజైన వాడు మహానందుడు! అతడొక సాధారణ పౌరుడు. మగధ రాజధాని పాటలీపుత్రంలో క్షురకునిగా జీవితం సాగిస్తున్నవాడు. అలాంటివాడు కుట్రపన్ని మగధ రాజును హతమార్చి అందలం ఎక్కుతాడు. ప్రజలు తిరుగుబాటు చేస్తారు. మహానందుడు ఆ తిరుగుబాటును అణిచివేస్తాడు. విజయగర్వంతో ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తాడు. కేళీవిలాసాలకు బానిసై కాలక్షేపం చేస్తుంటాడు. ఈ సంగతి దక్షిణాదిని (ప్రస్తుతం మైసూరు) పాలిస్తున్న ఉత్తుంగ నరసింహుడుకి తెలుస్తుంది. అతడు తెలివైనవాడు. శక్తిమంతుడు. మగధపై దాడి చేసి తన రాజ్యంలో కలుపుకోవాలని పథకం వేస్తాడు. ఈ విషయం తెలిసిన చణకుడు మహానందుడిని కలిసి రాబోతున్న ముప్పు గురించి హెచ్చరిస్తాడు. ‘ఏం చెయ్యాలో నాకు తెలుసు. నాకు నీతులు చెప్పడానికి వస్తావా?’ అని ఆగ్రహించి మహానందుడు అతడిని చంపిస్తాడు. తర్వాత నరసింహుడు మహానందుడిని చంపేస్తాడు. నవనందులైన మహానందుడి తొమ్మిది మంది కుమారులను చెరసాలలో వేయిస్తాడు.

సరిగ్గా ఇక్కడే చాణక్యుడు రంగ ప్రవేశం చేస్తాడు. నరసింహుడుని ఒప్పించి, నవనందులను విడిపించి, వారి కుటుంబాల క్షోభ తీరుస్తాడు. తిరిగి తక్షశిల వెళ్లిపోతాడు. తర్వాతి పరిస్థితులు త్వరత్వరగా మారిపోతాయి. మగధపై నరసింహుడు పట్టు తగ్గుతుంది. నవనందులలో ఒకరైన ధననందుడు తన ఎనిమిది మంది సోదరులను హతమార్చి తనను తను మగధకు రాజుగా ప్రకటించుకుంటాడు. అప్పుడది అలెగ్జాండర్ జైత్రయాత్ర జరుపుతున్న సమయం. లోకాలన్నీ జయించాక చివరిగా అతడు భారతావనిని కూడా సమీపించే సూచనలు ఉన్నాయని చాణక్యుడు ధననందుడిని హెచ్చరిస్తాడు. ధననందుడు అతడిని అవమానించి పంపుతాడు. అప్పుడు చేసిందే చాణక్యుడు శపథం. దాన్ని నెరవేర్చుకునేందుకు అతడి పడిన కష్టం, పట్టిన దీక్ష... ఇవే చాణక్యుడి జీవితంలోని ప్రధాన ఘట్టాలు. ఇవే అతడి జీవితంలో చరిత్రకారులు గుర్తించిన ముఖ్యాంశాలు.

ధననందుడిని పదవీచ్యుతుడిని చేసి, నందవంశాన్ని అన్యాక్రాంతం చేస్తానని ప్రతిన పూని తక్షశిల వెళ్లిపోయాక చాణక్యుడు యోగ్యుడైన భావి చక్రవర్తిని అన్వేషించే పనిలో పడ్డాడు. ముడి వీడిన శిరోజాలు ప్రతీకార జ్వాలలై అనుక్షణం అతడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తున్నాయి. ఎదురవుతున్న ప్రతి యువకుడిలోనూ అతడు మగధ వారసుడినే చూస్తున్నాడు! కానీ ఎవ్వరిలోనూ తనకు కావలసిన లక్షణాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో... చెట్లు, పుట్టలు, పల్లెలు, పట్నాలు గాలిస్తున్న చాణక్యుడికి లొఖాండీ అనే అటవీ ప్రాంతంలో (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో)... ఒక వేసవి ఉదయం, బాల భానుడితోపాటు, ప్రచండ భానుడిలాంటి బాలుడు చాణక్యుడి కంట పడ్డాడు. అతడే చంద్రగుప్తుడు!

ఆ సమయంలో చంద్రగుప్తుడు.. క్రూరుడైన తన గురువును ఎదిరించి మాట్లాడుతూ ఉన్నాడు. ‘తమరు చేస్తున్నది తప్పు’ అని వాదిస్తున్నాడు. విద్యాబోధన పేరుతో జరిగే దౌర్జన్యాన్ని సహించనని చెబుతున్నాడు. ‘చదువులో మాత్రమే మీరు నాకన్నా అధికులు. మనిషిగా నేను మీకన్నా అధికుడిని’ అని ధైర్యంగా అంటున్నాడు.

చాణక్యుడికి ముచ్చటేసింది. నేరుగా బాలుడి తల్లి దగ్గరకు వెళ్లాడు. ‘‘నీ కుమారుడిని మగధకు చక్రవర్తిని చేస్తాను. నాతో పంపించు’’ అని అడిగాడు. అమె పేరు మురా దేవి. మయూరాలను కాసే కొండ ప్రాంత మహిళ. నందసోదరులలో ఒకరు ధననందుడి చేతిలో మరణించక ముందు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇటువైపు వచ్చి ముర అందానికి ముగ్ధుడై ఆమెను వివాహమాడతాడు. వారికి పుట్టినవాడే చంద్రగుప్తుడని, ఈ తల్లీకొడుకులు ధననందుడి కంటపడకుండా అడవిలో జీవనం సాగిస్తున్నారని చాణక్యుడు గ్రహిస్తాడు. ముర అనుమతిపై చంద్రగుప్తుడిని తన వెంట తీసుకెళ్లి విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. అతడి పద్దెనిమిదవ యేట రాజ్యాధికార కాంక్ష రగిలిస్తాడు.

అప్పటికి నందవంశం... మధ్య, దిగువ గంగానదీ పరివాహక ప్రాంతలలో విస్తరించి ఉంటుంది. చాణక్యుని వ్యూహం ప్రకారం చంద్రగుప్తుడు నంద వంశానికి వ్యతిరేకంగా భారతావనిలోని మిగతా రాజ్యాలను ఏకం చేసి దండయాత్ర చేస్తాడు. నందులను రాజ్యభ్రష్టులను చేసి, మౌర్యసామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. తూర్పున బెంగాల్ అస్సాంల నుంచి పశ్చిమాన ఆఫ్గనిస్థాన్, బెలూచిస్తాన్‌ల వరకు, ఉత్తరాన కాశ్మీర్, నేపాల్‌ల నుంచి, దక్షిణాన దక్కను పీఠభూమి వరకూ మౌర్యులదే రాజ్యం! అప్పటికిగానీ చాణక్యుడు శాంతించడు!

తొలి ఐదేళ్ల వరకు నీ బిడ్డపై గారాలు కురిపించు. తర్వాతి ఐదేళ్లు దారిలో పెట్టేందుకు దండించు. పదహారేళ్లు వచ్చేటప్పటికి స్నేహితుడిగా మసులుకో. ఎదిగిన బిడ్డలే నీ ఆప్తమిత్రులు - అంటాడు చాణక్యుడు. చంద్రగుప్తుడిని కూడా అతడు తన బిడ్డలానే చూసుకున్నాడు. చివరి వరకు వెన్నంటే ఉన్నాడు. చంద్రగుప్తుడి తర్వాత ఆయన కుమారుడు బిందుసారుడు, బిందుసారుడి తర్వాత అతడి కుమారుడు అశోకుడు... చాణక్యనీతిని అనుసరించే రాజ్యపాలన సాగించారు. శిష్యుడు చంద్రగుప్తుడు 42 వ యేట చనిపోతే... గురువు చాణక్యుడు తన 87 యేట వృద్ధాప్యంలో అనారోగ్యంతో తనువు చాలించాడు.

********

చాణక్యుడి స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోడానికి అర్థశాస్త్రం ఉపయుక్తమైన గ్రంథం. రామాయణం కాండలుగా, మహాభారతం పర్వాలుగా, భాగవతం స్కందాలుగా ఉన్నట్లే చాణక్యుడి అర్థశాస్త్రం అధికరణాలుగా ఉంటుంది. మొత్తం పదిహేను అధికరణాలివి. రాజ్యపాలన, పౌరధర్మం, సామాజిక నీతి ఇందులోని ముఖ్యాంశాలు. ఇవన్నీ ఆయన అనుభవాలలోంచి సిద్ధాంతీకరించిన సూత్రీకరణలే కాబట్టి చాణక్యుడు ఇంకోలా ఇంకోలా ఉండేందుకు లేదు. రాసిందొకటీ, చేసిందొకటీ అయ్యేందుకు లేదు.

********


నీతి, ధర్మం అనేవి తప్పకూడనివి. కానీ... తప్పడమే నీతి, ధర్మం అనే పరిస్థితులు ఎప్పుడైనా ఎదురుకావచ్చు. అప్పుడు మనం తీసుకునే నిర్ణయం ఎలాంటిదైనా, దానిని సమర్థించుకోడానికి కారణాలు వెతుక్కునే పనిలేకుండా, పరిస్థితులనే వాటంతటవి మనకు కాపుగాసేలా మలుచుకోవాలి. ఇదే చాణక్య నీతి.
- సాక్షి ఫ్యామిలీ

చాణక్యుడు, ఆర్థికవేత్త
(మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని గురువు)
జననం : పూ. 370
మరణం : పూ. 283
జన్మస్థలం : ఉత్తర భారతదేశం
తండ్రి : చణకుడు
తల్లి : కచ్చితమైన వివరాలు లేవు.
చదువు, కొలువు : మొదట తక్షశిల విశ్వవిద్యాలయంలో తర్వాత చంద్రగుప్తుని మంత్రిగా
రాసిన గ్రంధాలు : అర్థశాస్త్రం, చాణక్య నీతి

చాణక్య నీతి చంద్రిక
పూల సౌరభం గాలి వీస్తున్న వైవే వ్యాపిస్తుంది. మంచితనపు పరిమళాలు అన్ని దిక్కులకూ విస్తరిస్తాయి.

నిరంతరం పనిలో నిమగ్నమైయున్నవారు నిత్యం సంతోషంగా ఉంటారు.

ఓటమికి ఇంకొక పేరు అసూయ.

రాజు సగటు మనిషిగా జీవించే చోట ప్రజలు రాజభోగాలు అనుభవిస్తారు. పాలకులు రాచరిక సౌఖ్యాలను అనుభవించే చోట ప్రజలు యాచకులై జీవిస్తారు.

అధముడి దగ్గరైనా సరే , ఏదైనా మంచిని నేర్చుకోవలసి వస్తే వెనుకాడవద్దు.

భయం దరి చేరగానే దాన్ని ఎదుర్కొని నాశనం చెయ్యి.

చాణక్య చంద్రగుప్త
అది 1977వ సంవత్సరం. ఎన్టీఆర్ ‘చాణక్య చంద్రగుప్త’ సినిమా చేయాలనుకున్నారు. పైగా ఆ సినిమాను భారీ మల్టీస్టారర్‌గా నిర్మించాలనుకున్నారాయన. అక్కినేనిని ఎలాగైనా తన సంస్థలో, తన డెరైక్షన్‌లో నటింపజేయాలనేది ఎన్టీఆర్ చిరకాల వాంఛ. స్వతహాగా ఎన్టీఆర్‌కి చాణక్యుడి పాత్రంటే ఇష్టం. అందుకే ఆ పాత్రను తానే పోషించి, చంద్రగుప్తుడి పాత్రను అక్కినేనితో చేయించాలి అనుకున్నారాయన. కానీ ఏఎన్నార్ అందుకు ఒప్పుకోలేదు. ‘‘చంద్రగుప్తుడు మహావీరుడు. అలాంటి పాత్ర నువ్వు చేస్తేనే కరెక్ట్ బ్రదర్. నేను చాణక్యుడిగా చేస్తాను’’ అని తన అభిప్రాయం వెలిబుచ్చారు. ఆయన అభిప్రాయాన్ని గౌరవించి ఎన్టీఆర్ చంద్రగుప్తుడిగా, అక్కినేని చాణక్యుడిగా సినిమా మొదలైంది. అలెగ్జాండర్‌గా శివాజీగణేశన్ చేశారు. అదే ఏడాది ఆగస్ట్ నెలలో సినిమా విడుదలైంది. సరిగ్గా ఆ సినిమా విడుదలైన పదిహేళ్ల తర్వాత ఎన్టీఆర్ ‘సామ్రాట్ అశోక’ చిత్రం నిర్మాణానికి పూనుకున్నారు. అశోకుడిగా ఎన్టీఆరే నటించారు. అయితే.. చాణక్యుడిగా నటించాలన్న తన కోరిక తీరకపోవడంతో... చనిపోయిన చాణక్యుడు ఆత్మరూపంలో వచ్చి అశోకుడి తల్లికి గురోపదేశం చేసినట్టుగా.. అవసరం లేకపోయినా ఓ సన్నివేశాన్ని ఆ సినిమా కోసం సృష్టించారు ఎన్టీఆర్. ఆ సన్నివేశంలో తానే చాణక్యుడిగా నటించి కోరిక తీర్చుకున్నారు. తెలుగు సినిమా తల్లికి రెండుకళ్ళుగా చెప్పుకునే ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు ఇష్టపడి మరీ చాణక్యుడి పాత్రను పోషించడం విశేషం.